ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Monday, December 20, 2010

ఒక గోళీ సోడా క‌థ‌..చాలా కాలం త‌ర్వాత మా ఫ్రెండ్ ర‌విని క‌లిశాను. చాలా కాలం అంటే చాలా కాలం అన్న మాట‌.. ఇంకా చెప్పాలంటే 13 సంవ‌త్సరాల త‌ర్వాత అన్నమాట‌. నిజ్జంగా నిజ్జం. ఎంత నిజ్జం అంటే, మన గోదావ‌రి తల్లి వ‌య్యార‌మంత నిజ్జం. రేలంగి సెంట‌ర్ లో మా ర‌విని చూడ‌గానే చాలా సంతోషం వేసింది. వాడు అస్సలు మార‌లేదు. అప్పుడు కూడా చాలా స్మార్ట్ గా ఉండేవాడు. అదే స్టయిల్ లో హాయి గా న‌వ్వుతూ ప‌ల‌క‌రించాడు. ఈ న‌వ్వుతోనే ఎవ‌రో ఒక‌రిని ప‌డ‌గొట్టేస్తావురా అంటూ ఉండేవాడిని... అన్న ట్లే అయింద‌ని త‌ర్వాత చెప్పాడు ఒక స్టోరీ. ఇప్పుడు అది అప్రస్తుతం. మా ర‌వి మాత్రం నన్ను కావ‌లించుకొని చాలా సేపు ఉండిపోయాడు. దాదాపు 13 సంవ‌త్సరాల త‌ర్వాత చూసుకొన్న అనుబంధం.
హైదరాబాద్ లో టీవీ జ‌ర్నలిస్టు గా ఉరుకులు, ప‌రుగులు జీవితం గ‌డిపే మ‌న‌కు,, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా లో స్వచ్చమైన గోదార‌మ్మ ఒడిలో త‌ణుకు ప‌క్కన గువ్వలా ఒదిగిపోయిన రేలంగి లాంటి ఊరెళితే ఎలా ఉంటుంది..! సిటీ బ‌స్సు కండ‌క్టర్ కు ఓల్వా బ‌స్సు డ్యూటీ ప‌డ్డట్లు, గూడ్స్ బండి గార్డ్ కు ఏసీ టూ టైర్ కోచ్ లో టీసీ పోస్టింగ్ ఇచ్చిన‌ట్లు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే ముందు ఎటువంటి ఎసైన్ మెంట్లు చెప్పకుండా బాస్ సాగ‌నంపిన‌ట్లు...ఇలా ఎన్నయినా ఊహించుకోవ‌చ్చు. కానీ, ఈ ఊహ‌ల క‌న్నా ఆ రేలంగి ఊరే బాగుంది. పైగా మా రవిది డాబా ఇల్లు కాబ‌ట్టి పై అంత‌స్తు కి చేరిపోయాను. ర‌వి శ్రీ‌మ‌తి కూడా న‌న్ను సాద‌రంగా ఆహ్వానించారు. ఇంట్లో ద‌గ్గరుండి అతిథి మ‌ర్యాదలు చేశారు. హై స్కూలు లో చిగురించిన మా స్నేహం , కాలేజీ రోజుల్లో కూడా ఎలా ప‌రిమ‌ళించిందో ఇద్దరం గుర్తు చేసుకొన్నాం. నేను పెద్దాపురం కాలేజీ లో చ‌దువు వెల‌గ‌బెడుతున్నప్పుడు కాకినాడ కు సైకిల్ మీద చెక్కేసేవాడిని. అక్కడ ర‌విని తీసుకొని కాకినాడ లో బలాదూర్ తిరిగే వాళ్లం. తిరిగి ఇంటికి పాతిక కిలోమీటర్లు - సైకిల్ మీద వ‌చ్చినా అల‌స‌ట ఉండేది కాదు, ఎందుకంటే మా ర‌వి అంత బ్రహ్మాండంగా ఎ న‌ర్జీ ఇచ్చి పంపించేవాడు. రేలంగిలో కూడా అదే జ‌రిగింది.
ఉద‌య కాంతుల్లో కొబ్బరాకుల చాటున లేలేత కిర‌ణాలు దోబూచులాడుతుండ‌గా అక్కడ అడుగు పెట్టాను. మ‌ద్యాహ్నం దాకా మాకు పాత క‌బుర్లు గ్రైండ్ చేసుకోవ‌ట‌మే స‌రిపోయింది. మ‌ధ్యాహ్నం ర‌వి వాళ్ల శ్రీ‌మ‌తి భోజ‌నానికి పిలిచే దాకా మేం క‌బుర్ల లోనే మునిగిపోయాం. కాలేజీ రోజుల త‌ర్వాత ఒక్కో సంవ‌త్సరం లెక్కించుకొంటూ, ఆ సంవత్సరంలో తాను ఎక్కడ ఉన్నదీ, నేను ఎక్కడ గ‌డిపిందీ లెక్కలు వేసుకొన్నాం. అస‌లు మేం క‌లిసింది కూడా గ‌మ్మత్తే. గోదావ‌రి యూత్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో పాత మిత్రుల వివ‌రాలు కొంత దొరికితే జ‌గ్గంపేట లో ఎంక్వయిరీ చేయించా. అక్కడ లెక్కల మాస్టారు ర‌మ‌ణ‌మూర్తి గారి చిరునామా దొరికింది. ఆ రూట్ లో ప్రయ‌త్నిస్తే మా ర‌వి అడ్రస్ దొరికింది. దొరికిన నెల రోజుల‌కే సెల‌వు దొర‌క పుచ్చుకొని ఒక రోజు భాగ్యానికి ఎగురుకొంటూ రేలంగి లో వాలిపోయా. గోదావ‌రి యూత్ డాట్ కామ్ కాన్ సెప్ట్ విని మా ర‌వి వాళ్ల శ్రీ‌మ‌తి ఆశ్చర్య పోయారు. ఆమె చేతి భోజ‌నం ఇద్దరం సుష్టుగా తిని బ‌య‌ట ప‌డ్డాం. జ‌ర్నలిస్టుల‌కు కూడా చాలిన‌న్ని సెల‌వులు ఇచ్చే హామీ ఇస్తే నా ఓటు వారికే వేద్దామ‌ని చాలా కాలం నుంచి అనుకొంటున్నాను కానీ, ఇది ఒక తీర‌ని కోరిక అని తెలుసుకొన్నాను. కాబ‌ట్టే సాయంత్రం హైద‌రాబాద్ వెళ్లేందుకు బ‌య‌ట ప‌డ్డాను. అప్పుడే మ‌రిచిపోలేని బ‌హుమ‌తి ఇచ్చాడు మా ర‌వి.
కొట్టవోయ్ సోడా..!
ఊరి చివ‌ర ఉన్న బడ్డీ కొట్టు ద‌గ్గర ఆపి గోళీ సోడా తాగించాడు. నిజంగా ఎంత రుచిగా ఉంది. ఎన్ని సంవ‌త్సరాలై పోయింది సోడా తాగి. వారెవ్వా... హైద‌రాబాద్ లో డబ్బు పాడేస్తే అన్నీ దొరుకుతాయంటారు. ఎంత నిజ‌మో తెలీదు కానీ, గోళీ సోడా దొర‌క‌నే దొర‌క‌దు. పైగా బ‌డ్డీ కొట్టు ద‌గ్గర కులాసాగా నిల‌బ‌డి, విలాసంగా సోడా తాగుతుంటే ఆ స్టయిలే వేరు. మా చిన్నప్పుడు చిరంజీవి, బాల‌కృష్ణ ఫ్యాన్స గా విడిపోయి మేం కొట్టుకొనే వాళ్లం. అంటే చిరు అభిమానుల కొట్టు అంటే అక్కడ చెక్కల కు చిరంజీవి పోస్టర్లు అంటించి ఉంటాయ‌న్న మాట‌. అక్కడకు బాల‌య్య అభిమానులు పోర‌న్న మాట‌. ఇక‌, బాల‌య్య బొమ్మలు బెమ్మాండంగా అంటించిన కొట్టు బాల‌య్య ఫ్యాన్స్ ది. అక్కడే బాల‌కృష్ణ అభిమానులు సోడాలు తాగినా, కార‌ప్పూస తిన్నా. అది రూల్ మ‌రి. ల‌క్కీగా నేను ఇప్పుడు ఎవ‌రికీ ఫ్యాన్ కాక‌పోవ‌టం, అక్కడ ఏ బొమ్మలు లేక‌పోవ‌టంతో ర‌వి బ‌తికిపోయాడు. ఆ సంగతే ర‌వితో చెబితే ప‌డి ప‌డి న‌వ్వాడు. నిజంగా అదే ర‌వికి ఉన్న ఎసెట్. స్మార్ట్ గా ఉంటూ స్టయిల్ గా న‌వ్వటం. ఈ న‌వ్వుతోనే ఎవ‌రినైనా ప‌డేస్తావురా అనే వాడిని. అదే మాట అంటే స్టయిల్ గా న‌వ్వుతూ త‌ణుకు బ‌స్టాండ్ కు తీసుకొని వ‌చ్చాడు. ఏడాదికి ఒక‌సారి సంక్రాంతి పండ‌గ వ‌చ్చిన‌ట్లు, ఒక్క రోజు లో మా ర‌విని చూసి రాగ‌లిగాను, క‌లిసి సోడా తాగ‌గ‌లిగాను. మ‌రిచిపోలేని అనుభూతుల్ని మురిపెంగా మూట క‌ట్టుకొని , కాంక్రీట్ ఊసల వంటి హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరాను. మ‌ర్నాటి ఎసైన్ మెంట్లకు సంబందించి ఎస్ ఎమ్ ఎస్ లు స‌వ‌రించుకొంటూ ప్రయాణం సాగిపోయింది.

2 comments:

  1. చాలా బాగున్నాయండీ మీ కబుర్లు ... జర్నలిస్ట్ అనిపించుకున్నారు

    ReplyDelete
  2. మీ బ్లాగ్‌లో పొస్ట్‌లన్నీ చూశాను. గోదావరీ యూత్ పేరు మహిమ అది. మీ వూరి విశేషాలు బాగున్నాయ్. బై ద వే, మీరు ఎవరి కామెంటుకీ సమాదానం ఇవ్వరనుకొంటాను!

    ReplyDelete