ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Sunday, August 4, 2013

మేమే అత్యంత దుర‌దృష్టవంతులు..!

అదృష్టం, దుర‌దృష్టం అన్నవి మ‌న చేతిలో ఉండ‌వు. ప‌రిణామాలు జ‌రిగినప్పుడు మ‌నం అదృష్టవంతులో, దుర‌దృష్టవంతులో తెలిసి పోతుంది.
మ‌న స‌మాజంలో త‌ల్లిదండ్రుల మాటే శిరోధార్యం. ముఖ్యంగా తండ్రి ఏం చెబితే అది విన‌టం, ఆచ‌రించ‌టం ఆన‌వాయితీ. దీనికి వ్యతిరేక‌త చెప్పటానికి కూడా సావ‌కాశం ఉండేది కాదు. ఏది చ‌ద‌వ‌మంటే అది చ‌ద‌వ‌టం, ఏం చెబితే అది విన‌టం..ఆన‌వాయితీ. దాదాపుగా ప్రతీ ఇంట్లో అదే ప‌రిస్థితి. దుస్తులు కొని పెట్టడం, వాటిని కుట్టించ‌టం, బొమ్మలు కావాలంటే పెద్దల ద‌యా దాక్షిణ్యాల మీద ఆధార ప‌డి ఉండేది. త‌ర త‌రాలుగా ఇదే తంతు. చిన్నప్పుడు పెద్దల చేతిలో అవ‌స్థలు ప‌డ‌టం, త‌ర్వాత పెద్దయ్యాక పిల్లల‌కు సుద్దులు చెప్పటం కొన‌సాగింది. ప్రతీ త‌రం ఈ విష‌యంలో ముందు ఇబ్బంది ప‌డినా, పెద్దయ్యాక అధికారం చెలాయించింది.
కానీ మా త‌రం వ‌చ్చేస‌రికి మ్యాట‌ర్ రివ‌ర్స్ అయింది. చిన్నప్పుడు మా పెద్దల చేతిలో మ‌గ్గిపోయిన మేం.. ఇప్పుడు మా పిల్లల చేతిలో మ‌గ్గిపోతున్న ప‌రిస్థితి. ఏ ఇంట్లో చూసినా పిల్లల‌దే ఆధిప‌త్యం సాగుతోంది. పిల్లలు ఏం కొన‌మంటే అది కొనాల్సిందే. పిల్లలు ఏ చానెల్ చూద్దామనుకొంటే ఆ చానెల్ చూడాల్సిందే. పిల్లలు ఏ కోర్స్ చ‌దువుతామంటే దానికి ఫీజు క‌ట్టాల్సిందే. పిల్లల కోసం మా స‌ర్వస్వం అన్న ట్రెండ్ కొన‌సాగిస్తున్నాం. ఇది తప్పని చెప్పటం లేదు సుమా..! స‌మాజంలో వచ్చిన ఒక మార్పుకి మా త‌రం వేదిక అయింది. అప్పటి దాకా కొన‌సాగిన ట్రెండ్ మా త‌రంలోనే రివ‌ర్స్ అయింది. ఇక నుంచి పిల్లల మాట నెగ్గే ప‌రిస్థితులు కొన‌సాగుతాయి. మొత్తం మీద మేం మాత్రం చిన్నప్పుడు పెద్దల మాట విన్నాం. ఇప్పుడు పిల్లల మాట వింటున్నాం.. అందుచేత మేమే అత్యంత దుర‌దృష్టవంతులం..!

Monday, July 29, 2013

మా ఊర్లో మ‌హిళ‌లు ఏం చేస్తున్నారంటే... వామ్మో...!


మా ఊరు గురించి ఎంత చెప్పినా త‌నివి తీర‌దు.. ఎంత మాట్లాడినా మ‌న‌సు ఆగ‌దు. ఇది సోత్కర్ష అనుకోకండి సుమీ..! మొన్నటికి మొన్న మా ఊరు వెళ్లిన‌ప్పుడు ఇంకో కొత్త విష‌యం గ‌మ‌నించాను. ఊరిలో మ‌హిళ‌లే మ‌హారాణులుగా వెలిగిపోతున్నారు. గ‌తంలో ఇంటి బాధ్యత మ‌గ వారి చేతిలో ఉంటే ఆడ వారు కేవ‌లం వంట ఇంటికి ప‌రిమితం అయ్యేవారు. మ‌గ‌వారు వ్యవ‌సాయంలో ఉంటే పాడి ప‌శువుల సంగ‌తి ఆడ‌వారు చూసుకొనే వారు. కుటుంబ వ్యవ‌హారాల‌న్నీ మ‌గ‌వారివే. దీంతో ఆయ‌న చెప్పిన‌దానికి ఆమె ఊ కొట్టడ‌మే ప‌ర‌మావ‌ధిగా ఉండేది. మొన్న ఈ ట్రెండ్ కు భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. సెల్ ఫోన్‌లు చేతిలో ధ‌రించిన మ‌హిళ‌లు ప్రతీ ఇంట్లో కనిపించారు. ఇప్పుడు అంతా క‌మ్యూనికేష‌న్ చుట్టు తిరుగుతోంది. బ్యాంక్‌ల‌కు సైతం ఇద్దరు, ముగ్గురు మ‌హిళ‌లు క‌లిసి వెళ్లి ప‌నులు చ‌క్క బెట్టుకొంటున్నారు. డ్వాక్రా గ్రూపుల పుణ్యమా అని ఈ మార్పు వ‌చ్చింద‌ని మా మిత్రులు చెప్పారు. అది క‌ళ్లారా చూశాను. బ్యాంకు మేనేజ‌ర్ ను నేరుగా సంప్రదించి త‌మ ఆర్థిక విష‌యాలు నేరుగా మాట్లాడేస్తున్నారు. ఇందులో కొంద‌రు మా హైస్కూల్ మేట్స్ ఉన్నారు. ఆ మ‌హిళ‌లు ఉత్సాహంగా న‌న్ను ప‌ల‌క‌రించి హైద‌రాబాద్ విష‌యాలు అడిగి తెలుసుకొన్నారు. ప‌నిలో ప‌నిగా మా శ్రీ‌మ‌తిని ప‌ల‌క‌రించి వెళ్లారు.
ఇప్పుడు ఏ ప‌నికైనా దంప‌తులు ఇద్దరూ బైక్ మీద వెళ్లి చ‌క్క బెట్టుకొని రావ‌టాన్ని గ‌మ‌నించాను. అప్పట్లో మా ఊరి మోతుబ‌రి రైతు స్కూట‌ర్ కొనుక్కొన్నారు. కానీ దానీ మీద ఆయ‌న శ్రీ‌మ‌తి కూర్చొనే వారు కాదు. ఊరు చివ‌ర దాకా న‌డిచి వెళ్లి అక్కడ ఆ వాహ‌నం ఎక్కే వారు. ఇంట్లోకి ఎవ‌రైనా వ‌స్తే శ్రీ‌మ‌తి గారు లోప‌ల‌కు ప‌రిగెత్తాల్సిందే. క‌నీసం వారికి ప‌రిచ‌యం చేయ‌టం కూడా ఉండేది కాదు. ఇప్పుడు చ‌క్కగా ఒకే వాహ‌నం మీద ఇద్దరూ టౌన్ కు వెళుతున్నారు. క‌లిసి షాపింగ్ కు వెళ్లి వ‌స్తున్నారు. ఇంటికి కావ‌లిసిన విష‌యాల‌న్నీ జాయింట్ గా ప్లాన్ చేసుకొంటున్నారు. అంత ఎందుకు..పిల్లలు చ‌దివే కాన్వెంట్ ల‌కు పేరంట్స్ మీటింగ్‌ల‌కు మ‌హిళ‌లే వెళుతున్నారు. వామ్మో.. ఇది అద్భుతం సుమీ. ఇది అభినందించ‌ద‌గిన విష‌యం. దీనికి కార‌ణం ఏదైనా కానీ హైస్కూల్ దాకా మా జ‌న‌రేష‌న్ చ‌ద‌వ‌గ‌లిగింది కాబ‌ట్టే ఇది సాధ్యం అయింద‌ని అనుకొంటున్నాను. అంత‌కు ముందు జ‌న‌రేష‌న్ కు ఈ అవకాశం లేదు. చ‌దువుతోటే అభివృద్ధి అని నా న‌మ్మకం. నా శ్రీ‌మ‌తి దీన్ని అంగీక‌రిస్తూనే ఇంకో విష‌యం కూడా జోడించింది. ఇంట్లోకి టెలివిజ‌న్‌, సెల్ ఫోన్ లు వ‌చ్చేశాక క‌మ్యూనికేష‌న్ కూడా ముఖ్యమే అని చెప్పింది. ఇది కూడా వాస్తవ‌మే క‌దా..!

Saturday, July 13, 2013

మా ఊరు వెళ్లి వ‌చ్చా..ఎంతటి మార్పు క‌నిపించిందో..!

రెండు రోజులు శెల‌వు పెట్టి మా ఊరు వెళితే రెండు వారాల ప‌ని బ‌రువు నెత్తిన ప‌డింది. దీన్ని తెముల్చుకొనేందుకు ఇంత స‌మ‌యం ప‌ట్టింది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఈ బ‌రువు బాధ్యత‌లు త‌ప్పవు. దీనిపై బ్లాగు రాయటానికి ఇంత‌టి స‌మ‌యం ప‌ట్టింది. మా ఊరు కి వెళ్లే ముందు ఈ సారి కూడా మ‌రిచిపోకుండా గోదావ‌ర‌మ్మ ను ప‌ల‌కరించాను. రావుల‌పాలెం కు ఇవ‌త‌ర సిద్దాంతం బ్రిడ్జి ఎక్కగానే కారు ఆపుదామ‌నుకొన్నా.. పిల్లలు ప‌డుకొన్నారు. అందుకే రావుల‌పాలెం దాటాక మాత్రం గౌత‌మి గోదావ‌రి మీద ప‌క్కకు తీసి కారు ఆపాను. పిల్లల‌ను లేపి గోదావ‌ర‌మ్మ ను చూపిస్తే ఎంత పొంగిపోయారో. అప్పటికే తెల తెల వారుతోంది. ఆ చిరు చీక‌ట్లో గోదావ‌రి త‌ల్లి అందాల్ని చూస్తే మాట‌లు చాల‌వ‌నిపించింది. పిల్లల చేత డ‌బ్బులు వేయించాను అఫ్ కోర్స్ మా శ్రీ‌మ‌తి న‌వ్వుకొంటూనే చూసింది ఈ దృశ్యాల్ని. హైద‌రాబాద్ అమ్మాయిల‌కు ఇవ‌న్నీ పెద్దగా ప‌ట్టక పోవ‌చ్చు. కొద్ది సేపు అక్కడ ఎంజాయ్ చేశాకే ముందుకు క‌దిలాం. వేకువ జామున మా ఊరికి వెళుతుంటే ఒక్క సారిగా సంద‌డి నెల‌కొంది. ఒక‌ప్పుడు మా ఊరి నుంచి హైస్కూల్ కు వెళితే గొప్ప. అటువంటిది ఇప్పుడు ఉద‌యాన్ని ఊరికి స్కూల్ బస్సులు, కాలేజీ బ‌స్సులు పొలోమ‌ని వ‌చ్చేస్తున్నాయి. వాటిని ఎక్కి మా ఊరి పిల్లలు చ‌దువుల‌కు చ‌క చ‌కా ముందుకు సాగుతున్నారు. ఇది చూసి భ‌లే ముచ్చట వేసింది. నేను యూనివ‌ర్శిటీ లో చ‌దువుకొనేట‌ప్పుడు మా ఊరి విద్యార్థుల చ‌దువుల గురించి బాగా ఆలోచించే వాడిని. అప్పట్లో ఒక సారి వేకువ జామున రైలు కి వెళ్లాలంటే మా ఊరాయ‌న సైకిల్ మీద న‌న్ను స్టేష‌న్ కు దింపాడు. ఆయ‌న అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చ‌దువుతున్నాడు. చక్కగా కాలేజ్ బ‌స్స్ లో వెల్లిపోతున్నాడు. ఆ సంగ‌తి ఆయ‌న గుర్తు చేశారు. ఊర్లోకి వెళ్లి కాసేపు సేద తీరాక చుట్టు ప‌క్కల వారి ప‌ల‌క‌రింపులు మొద‌ల‌య్యాయి. మా ఊర్లో అనేక కుల‌స్తులు ఉన్నారు. కానీ అంతా మావ‌య్య, బాబాయ్‌, పెద నాన్న అని పిలుచుకొంటాం. ఎవ‌రికి ఈ పిలుపుల మీద ప‌ట్టింపు ఉండ‌దు. అదంతా ఒక ఆత్మీయ‌త‌.
ఆ రోజు మా ఊరి శివాల‌యంలో క‌ళ్యాణం. ఈ క‌ళ్యాణం చేయించుకొనేందుకు మేం వెళ్లాం. అందుకే సాయంత్రం దేవుడి ఊరేగింపు జ‌రుగుతుంటే కూడా వెళ్లా. ఊరంతా ఒక‌టే ప‌ల‌క‌రింపులు. అప్పటి పిల్లలంతా పెద్దలై పోయారు. పెద్ద వారంతా వృద్దులై పోయారు. మా అబ్బాయి అయితే బోలెడు ఆశ్చర్య పోయాడు. మీకు ఇంత స‌ర్కిల్ ఉందా అంటే ప్రశ్నలే. వాడికి ఇదంతా కాస్త కొత్త. రాత్రి మాత్రం దేవుడి క‌ళ్యాణం చేయించాం. ఎంత‌టి మ‌ధుర‌మైన అనుభూతో. మా ఊరంటేనే నేను ప‌డి చ‌స్తాను. అటువంటి చోట దేవుడి కళ్యాణం చేయించుకొన్న అనుభూతిని ఒడిసి ప‌ట్టి తెచ్చుకొన్నాను. దేవుడి సేవ‌లో త‌రించే ఒక మ‌ధుర జ్ఞాప‌కం. అందుకే ఇప్పటికి ఆ జ్ఞాప‌కాన్ని దాచుకొన్నాను. మ‌ర్నాటి విశేషాలు మ‌ళ్లా చెబుతాను.

Sunday, June 16, 2013

నాలుగు రోజుల్లో మా ఊరు వెళుతున్నా. అస‌లు ఆ ఫీలింగే అద‌ర‌గొడుతోంది..!

సొంత ఊరంటే ఎవ‌రికైనా కాస్తంత ప్రేమ‌. గోదావ‌రి జిల్లా బిడ్డల‌కు మాత్రం కాస్తంత ఎక్కువ ప్రేమ అన్న మాట‌. అటువంటి గ్రూపులో మ‌నం టాప్ ర్యాంక్‌. తూర్పు గోదావ‌రి జిల్లాలో పోస్టాఫీసు కూడా లేని అనేక ప‌ల్లెటూరుల్లో మాది కూడా ఒక‌టి. ప‌క్క ఊర్లో బ‌స్సు దిగి మా ఊర్లోకి న‌డుచుకొంటూ వెళ్లిపోవ‌చ్చు. ఊరి న‌డిబొడ్డు నుంచి ప‌ల‌క‌రింపులు మొద‌లువుతాయి. పావు గంట ప‌ట్టే న‌డ‌క్కి గంటం పావు ఈజీగా ప‌ట్టేస్తుంది. క‌నిపించిన ప్రతీవాళ్లు ముఖ‌మంతా న‌వ్వు చేసుకొని మ‌న‌స్ఫూర్తిగా ప‌ల‌క‌రిస్తూ ఉంటే ఆ ఆప్యాయ‌త‌ను దేంతో కొల‌వ‌గ‌లుగుతాం. అందుకే ఊరిలోకి వెళ్లిన కొద్ది సేప‌టికే వాతావ‌ర‌ణం మారిపోతుంది. మ‌ట్టి వాస‌న ప‌ల‌క‌రించి పుల‌క‌రింప చేస్తు ఉంటుంది. ఊర్లోకి వెళ్లాలంటే ముందుగానే గోదావ‌రి దాటాలి క‌దా.. రైలులో ఊరెళితే మాత్రం కొవ్వూరు స్టేష‌న్ దాట‌గానే గేటు లోకి వెళ్లిపోతాను. గోదావ‌రి దాటుతుంటే కిటికీ లోంచి చూడ‌టం క‌న్నా గేటు నుంచి చూడ‌టం భ‌లే గ‌మ్మతుగా ఉంటుంది. అందుకే న‌ది ని అక్కడ నుంచి చూడ‌టం అల‌వాటు. యూనివ‌ర్శీటి లో ఉన్నప్పటి నుంచి మొద‌లైన ఈ అల‌వాటు ఇప్పటికీ వ‌ద‌ల్లేదు. ఈ మ‌ధ్యన కారులో ప్రయాణం పెట్టుకొంటే రావుల‌పాలెం వంతెన మీద మ‌ధ్య లోకి వెళ్లాక ప‌క్కకు తీసి ఆపుతుంటాను. అప్పుడు న‌దిలోకి నాణేలు వేసేందుకు మా పిల్లలు కూడా పోటీ ప‌డ‌తారు. న‌దిలోకి డ‌బ్బు వేయ‌టం ఏంటి చాద‌స్తం అని న‌వ్వుకోవ‌చ్చు గాక గోదావ‌రి మీద ఇదంతా కామ‌న్ మరి. కొన్ని ఫీలింగ్స్ కు లాజిక్కులు ఉండ‌వు మ‌రి. ఊరికి వెళ్లిన‌ప్పుడు మాత్రం మొద‌ట ప‌రిగెత్తేది గుడిలోకే. ఎందుకంటే మా ఇంటి ప‌క్క నే ఠీవిగా వెల‌సిన శివాలయం నాజీవితంతో ముడిప‌డి ఉంది. చిన్నప్పటి నుంచి ఆ గుడిలోనే నా ఆట‌పాట‌లు సాగాయి. అందుకే ఎప్పుడు అక్కడ‌కు వెళ్లినా గుడికి వెళ్లి ద‌ర్శనం చేసుకోవ‌టం మాత్రం మాన‌ను. అంతే కాదు.,, ఎంత పెద్ద క్షేత్రంలోకి వెళ్లినా ఒక్క సారైనా మా ఊరి గుడిని గుర్తుచేసుకొంటాను. అక్కడ స్వామిని మ‌న‌స్సులో త‌ల‌చుకొంటాను. అంతే కాదు, ఆఫీసులో ప‌ని మొద‌లు పెట్టేట‌ప్పుడు కూడా ఒక్క సారి క‌ళ్లు మూసుకొని మా ఊరి స్వామిని ధ్యానించుకొంటా. అది కూడా లాజిక్కు కు అంద‌ని బ‌ల‌మైన సెంటిమెంట్. ఈ సారి కూడా కొన్ని జ్ఞాప‌కాల దొంత‌ర‌ను మోసుకొంటూ మా ఊరికి వెళుతున్నా. కొన్ని అనుభూతుల్ని ప‌దిల ప‌ర‌చుకొని వెన‌క్కి వ‌ద్దామ‌నుకొంటున్నా...!

Sunday, May 12, 2013

పెద్ద మాస్టారు కి మాత్రం క‌న్నీటి అభిషేకం..!

మా ఊరు మొత్తానికి ఒకే ఒక్క స్కూల్ ఉండేది. స‌మితి ప్రాథ‌మిక పాఠ‌శాల‌. అక్కడ ఒక‌టి నుంచి ఐదో త‌ర‌గ‌తి దాకా క్లాసులు ఉండేవి. న‌లుగురు మాస్టార్లు . అందులో హెడ్ మాస్టారు ను పెద్ద మాస్టారు అని పిలిచేవాళ్లం. ఆయ‌న పేరు చీమ‌ల కొండ స‌త్యనారాయ‌ణ‌. ఆయ‌న వ‌య‌స్సు ఎక్కువ‌గా ఉండ‌టం కాదు కార‌ణం. ఆయ‌న మా ఊర్లో ఉండే పెద్దల‌కు కూడా మాస్టారే. ఎందుకంటే ఆయ‌న అప్పటికే 20-25 సంవ‌త్సరాలు గా అక్కడ ప‌నిచేస్తు ఉండేవారు. దీంతో మా పెద్దలు కూడా ఆయ‌న స్టూడెంట్స్ అన్న మాట‌. ఆయ‌న‌కు కోపం వ‌స్తే చేతిలో ఉన్న చింత బ‌రికె విరిగిపోయే దాకా కొట్టే వారు. ఇత‌ర మాస్టార్లు కొడితే ఇంటి ద‌గ్గర పెద్దల‌కు కంప్లయింట్ చేసుకొనే చాన్సు ఉండేది. పెద్ద మాస్టారు కొడితే మాత్రం ఎవ‌రికి చెప్పుకొనే దిక్కులేదు. ఆయ‌న ద‌గ్గర‌కు వ‌చ్చి కంప్లియంట్ చెప్పటానికి పెద్దలు కూడా భ‌య‌ప‌డే వారు. ఉద‌యం తొమ్మిది అయిందంటే ఆయ‌న స్కూల్ లో ఉండేవారు. అప్పటిక‌ల్లా మేమంతా పరిగెత్తుకొని లైన్ లో నుంచొని ఉండేవాళ్లం. ఉద‌యం అసెంబ్లీ జ‌ర‌ప‌టం, సాయంత్రం పిల్లల్ని ఆడించ‌టం అన్నీ చేయించేవారు. ఉదయం ఎంత సీరియ‌స్ గా ఉండేవారో ఆడుకొనేట‌ప్పుడు అంత‌టి స‌ర‌దాగానూ క‌నిపించేవారు. మా ఎలిమెంట‌రీ స్కూల్ లో చ‌దువుకోవ‌టం అంటే పూర్తిగా క్రమ‌శిక్షణ‌తో పెరిగిన‌వాళ్లం అన్న బ్రాండ్ ఇమేజ్ ఉండేది. అంతేకాదు,,, త‌ర్వాత హైస్కూల్ లో చేరినా, కాలేజీకి వెళ్లిపోయినా ఆగ‌స్టు 15, జ‌న‌వ‌రి 26 కు ఆయ‌న స్కూల్ కు పిలిపించే వారు. జెండా కర్ర క‌ట్టడం, స్కూల్ అంతా డెక‌రేట్ చేయ‌టం వంటి ప‌నుల్ని పెద్ద పిల్లల‌కు అప్పగించేవారు. కాలేజీలో క్లాసు డుమ్మాకొట్టి బ‌జారు లో తిరిగినా, టౌన్ లో సినిమాకు చెక్కేసినా పెద్ద మాస్టారు క‌న‌బడితే మాత్రం ప‌రుగో ప‌రుగు. పెద్ద మాస్టారు రిటైర్ అయిన‌ప్పుడు మాత్రం ఊరంతా క‌ద‌లి వ‌చ్చింది. అప్పటి వేస‌విలో ఈ మేనెల స‌మ‌యంలోనే విప‌రీత‌మైన ఎండ‌లు న‌డుస్తున్నాయి. కానీ పెద్ద మాస్టారు ఫంక్షన్ కు మాత్రం అంతా క‌ద‌లి వ‌చ్చారు. ఊరంద‌రి స‌మ‌క్షంలో సార్ కు మేం పుష్పాభిషేకం చేశాం. విద్యార్థులంతా క‌లిసి పాద పూజ చేశాం. అటువంటి మాస్టారిని మ‌ళ్లీ చూడ‌లేమంటూ క‌న్నీళ్లు పెట్టుకొన్నాం. ఊరి ప్రారంభం నుంచి ఊరేగింపుగా స్కూల్ కు తీసుకొని వ‌చ్చాం. అక్కడ అంతా క‌లిసి ఆయ‌న‌కు పూజ‌లు చేశాం. పిల్లా పెద్ద అనే తేడా లేకుండా స్కూల్ ప్రాంగణం మొత్తం కిట కిట లాడిపోయింది. మా స్కూల్ కే స‌ర్వస్వం ధార‌పోసిన ఆయ‌న్ని మా ఊరు వారు ఎవ్వరూ మ‌రిచిపోర‌నుకొంటాను. ఆ మ‌హానుభావుడి సంత‌తి ఎక్కడ ఉన్నా చ‌ల్లగా ఉండాల‌ని దేవుడ్ని కోరుకొంటాను.

Thursday, April 18, 2013

మా ఊర్లో శ్రీ‌రామ న‌వమి... మ‌రిచిపోలేని జ్ఞాప‌కాలు..!

ఊర్లో ఎవ‌రి ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నా చుట్టు ప‌క్కల ఇళ్లలో సంద‌డి ఉంటుంది. కానీ, ఊరంతా క‌దిలే పండుగ మాత్రం క‌చ్చితంగా శ్రీ‌రాముని క‌ళ్యాణం మాత్రమే. ఈ వేడుక‌కు ఊరంతా హ‌డావుడి అనుకోవాల్సిందే . ఏప్రిల్ నెల మ‌ధ్య లో వ‌చ్చే ఈ పండుగ కు ఒక స్పెషాలిటీ ఉంది. అదేమంటే మా చిన్నప్పుడు చాలా సార్లు ఈ పండుగ నాటికి మా ప‌రీక్షలు పూర్తి అయిపోయేవి. దీంతో వేస‌వి సెల‌వుల్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న త‌రుణంలో వ‌చ్చే పండుగ కావ‌టంతో మా కుర్రకారు జోరుకి ప‌ట్ట ప‌గ్గాలు ఉండేవి కావు. శ్రీ రామ న‌వమి కి వారం, ప‌ది రోజుల ముందే ఏర్పాట్లు మొద‌ల‌య్యేవి. అంటే ఊరి మ‌ధ్య లో ఉన్న రాముల వారి గుడి ముందు పెద్ద తాటాకు పందిరి వేసేవారు. దీంతో మేం చెల‌రేగిపోయి ఆడుకొనేందుకు ఒక వేదిక దొరికి న‌ట్లయ్యేది. శ్రీ రామ న‌వ‌మి ముందు రోజు సాయంత్రం గుడి ని ముస్తాబు చేయ‌టంలో పోటీ ప‌డేవాళ్లం. జెండా పండుగ‌కు క‌ల‌ర్ పేప‌ర్స్ తెచ్చిన‌ట్లు ర‌క ర‌కాల జెండాలు, పేప‌ర్ క‌టింగ్స్ తెచ్చి అలంక‌రించేవాళ్లం. శ్రీ రామ న‌వ‌మి రోజు ఉద‌య‌మే గుడి ద‌గ్గర‌కు చేరిపోయి ప్లేస్ లు వేసుకొని ఉండేవాళ్లం. దేవుని క‌ళ్యాణం అంటే ఊరంతా క‌ద‌లి అక్కడ‌కు వ‌స్తుంది క‌దా. అప్పుడు మ‌న‌కు వెన‌కాల చోటు ద‌క్కితే ఇబ్బంది కాబ‌ట్టి కుర్ర బ్యాచ్ ముందు వెళ్లి పోయి పెద్దల‌కు ప్లేస్ లు ఆపి ఉంచ‌టం రివాజు అన్న మాట‌. అస‌లు రాముల వారి త‌త్వం ఏమిటి, ఎందుకు ఆయ‌న ఆద‌ర్శ పురుషుడు అయ్యాడు, సీత‌మ్మ త‌ల్లి గొప్పత‌నం ఏమిటి అన్నది పంతులు గారు వివ‌రించి చెబుతుంటే త‌న్మయ‌త్వంతో వినే వాళ్లం. ఆ త‌ర్వాత పాన‌కం తాగేందుకు, వ‌డ‌పప్పు తినేందుకు పోటీ ఎలాగు త‌ప్పదు క‌దా.. మ‌ధ్యాహ్నం దాకా ఊరంతా ఒక్క చోట చేరి రామ‌య్య తండ్రి క‌ళ్యాణాన్ని తిల‌కిస్తుంటే .. రాములోరి పెళ్లికి ఊరంతా పండుగే అన్నట్లు ఉండేది. ఆ దృశ్యం ఎప్పటికీ క‌న్నుల ముందు క‌ద‌లాడుతూ ఉండేది. ఇక రాముల వారి క‌ళ్యాణం సాయంత్రం నుంచి సాంస్క్రతిక కార్యక్రమాలు ఉండేవి. ముఖ్యంగా ఊర్లోని యూత్ అంతా క‌లిసి నాట‌కాలు ప్రాక్టీస్ చేసి నాట‌కం వేసేవాళ్లం. పెద్ద వాళ్లు పౌరాణిక నాట‌కం ఆడితే, కుర్ర బ్యాచ్ మాత్రం సాంఘిక నాట‌కానికి ప‌రిమితం. ఈ నాట‌కం వ‌చ్చే దాకా మాత్రం రోజు హ‌రి క‌థ‌, బుర్ర క‌థ వంటివి ఉండేవి. దీంతో పాటు వీధిలో స్క్రీన్ క‌ట్టి సినిమా వేసే వాళ్లు. ఆ సినిమా చూడ‌టం అంటే అబ్బో . .. అదో వెరైటీ ఫీలింగ్‌. ఇప్పుడు త‌ల‌చుకొంటే మాత్రం భ‌లే న‌వ్వు వ‌స్తుంది. ఎనీ హౌ శ్రీ రామ న‌వ‌మి అంటే దాచుకొన్న అనుభూతుల్ని త‌ల‌చుకొనే ఒక భ‌క్తి భావ‌న అన్న మాట‌.