ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, December 1, 2012

వామ్మో ఆదివారం..!

స‌హ‌జంగా ఆదివారం వచ్చిందంటే అంద‌రికీ ఆనంద‌మే. ముఖ్యంగా బ‌డి పిల్లల‌కు మ‌రింత ఆనందం. క్లాసులు, పుస్తకాలు అన్నిటినీ ప‌క్కన పెట్టేసి హాయిగా ఆడుకొంటూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మేం కూడా చిన్నప్పుడు జిల్లా ప‌రిష‌త్ స్కూల్ లో చదివేట‌ప్పుడు అదే చేసే వాళ్లం.కానీ, ప‌దోత‌ర‌గ‌తిలోకి వ‌చ్చాక మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. వారం అంతా టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జ‌రిపేవాళ్లు. ఆదివారం వ‌చ్చిందంటే మాత్రం ప్రైవేటు క్లాసులు పెట్టేసేవాళ్లు.
ప్రభుత్వ పాఠ‌శాలల్లో వానాకాలం చ‌దువులు అంటారు కానీ, మా జిల్లా ప‌రిష‌త్‌స్కూల్ లో మాత్రం పరిస్థితి వేరు. టీచ‌ర్లు అంద‌రూ చాలాచాలా నిబ‌ద్దత‌తో ఉండేవారు. అంటే ఆదివారం కుటుంబ సభ్యుల‌తో కాలం గ‌డిపే చాన్సు ఉన్నా, దాన్ని వ‌దులుకొని స్కూల్ కు వ‌చ్చే వాళ్లు. ప్రతీ ఆదివారం ఒక్కో టీచ‌ర్ వ‌చ్చి మాకు ప్రైవేటు క్లాస్ పెట్టే వారు. ఏడో త‌ర‌గతిని ఒక టీచ‌ర్ తీసుకొంటే, ప‌దో త‌ర‌గ‌తిని మరో టీచ‌ర్ తీసుకొనేవారు. అప్పటికప్పుడు పాఠాలు చ‌దివించి అప్పగించుకొనే వారు. అక్కడే అస‌లు క‌థ మొద‌ల‌య్యేది. ఏడో త‌ర‌గ‌తిలో అయితే ఏదో గ‌డ‌చి పోయింది కానీ, ప‌దో త‌ర‌గ‌తి లో మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది. ప్రశ్నల‌కు జ‌వాబులు అప్పగించ‌క పోతే అక్కడిక‌క్కడ చిత‌క్కొట్టే వారు. అది కూడా క్లాస్ లోని ఆడ‌పిల్లల ముందు తిట్టి పోస్తూ బెత్తంతో కొడుతుంటే పైకి ఏడ్వలేక‌, లోప‌ల ఉండ‌లేక చాలా ఇబ్బంది ప‌డేవాళ్లం. టీచ‌ర్లు సెటైర్లు వేస్తూ కొడుతుంటే ఆడ‌పిల్లలు ముసి ముసి న‌వ్వులు న‌వ్వేవారు. అంత‌కు ముందు ఏడో త‌ర‌గ‌తిలో ఇటువంటి ప‌రిస్థితి ఉన్నప్పటికీ అప్పుడు అంత‌టి ఫీలింగ్స్ ఉండేవి కాదు. కానీ, నెమ్మదిగా 8, 9 క్లాసులు దాటి ప‌దికి వ‌చ్చేసరికి సీన్ మారిపోయేది. ఆడపిల్లల ముందు ఏమిచేసినా జాగ్రత్తగా ఉండాల్సి వ‌చ్చేది. కొత్త సిగ్గులు మొగ్గలు తొడిగే సీజ‌న్ అది. క్లాసు లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండేవాళ్లం. కానీ, అంతా ఒక‌రిని ఒక‌రిని గౌర‌వంగా, అభిమానంగా వ్యవ‌హ‌రించేవాళ్లం. త‌ప్పితే ఎటువంటి సిల్లీ ప‌నులు ఉండేవికాదు. ఆ తాకిడి నుంచి త‌ప్పించుకొనేందుకైనా ఏ రోజు పాఠాలు ఆ రోజు చ‌దివేయాల్సి వ‌చ్చేది. ఎటువంటి వ‌స‌తులు లేక‌పోయినా చెట్టుకింద కూర్చొబెట్టి చ‌దువులు చెప్పారు. త‌ల‌చుకొంటే వారి క‌మిట్ మెంట్ ముందు మ‌న వృత్తి నిబ‌ద్దత ఏపాటిది అనిపిస్తుంది. అందుకే ఆ ఫౌండేష‌న్ బ్రహ్మాండంగా ఉండేది. వెన్ను త‌ట్టే వారు లేకపోయినా కాలేజీ చ‌దువులు, యూనివ‌ర్శిటీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేసుకొని మ‌హా నగ‌రంలో ఉద్యోగం అందుకోగ‌లిగామంటే ఆ మ‌హాను భావుల ఆశీస్సులే. అందుకే ఇప్పటికీ ఆదివారం నాడు కూడా ఆఫీసు ప‌నులు, ఇంటి ప‌నులు స‌మ‌న్వయంతో సాధించుకోగ‌లుగుతున్నాం అనిపిస్తుంటుంది.