ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Friday, December 31, 2010

ఆడవారికి డ్రెస్ సెలక్షన్ కు ఉన్న అ నుబంధం ఎట్టిదనగా..ఏదైనా బట్టల షాపు కి వెళ్లి చూస్తే.. అటు, ఇటూ పచార్లు చేస్తూ, దిక్కులు చూస్తున్న మగవారు కనిపిస్తారు. మేటర్ ఏమిటంటే, ఆయన గారి ఇల్లాలు, లేదా ఫియాన్సీ అక్కడ డ్రెస్ సెలక్షన్ లో బిజీ గా ఉందన్న మాట. డ్రెస్ సెలక్షన్ అనే సబ్జెక్ట్ పెడితే అందులో టీచర్లు, ప్రొఫెసర్లతో పాటు స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ కూడా మహిళలే ఉంటారని పెద్దలు ఎప్పుడో డిసైడ్ చేశారు అందుకే ఆ సబ్జెక్ట్ పెట్టలేదని గట్టి నమ్మకం. ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ చీరల తో పాటు, అనేక రకాల మోడల్స్ లో మోడ్రన్ డ్రెస్ లు కొలువు దీరి ఉన్నాయి. అన్ని వెరైటీల్లో డ్రెస్ ను వెదకి పట్టుకోవటం అంటే మాటలా. దీనికన్నా పద్మవ్యూహాన్ని ఛేదించటం తేలిగ్గా ఉంటుంది.

బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలన్నది ఇంజనీరింగ్ లో ప్రాథమిక సూత్రం. ఈ పాయింట్ డ్రెస్ సెలక్షన్ కు కూడా అప్లయ్ అవుతుంది. డ్రెస్ సెలక్షన్ కు వెళ్లే ముందే ఈ ఫౌండేషన్ నిర్మాణం జరిగిపోతుంది. అంటే క్లాస్ మేట్ నో, కొలీగ్ నో డ్రెస్ డిజైన్ ల గురించి ఆరా తీయటం ఒక యూనివర్సల్ ట్రూత్ . బయట షాపింగ్ సమయంలో, మార్కెట్ లోనో ఇతర దుస్తుల్ని చూసినప్పుడు మంచి డ్రెస్ కనిపిస్తే,, బ్రెయిన్ అనే సీపీయూ లో అది సేవ్ అయిపోతుంది. దాని మంచి చెడ్డల మీద ఫ్రెండ్స్ తో డిస్కషన్ తప్పనిసరి అవుతుంది. అది మనకు నప్పుతుందా, లేదా అన్నక్రాస్ వర్డ్ పజిల్ కూడా సాగిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ కమ్ సెలక్షన్ లో కొన్ని డ్రెస్ లు మాత్రం విజేతలుగా నిలుస్తాయి.(2010 వ సంవత్సరంలో బెస్ట్ డ్రెస్ వేసుకొన్న హీరోయిన్స్ ల్ని మీరు చూడవచ్చు...http://www.godavariyouth.com/m/photos/browse/album/best-dressed-ladies/owner/telugutvjournalist)

<
డ్రెస్ లు తీసుకోవాలని డిసైడ్ అయ్యాక, షాపింగ్ కు వెళ్లాలని డిసైడ్ అయిపోవాల్సిందే. పెళ్లయిన వారికి ఇది కాస్త వీజీ. భర్తను షాపింగ్ ఉందని బయలు దేర తీసి, ఆపై బట్టల షాపుకి తీసుకెళ్లేట్లు రూట్ మార్చేయచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హజ్ బెండ్ .. మన వెహికల్ కు డ్రైవర్ గా, పే చేసేప్పుడు అకౌంటెంట్ గా, చివర్లో బ్యాగ్ లు మోసే సెర్వంట్ లా మారిపోయానని గొణుక్కోవచ్చు గాక. అటువంటి వాటిని నమ్మద్దు. హజ్ బెండ్ అంటే బెటర్ హాఫ్ కదా.. బ్రెయిన్ కు పని చెప్పి మగువలు కష్టపడి డ్రెస్ లు సెలక్ట్ చేసినప్పుడు, ఆ మాత్రం కష్టాల్ని షేర్ చేసుకోవటంలో తప్పు లేదు కదా... జాబ్ చేసుకొంటూ పెళ్లి జోలికి వెళ్లని వారి విషయంలో అన్ని హాఫ్ లు వారే కాబట్టి నో ప్రోబ్స్. స్టూడెంట్స్ , పెద్ద వారు గుంపులుగా వస్తారు కాబట్టి గుంపు గోవిందం సిద్దాంతం అక్కడ అప్లయ్ అవుతుంది.

అసలు డ్రెస్ సెలక్షన్ లో ఉన్న గమ్మతైన విషయం ఒకటుంది. షాపులో అడుగు పెట్టేసరికి కొన్ని మోడల్స్ .. బుర్రలో పెట్టుకోవటం జరుగుతుంది. కానీ, షాపులోకి వచ్చేసరికి అన్ని మోడల్స్ కళ్ల ముందు కనిపించే సరికి, బ్రెయిన్ లో సేవ్ అయిన మోడల్స్ బ్లాక్ అవుతాయి. ఆ ఫైల్ కరప్ట్ కావటంతో.. ట్యూబ్ లైట్ల వెలుగులో మెరిసిపోతున్న రక రకాల డ్రెస్ లో కావల్సనవి ఏరుకోవటం మొదలైపోతుంది. సివిల్స్ పరీక్ష పత్రాన్ని తయారు చేయటానికి సెలక్టర్లు ఎంత కష్టపడతారో కానీ, కావలిసిన డ్రెస్ ఎంచుకోవటానికి మహిళామణులు అంతకన్నా ఎక్కువే కష్టపడతారు. ఎక్కువగానే ఇష్టపడతారు. డ్రెస్ కు కొసరు కాంబినేషన్లు ఎంచుకోవటం కూడా అంతే కష్టంగా ఉంటుంది.
కష్టాలు ప్రసాదించేదీ భగవంతుడే వాటి పరిష్కారాలు ప్రసాదించేదీ ఆయనే. అందుకే లేడీస్ డ్రెస్ సెలక్షన్ లో మునిగిపోయినప్పుడు.. జెంట్ప్ కు కొరుక్కోవటానికి గో్ళ్లు, దువ్వుకోవటానికి జుట్టు ఇవ్వటంతో పాటు, కాల్స్ చేసుకోవటానికి సెల్ ఫోన్ కూడా ప్రసాదించాడు.అందుకే ఆ సమయంలో అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతూ.. జెంట్స్ అటూ ఇటూ తిరుగేస్తూ ఉంటారు. లేదంటే , చిన్న పిల్లల్ని ఆడించటం, పెద్ద పిల్లల్ని అటూ ఇటూ తిప్పటం వంటి పనుల్లో ఉండాలని వేమన చెప్పినట్లు గుర్తు. లోపల ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నా , టూత్ పేస్ట్ వంటి నవ్వును పులుముకొంటూ షాపింగ్ మాల్ నుంచి ఇంటికి రావటం వారి విద్యుక్త ధర్మం. సో, ఆడవారికి డ్రెస్ సెలక్షన్ కు ఉన్న అనుబంధం చాలా గట్టిదని ఈ సందర్భంగా అంతా మరోసారి నిర్ధారించుకోవాలి.

Saturday, December 25, 2010

భ‌ర్త‌ను అర్థం చేసుకొనుట ఎట్ట‌బ్బా.....

అర్థం అయిన‌ట్లే ఉండి, అర్థం కాకుండా ఉండే స‌బ్జెక్ట్ ను చిన్న‌ప్పుడు మేథ‌మెటిక్స్ అని చెప్పుకొనేవా్ళ్లం. పెళ్ల‌య్యాక ఆ త‌ర‌హాలో మ‌నుషులు ఉంటార‌ని తెలుస్తుంది. వారినే భ‌ర్త అని అవ‌గ‌తం అవుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్త అర్థం అయిన‌ట్లే ఉంటారు కానీ, ఏమీ అర్థం గాకుండా, అంతు బ‌ట్ట‌కుండా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అప్పటి నుంచి భ‌ర్త‌ను అర్థం చేసుకోటానికి మ‌నం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాం. ఎప్ప‌టికీ అర్థం కాని కాన్సెప్ట్ అంత‌కంత‌కూ పెరిగిపోతూనే ఉంటుంది. ఇది ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌, టెస్ట్ మ్యాచ్ ల్లా కాకుండా ఈయ‌ర్ వైజ్ మ్యాచ్ మాదిరిగా సాగుతూనే ఉంటుంది. అస‌లీ ప్ర‌య‌త్నం మ‌న వైపు నుంచి ఎప్ప‌టి నుంచి జ‌రుగుతోందో ప‌రిశీలిస్తే భ‌లే గ‌మ్మ‌తైన సంగ‌తులు తెలుస్తాయి.
2010 అయినా, 1010 అయినా, అంత‌కు ముందు 0010 అయినా భ‌ర్త‌లు ఒకే మాదిరిగా ఉంటార‌ని ప్ర‌ముఖ గ్రీకు త‌త్వ‌వేత్త చెప్పారు. గ్రీకు పేరు కాబ‌ట్టి మ‌న‌కు గుర్తుండి చావ‌దు. మ‌న‌కు అందుబాటులో గుర్తు తెచ్చుకొనే కాలం ... ఒక న‌ల‌భై, యాభై ఏళ్ల కితం ది గా చెప్పుకోవ‌చ్చు. అప్ప‌ట్లో భ‌ర్త అంటే హాల్ లో ఉండి అవ‌స‌రం అయిన‌ప్పుడు పిలుస్తుండే వారు. భార్య ను పేరు పెట్టి పిల‌వటం కూడా ఉండేది కాదు. వంటింట్లోనో, పెర‌ట్లోనూ ప‌నికి భార్య ప‌రిమితం అయిన రోజుల‌వి.
ఇదిగో నిన్నే, అని హుంక‌రిస్తే..ప‌రుగున వెళ్లి హాలు ద‌గ్గ‌ర త‌లుపు చాటున నుంచోవ‌టం చెప్పిన ప‌ని విని త‌ల ఆడించి లోప‌ల‌కు వ‌చ్చేసే రోజుల‌వి. భ‌ర్త ఏం చెబితే అది విన‌టం , అనుస‌రించ‌టం, ఆయ‌న అడుగు జాడ‌లు ఎక్క‌డ ఉన్నాయో వెద‌క్కొని వాటిలో సాగిపోవ‌టం అన్న‌మాట‌. మ‌న ముత్తాత‌లు నేతులు తాగిన రోజులు అన్న‌మాట‌. అప్పుడు భ‌ర్త‌ను అర్థం చేసుకోవాల‌న్న కాన్సెప్ట్ కూడా మొద‌లు కాలేదు.
ఆ త‌ర్వాత రోజుల్లో భార్య హాలులోకి వ‌చ్చి కంట ప‌డే కాలం వచ్చింది. ఏమేవ్‌, ఒసేవ్ అనే పిలుపుల‌తో ప‌ల‌క‌రింపులు సాగేవి. ఈ స‌మ‌యంలో ఆడ‌వారు కాస్తంత ఎలిమెంట‌రీ స్కూల్ దాకా చ‌దివుకొన్న రోజులు అన్న‌మాట‌. ఇంట్లో కావ‌ల‌సిన సామ‌గ్రి, చీర‌లు వంటివి కొనే విష‌యంలో స‌లహాల‌కు గొంతు పెగిల్చే రోజులు.ఇక్క‌డ వీలైతే ఈ స‌ల‌హాల్ని పాటించే ప‌రిస్థితి. భ‌ర్త‌ను అర్థం చేసుకొందామ‌ని ప్ర‌య‌త్నం మొద‌లెట్టిన ఫేజ్ ఇది.పిల్లలు ఎదిగే కొ్ద్దీ మ‌న వైపు వాయిస్ రేజ్ అవుతూ వ‌చ్చింది.ఈ జ‌న‌రేష‌న్ చివ‌రి నాటికి చెప్ప‌ద‌ల‌చుకొన్న‌ది చెప్పే ధైర్యం వ‌చ్చింది(విత‌వుట్ బూస్ట్, బోర్న‌విటా)మ‌న తాత‌ల, బామ్మ‌ల కాలంలో పెద్ద కుటుంబం నుంచి చిన్న కుటుంబాల‌కు షిఫ్ట్ అవుతున్న స‌మ‌యం.
ఆ త‌ర్వాత త‌రంలో భార్య‌ను పేరు పెట్టి పిలిచే రోజులు వ‌చ్చేశాయి. ఇందిరాగాందీ, సంజ‌య్ గాంధీ పుణ్య మా అని దేశ‌మంతా చిన్న కుటుంబాలు విల‌సిల్లాయి. కుటుంబ స‌భ్యులు త‌గ్గ‌టంతో మ‌న కు ధైర్య పెర‌గ‌సాగింది. ఈ స‌మ‌యంలో పెళ్లి నాటికే హైస్కూలు దాకా చ‌దువుకోవ‌టం, చుట్టుప‌క్క‌ల ఊర్లు వెళ్లి రావటం జ‌రుగుతుండేది. ఆ స‌మ‌యంలో రిలీజైన గుండమ్మ క‌థ సినిమాలో చెప్పిన‌ట్ల‌.. లేచింది నిద్ర‌లేచింది మ‌హిళా లోకం పాట‌ను బాగా జీర్ణించుకొని, ప్ర‌తీ రోజూ ఉద‌యాన్నే నిద్ర లేచి భ‌ర్త‌, పిల్ల‌ల బ‌ద్ద‌కాన్ని చూసి త‌మ శ‌క్తి కొద్దీ కాసేపు స‌ణ‌క్కొని, త‌ర్వాత ఇంటి ప‌నుల్లో ప‌డి పోయే రోజులు అన్న‌మాట‌. ఈ జ‌న‌రేష‌న్ లో మ‌న బేచ్ చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించింది. అప్ప‌టికే దేశ‌మంతా పూర్తి గా ప్ర‌జాస్వామ్యం వ‌చ్చేయ‌టంతో మెజార్టీ ఓట్లు వచ్చిన వారిదే పాల‌న అన్న సంగ‌తి అర్థం చేసుకొన్నాం. పిల్ల‌ల్ని మ‌న వైపు తిప్పుకొని ఉండ‌టం వ‌ల్ల క్ర‌మంగా మ‌న మాట చెల్లుబాటు కాసాగింది.ఇది భ‌ర్త‌కు తెలీకుండా స్లోగా ఇంజెస్ట్ చేయ‌టం వ‌ల్ల బ‌డ్జెట్ స‌మావేశాల్లో తీవ్రంగా ప్ర‌సంగాలు ఇవ్వ‌టం, ఆ త‌ర్వాత చాక‌చ‌క్యంగా బడ్జెట్ ప‌గ్గాలు చేతికి తీసుకోవ‌టం జ‌రిగాయి.ఇంట్లోకి కావ‌ల‌సిన సామాన్లు, బ‌ట్ట‌లు క‌లిసి కొనుక్కోవటం, పిల్ల‌ల స్కూల్ ను క‌లిసి సంద‌ర్శించ‌టం జ‌రిగేవి. అప్పుడ‌ప్పుడు ఒంటరిగా బ‌య‌ట‌కు ప్ర‌యాణం చేస్తుండే స‌మ‌యం. మ‌న పుట్టింట్లో కానీ,అత్త‌వారింట్లో కానీ పెద్ద వారి ముఖ‌చిత్రం ఇలాగే ఉండ‌చ్చు.
ఇక‌, మ‌న త‌రం వ‌చ్చేస‌రికి స‌మ‌స్య మ‌రింత జ‌టిలం అయింది. పెళ్లి చేసుకోవ‌టానికి ముందే మ‌న‌కు భ‌ర్త విష‌యంలో కాస్తంత అవ‌గాహ‌న ఉంటుంది. కానీ, అప్ప‌ట్లో భ‌ర్త విష‌యంలో పూర్తి విష‌యాలు మ‌న‌కు తెలుసు అని విర్ర వీగుతాం. ముందే బ‌య‌ట చ‌క్క‌ర్లుకొట్టి ఉంటాం కాబ‌ట్టి ఆయ‌న గారి జీవితం మ‌న గుప్పిట్లో అనుకొంటాం. కానీ, పెళ్ల‌య్యాక తెలుగు టీవీ సీరియ‌ల్ లో పాత్ర‌ల మాదిరిగా ర‌క ర‌కాల‌కోణాలు బ‌య‌ట‌కువ‌స్తాయి. ఈ జ‌న‌రేష‌న్ లో మ న బ్యాచ్ కాలేజీ ల్లో చ‌ద‌వేయ‌టం, ఉద్యోగాల కోసం ఆపీసుల్లో దూసుకెళుతుంటాం. కెరీర్ లో ఎలా గ్రోత్ సాధించాలో మ‌న‌కు ఈజీగా అర్థం అవుతుంది. కానీ, భ‌ర్త‌ను ఎలా హ్యాండిల్ చేయాలో అంత వీజీగాఅర్థంకాదు. మ‌నం చుడీదార్లు, కుర్తాలు మార్చేసి జీన్లు, గౌన్స్ వైపు ప‌రుగులు తీస్తున్నా - ఏళ్ల త‌ర‌బ‌డి ప్యాంట్ ష‌ర్ట్ ల‌కే ప‌రిమ‌తం అయిపోయిన మ‌గ వారి మీద జాలి క‌లుగుతుంది. మ‌నం న‌చ్చిన‌ట్లుగా మ‌నం ఉండేందుకు బోలెడు స్వాతంత్ర్యం ఉంద‌నుకొంటాం. న‌చ్చిన ఉద్యోగం చేయ‌టం, కావ‌ల‌సిన డ్రెస్ కొనుక్కోవ‌టం, భ‌ర్త‌నుకూడాపిలుచుకొని వెల్లి తిప్పి తీసుకోవ‌టం ఈ స్వాతంత్ర్యం అనుకొంటాం. భార‌త దేశ స్వాతంత్ర్యం లాగే ఇందులో కూడా కంటికి కనిపించేది ఒక‌టి అయితే అమ‌లు అయ్యేది మ‌రొక‌టి. ఉద‌యం భ‌ర్త తోముకొనే పేస్ట్ మ‌నం సెల‌క్ట్ చేసిన‌దే, సోప్ మ‌నం తెచ్చి ఇచ్చిన‌దే. మ‌నం ఎంచి ఇచ్చిన డ్రెస్ నే తొడుక్కొని భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్లాల్సిందే. మ‌నం పెట్టిన టిఫిన్ ను కామెంట్ చేయ‌కుండా తినాల్సిందే. మ‌న డ్రెస్ విష‌యంలో బాగుంది అన్న కామెంట్ త‌ప్ప సెల‌క్ష‌న్ విషయంలో జోక్యంచేసుకోకూడ‌దు. ఆఫీసుకు వెళ్లాక కూడా ఖాళీ స‌మయంలో మ‌న‌తో మాట్లాడుతుండాలి, ఎస్ ఎమ్ ఎస్ లు పంపుతూ ఉండాలి. సాయంత్రం బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే మ‌న‌మే డిసైడ్ చేస్తాం. ఇంట్లో వండుతామా, బ‌య‌ట తినేయ‌ట‌మా అన్న నిర్ణ‌యాధికారం మ‌న‌దే కాబ‌ట్టి ప‌రిపాల‌న అంతా మ‌న చేతుల్లోనే అనిపిస్తుంది.
కానీ, భ‌ర్త్త అనే బ్రిలియంట్ కూడా చాలా చాక చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏమేవ్ అని ఆర్డ‌ర్ వేయించుకొన్న త‌రం నుంచి , మ‌నం ఆర్డ‌ర్ లు పాస్ చేసే స్థాయికి మ‌నం ఎదిగి ఉండ‌చ్చు గాక‌, కానీ అర్థం కాకుండా వ్య‌వ‌హ‌రించ‌టంలో భ‌ర్త కూడా అంతే తెలివిగా ఎదుగుతూ వ‌చ్చిన‌ట్లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. మ‌న కెరీర్ విష‌యంలో అడ్డ‌దిడ్డంగా చొర‌బ‌డి పోయి స‌ల‌హాలు ఇచ్చే మ‌హానుభావుడు త‌న ఉద్యోగం, అక్క‌డ ప‌రిస్థితులు, ఆఫీసు త‌ల‌నొప్పులు గురించి షేర్ చేయ‌రు. మ‌నం సెల‌క్ట్ చేసిన డ్రెస్ తొడుక్కొని బ‌య‌ట‌కు వెళ్లి త‌న‌కు డ్రెస్ సెన్స్ బాగా తెలుస‌ని ఫోజులు కొడుతుంటారు. ఇంట్లో స‌మానత్వం, గోంగూర అంటూ మెత్త‌గా క‌బుర్లుచెప్పే హీరో గార బ‌య‌ట‌కు వెళ్లాక డామినేష‌న్ మొద‌లెడ‌తారు. ఇక‌, అత్త వారి త‌ర‌పున బంధువులు వ‌స్తే ఈ వీర శూర‌త్వానికి అంతే ఉండ‌దు. పాత కాల‌పు ఎస్ వీ రంగారావు, రావు గోపాల రావు పూనిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తారు. సామ్రాజ్యం అంతా వాళ్ల చేతుల్లోనే ఉన్న‌ట్లు ఊగిపోతారు. అస‌లు అవ‌త‌ల వారి ఇంట్లో కూడా బాస్ లు భార్య‌లే అని తెలీదు. లోక‌మంతా ప్ర‌స్తుతం ఈ ట్రెండ్ సాగుతోంద‌ని తెలీకుండా ప్ర‌వ‌ర్తిస్తారు. ‌

అటు, ఇంట్లో ప‌ని చేసుకొని ఆఫీసుల‌కు ప‌రిగెత్తాలి, అక్క‌డ కెరీర్ లో స్పీడ్ కోసం ఉరుకులు, ప‌రుగులు తీస్తూ ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది.త‌ప్ప‌దనుకొంటే ఇంటికి కూడా కాస్త పని తీసుకెళ్లాలి. మ‌ల్లీ ఇంట్లో నూ ఉర‌కులు, ప‌రుగులే. ఇల్లాలిదే ఇంటి సామ్రాజ్యం అని డిసైడ్ అయిపోయిన నాటి నుంచీ ఈ ప్రెజ‌ర్ ఎక్కువ‌గా ఉంది. ప‌ని లో సాయం ప‌డ‌టం ఉండ‌దు కానీ, న‌వ్వూతూ కామంట్లు విస‌ర‌టం, ఇల్లు నీట్ గా స‌ర్ద‌టం లేదంటూ వ్యంగంగా కామెంట్లు విస‌ర‌టం( ఆ ప‌ని తానే చేయ‌వచ్చు క‌దా)వీధిలోకి వెళ్లాకటిఫిన్ బాక్స్ లు స‌ర్దు తూ ఎంతో ప‌ని సాయం చేస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇవ్వ‌టం చూస్తే అర్థం చేసుకోవ‌టం ఎలాగో అర్థం కాదు.
ఇద్ద‌రం స‌మాన‌మే అని చెబుతూ భ‌ర్త మాత్రం కాస్త ఎక్కువ స‌మానం అన్న‌ట్లు బిహేవ్ చేస్తుంటే ఆ తెలివితేట‌ల్ని ఏమ‌నుకోవాలో అర్థం కాదు. స‌మ‌స్య‌లు ఎదురైతే కుబుటం స‌భ్యుల్నో, ఫ్రెండ్స్ నో స‌ల‌హా అడుగుతాం కానీ,ఇది సుప్రీమ‌సీ కి సంబంధించిన మేట‌ర్ కావటంతో ఎవరితోనూ షేర్ చేసుకోలేం. వివిధ రూపాల్లో మోడ్ర‌న్ భ‌ర్త‌ల్ని సంద‌ర్శించాలంటే.http://www.godavariyouth.com/m/photos/home/..ను ద‌ర్శించండి
ఒక‌టి మాత్రం నిజం .. పూర్వం రోజుల్లో ఏమేవ్‌, ఒసేవ్ అని అరుస్తూ ఆర్డ‌ర్లు వేసి భ‌ర్త‌లు త‌మ‌కు కావ‌ల‌సినవ‌న్నీ భార్య‌ల చేత చేయించేవారు. ఈ త‌రంలో మాత్రం.. అది కాదు, ఇది కాదు అంటూ స్వీట్ క‌బుర్లు చెబుతూ లాల‌న‌గా త‌మ కు కావ‌ల‌సినవ‌న్నీ భార్య‌ల చేత మ‌నః స్ఫూర్తిగా చేయించుకొంటున్నారు. చాకిరీ చేసి కూల‌బ‌డ‌టం అన్న‌ది కామ‌న్ గా మ‌న‌కు మాత్ర‌మే ద‌క్కిన రిజ‌ల్ట్ అయితే, స‌మాన‌త్వ సాధ‌కుడిగా పేరుగాంచ‌టం భ‌ర్త‌లు సాధించుకొ్న్న క్రెడిట్‌. మ‌నం చూసిన యాభై ఏళ్ల కుటుంబ ప‌రిణామంలో భ‌ర్త పేరు మారింది త‌ప్పితే సాధింపు ఒక‌టే అని తేలింది. స్ట‌యిలిష్ గా మ‌నం భ‌ర్త పేరు కూడా క‌లుపుకొని పేరు ని మెయిల్స్ లో, ఆఫీసు కార్య‌క్ర‌మాల్లో వాడుకొంటాం, ఆయ‌న గారికి మాత్రం ఇదేమి ప‌ట్ట‌దు. సో, మేథ‌మెటిక్స్ ను అవ‌స‌ర‌మైనంత మేర‌కు అర్థం చేసుకొని, గైడ్‌లు, టెస్ట్ పేప‌ర్ల సాయంతో ప‌రీక్ష‌ల్లో ఎక్కువ మార్కులు కొట్టేసిన‌ట్లుగానే భ‌ర్త‌ల విష‌యంలోనూ మేనేజ్ చేయ‌ట‌మే మ‌న ముందున్న ప‌ని..ఈ అర్థం చేసుకొనే విష‌యంలో ఎవ‌రైనా చ‌ర్చ‌ను కొన‌సాగించ‌వ‌చ్చు..

Friday, December 24, 2010

గోడ క్యాలెండ‌ర్ మీద బూతు బొమ్మలెందుకు

చిన్నప్పుడు దేవాల‌యాల మీద బూతు బొమ్మలెందుకు అన్న పుస్తకం చ‌దివి లెంప‌లు వేసుకొన్నాం. పెద్దయ్యాక దాన్ని చ‌దివి అర్థం చేసుకొన్నాం. కానీ, ఈ గోడ క్యాలెండ‌ర్ మీద బూతు బొమ్మలెందుకు..అన్న ప్రశ్న కు జ‌వాబు దొర‌క‌టం లేదు.
ప్రతీ ఏడాది కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ విడుద‌ల అయిన‌ప్పుడల్లా ఈ ప్రశ్న వినిపిస్తుంది. ఇక‌, దీని ఆధారంగా చ‌ర్చలు, వాద‌న‌లు, వివాదాలు, జోరుగా సాగుతాయి. ఆ త‌ర్వాత కాలంతో పాటే చ‌ల్ల ప‌డ‌తాయి. కానీ, చ‌లి కాలంలో హాట్ ఫోటో లు రిలీజ్ చేసే కింగ్ పిష‌ర్ గ్రూప్ మాత్రం ఇవేమీ పట్టించుకోదు. అస‌లు య‌జ‌మాని విజ‌య మాల్యాకు అవేమీ ప‌ట్టవు కూడా. ప‌ర‌మ భ‌క్తి ప‌రుడు అయిన విజ‌య్ మాల్యా వీర ర‌క్తి ప‌రుడు అన్న మాట అని స‌రిపెట్టుకొంటారు. విమానం ఎక్కిన ప్రతీ సారి న‌వ్వుతూ ఉండే ప్రక‌ట‌న మ‌న‌కు క‌నిపిస్తుంది. అప్పుడు విజ‌య్ మాల్యా భ‌క్తి ప‌రుడు గా గుర్తొస్తాడా, ర‌క్తి ప‌రుడుగా క‌నిపిస్తాడా అన్న విష‌యాన్ని ప‌క్కన పెడితే,
ఈ అందాల భామ‌ల శృంగార ఫోజులు మాత్రం స‌ర్వత్రా అభ్యంత‌ర‌క‌రం. ఈ వివాదంలో చివ‌రకు చెప్పేది అదే, కానీ ఆ గోల మీకేల అంటే మాత్రం చెప్పేది ఏముంది. శ్రద్ధగా చ‌దివే ఫెమినిజం పుస్తకాల సాక్షిగా మ‌న ప‌ని మ‌నం చేసుకు పోవటం త‌ప్ప..! ( ఈ ఆర్టిక‌ల్ ను www.godavariyouth.com/controversy సెక్షన్ నుంచి తీసుకోవ‌ట‌మైన‌ది. అక్కడ ఉన్న ఫోటోలు ఇబ్బందిక‌రం అనిపించి అక్కడే ఉంచేశాం.))

Wednesday, December 22, 2010

పెళ్లీ నీకోన‌మ‌స్కారం..


పెళ్లంటే నూరేళ్ల పంట‌.. తేడా వ‌స్తే అదో పెద్ద తంటా. ఈ సంగ‌తి బాగా జీర్ణించుకొన్న నేటి త‌రం కుర్రకారు బాగా ఆలోచించి కానీ, పెళ్లికి ఓకే చెప్పటం లేదు. బాగా చ‌దువుకొని, చ‌క్కటి ఉద్యోగం దొర‌క పుచ్చుకొన్న త‌ర్వాత స్టేజ్ పెళ్లే అవుతుంది స‌హ‌జంగా. ఈ స‌మ‌యంలో గ్యాప్ తీసుకోవ‌టానికి ఎక్కువ‌గా ఇష్టప‌డుతున్నారు. బ్రహ్మచారి లేదా బ్రహ్మచారిణి జీవితం మీద ఇష్టం అనుకొంటే పొర‌పాటే. త‌గిన జోడీ దొర‌క్క వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే కోరుకొన్న ల‌క్షణాలు ఉన్న జంట కోసం క‌ళ్లు కాయ‌లు కాచి పండ్లు గా మారే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఎవ‌రి కోసం ఈ ప్రేమ మందిరం అంటూ అన్‌నోన్ ప‌ర్సన్ కోసం ఆలోచ‌న‌ల‌తో స‌రిపెట్టేస్తున్నారు.

బుద్దుడు ఈ సంగ‌తి ఎప్పుడో చెప్పేశాడు. కోరిక‌లు దుఃఖానికి మూలం అని ఆయ‌న‌గారు చెప్పారు. ఈ మాట కూడా చ‌క్కటి అమ్మాయి ని పెళ్లి చేసుకొని, ఒక అబ్బాయిని క‌న్నాక బుద్ద భ‌గ‌వానుడు వెల్లడించాడు. అందుచేత ఆయ‌న వ‌ర‌కు ఓకే. ఈ రోజుల్లో చ‌క్కటి అమ్మాయి దొర‌క‌టం ఒక ఎత్తు. ఆమె మ‌న స‌ర్కిల్ లో ఉండాలి. ఆ త‌ర్వాత పెళ్లి విష‌యంలో మ‌న ప్లాట్ ఫామ్ కు స‌రిపోవాలి. ఆ త‌ర్వాత అన్నీ అనుకూలిస్తే పెళ్లి వ‌ర‌కు వెళ్లవ‌చ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ, స‌రిపోయే జోడీ అన్న ప‌దాన్ని అర్థం చేసుకోవ‌ట‌మే క‌ష్టం. ఎందుకంటే చ‌క్కటి అమ్మాయి, చ‌క్కటి అబ్బాయి అనే మాట‌ల‌కు వేర్వేరుగా అర్థాలు చెప్పుకొంటున్నారు. ఎవ‌రి రేంజ్ లో వాళ్లు గ్రీకు వీరుడి కోసం, ప్రేమ సుంద‌రి గురించి ఊహించుకోవ‌చ్చు గాక‌.. కామ‌న్ గా సాగుతున్న అన్వేష‌ణ‌లు ఒకేలా ఉంటున్నాయి...ఈ త‌రం కుర్రాళ్ల డ్రీమ్స్ ఫైల్ ఓపెన్ చేస్తే మెను ఇలా ఉంద‌న‌వ‌చ్చు... అమ్మాయి ఎర్రగా, నాజూగ్గా ఉండాలి. (మ‌న హీరో చింత‌పండు లా ఉన్నా కానీ, స్వప్న సుంద‌రి ఎర్రగా ఉండాల్సిందే.) అందంగా ఉండ‌ట‌మే కాదు అందంగా క‌నిపిస్తూ ఉండాలి. ఇంజ‌నీరింగ్‌, ఫార్మా, బ‌యో టెక్ వంటి ప్రొఫెష‌న‌ల్ డిగ్రీ ఉంటే మంచిది(నాలుగు రాళ్లు వెన‌కేసుకోవ‌చ్చు). కాన్వెంట్ స్కూళ్లో చ‌దువుకొని ఇంగ్లీషు ప‌లుకులు ప‌లుకుతుండాలి. ఉద్యోగం విష‌యంలో స‌గం మంది అటు ఉంటే సగం మంది ఇటు ఉంటున్నారు. వంట బాగా వ‌చ్చి ఉండాలి కానీ, వంట ఇప్పుడే నేర్చుకొంటున్నాన‌ని చెబుతుండాలి. త‌న మీద బాగా ఆధార ప‌డే అమ్మాయి ల‌నే ఇష్టప‌డ‌తారు. అత్తా మామ‌ల్ని బాగా బాగా గౌర‌వించాలి, ఆడ‌ప‌డుచుని, బావ గారుల్ని మ‌ర్యాద చేస్తుండాలి. అత్త వారింట్లో త‌న గౌర‌వం బాగా పెంచుతుండాలి.ఇక‌, అమ్మాయిల మెను కూడా త‌క్కువేమీ కాదు సుమా... మంచి హైట్ తో స్టయిలిష్ గా ఉండాలి (స‌చిన్ టెండూల్కర్ ల‌కు కాస్త సారీ బ్రద‌ర్‌). ఎక్కువ చ‌దువుకొని ఉండ‌ట‌మే కాకుండా ఇంగ్లీషు లో ఫ‌టా ఫ‌ట్ మాట్లాడుతుండాలి(హైద‌రాబాద్ అమ్మాయిలు హిందీ కు కూడా మార్కులు వేస్తారు) విదేశాల్లో ఉంటే వెంట‌నే స్టాంప్ ప‌డుతుంది. ఒక్కడే కొడుకై ఉండాలి. అత్త గారింట్లో త‌న మ‌ర్యాద ద‌క్కించాలి. ప్రతీ విష‌యంలో త‌న స‌ల‌హా తీసుకోవాలి. ఉద్యోగం, జీతం విష‌యంలో ప‌ట్టింపుల మీద నో కామెంట్‌. త‌న భావాల్ని , ఇష్టాయిష్టాల్ని గౌర‌వించాలి తప్పితే ఇలా ఉండ‌ద్దు, అలా చేయ‌ద్దు అని గీత‌లు గీస్తే ఎక్కడో కాలుతుంది. స్పీడ్ గా ఉంటూ జోక్ లు క‌ట్ చేయ‌టం, గెడ్డం కాస్త పెంచుతూ ట్రిమ్ చేయ‌టం, బైక్ వేగంగా న‌డ‌ప‌టం వంటివి పెళ్లి ముందు ప్లస్ పాయింట్స్, పెళ్లి త‌ర్వాత మైన‌స్ పాయింట్స్..

ఈ మెనూ ఇలాగే ఉండాల‌ని మ‌నం రాజ్యాంగం రాసేయ‌లేం. జ‌న‌ర‌ల్ గా ఆలోచిస్తే మ‌న యూత్ ఆలోచ‌న‌లు అచ్చంగా ఇలాగే సాగుతున్నాయి. స‌మ‌స్య ఈ లిస్ట్ తో కాదు. ఈ లిస్ట్ లో ఉన్న ల‌క్షణాలు ఉన్న అమ్మాయి లేక అబ్బాయి దొర‌క‌టం తోనే ఉంది. కొన్ని కామ‌న్ గా క‌లిసినా, మ‌రికొన్ని డిఫ‌ర్ అవుతుంటాయి. అక్కడే స‌మ‌స్య వ‌స్తుంది. ప‌రీక్షలో 40 మార్కులు వ‌స్తే పాస్ కావ‌చ్చు. ఇక్కడ 75 మార్కుల డిస్టింక్షన్ కూడా క‌లిసి రావ‌టం లేదు. నూటికి నూరు శాతం కోరుకొన్న ల‌క్షణాలు ఉన్న జోడీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పెళ్లి కాని ప్రసాద్ లు, ప్రసాద‌మ్మ లు పెరిగిపోతున్నారు. ఎడ‌మ చేత్తో జాబితా పెట్టుకొని, కుడి చేత్తో క‌ళ్ల జోడు స‌వ‌రించుకొంటూ ( ఈ బాప‌తు బ్యాచ్ కు క‌ళ్ల జోడు ఎక్కువ‌గా ఉంటుంది, కార‌ణం నాకూ తెలీదు) వెద‌కుతుంటారు. ఆగ‌దు ఈ దేశము ఏ నాటికీ,,, ఆగితే సాగ‌దు అని పాడుకొంటూ వెద‌కుతుంటారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ, ఈ కోరిక‌ల రావు లేక కోరిక‌ల రాణి ల‌తో త‌ల నొప్పి, వారి త‌ల్లి దండ్రుల‌కు. డ్రీమ్ గ‌ర్ల్, గ్రీకు వీరుడు ల‌ను త‌ల‌చుకొంటూ కుర్ర కారు కాలం గ‌డిపేస్తుంది. వాళ్ల పెళ్లి చేద్దాం అని ప్రయ‌త్నాల‌తో భేతాళుడ్ని త‌ల‌పించే పేరంట్స్ కు ఈ భావాలు కంటికి ఇంపుగా, పంటి కి రాయిలా తోస్తుంటాయి. ఈ ల‌క్షణాలు ఉన్న జోడీ ని తెచ్చేద్దామ‌ని స్పీడ్ గా ప్రయ‌త్నిస్తుంటారు కానీ, క్లచ్ ప్లేట్ లు అరిగిపోయిం త‌ర్వాత‌...వీళ్లకు పెళ్లి ఎప్పుడు అవుతుంది దేవుడా అని బాధ ప‌డుతుంటారు. ఆ త‌ర్వాత మ్యారేజ్ బ్యూరోలు, వివాహ వేదిక‌లు, వివాహ ప్రక‌ట‌న‌లు వంటి మార్గాల్లో అన్వేష‌ణ సాగుతుంది. మ్యాచెస్ ఆర్ మేడిన్ హెవెన్ కాబ‌ట్టి దేవుడు నిర్ణయించిన స‌మ‌యానికి క‌రెక్టగా పెళ్లి అయిపోతుంది. అదృష్టం బాగుంటే మెనూ లో ల‌క్షణాల‌న్నీ స‌రిపోతాయి, లేదంటే అవ‌త‌ల వారికి ల‌క్షణాలు నేర్పే ప్రయ‌త్నం చేస్తారు. లేదంటే వ‌చ్చే వాడి దుంప తెగుతుందని సుమ‌తీ శ‌త‌కంలో ఉండి ఉండ‌వ‌చ్చు.

ష‌రాతు.. ప్రేమ పెళ్లి విష‌యంలో ఈ ల‌క్షణాల గోల వ‌ర్తించ‌దు. ఎందుకంటే ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగ‌ది అని ప్రేమ శాస్త్రం ఘోషిస్తుంది. కానీ సినిమాల్లో ప్రేమ‌జంట‌లు అచ్చు ఈ ల‌క్షణాల‌తోనే ఉంటాయి ఎందుకో తెలీదు.
ప్రేమించుకొన్నాం,,ఇక‌పెళ్లి కార్డు ఇవ్వ‌ట‌మే త‌రువాయి అన్న రేంజ్ లో రెచ్చిపోయి చెట్టా ప‌ట్టాలేసుకొని తిరిగి, ఇప్పుడు తూచ్‌..వాళ్లెవ‌రో మాకు తెలీదు అన్న రేంజ్ లో తిరుగుతున్న కొన్ని జోడీ ల ఫోటోలు దొరికాయి. ఈ గ్లామ‌ర‌స్ జంట ల్ని మీరు చూడ‌వ‌చ్చు...pl. visit - http://www.godavariyouth.com/m/photos/home/
................................................

Tuesday, December 21, 2010

చీర క‌ట్టు సొగ‌సు చూడ‌త‌ర‌మా..:

అందానికి ఆడవారు పేటెంట్ హ‌క్కు పొందిన వార‌ని క‌వులు చెబుతారు. ఆడ‌వారి అందానికి వ‌న్నె తెచ్చే వాటిలో చీర‌క‌ట్టు ని మించింది లేదు. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో కూడా వాదించి నెగ్గవ‌చ్చు. ఎందుకంటే అక్కడి న్యాయ‌మూర్తులకు చీర అంటే అర్థం కాదు కాబ‌ట్టి అనుకోవ‌ద్దు. చీర క‌ట్టుని, చీరె లో అందాలు ఒలికించే తెలుగింటి అమ్మాయిని చూస్తే.. జడ్జి లు మారు మాట లేకుండా ఆర్డర్‌,, ఆర్డర్ .. అంటూ సుత్తిని సినిమాల్లో చూపిన‌ట్లు బాది మ‌రీ ఆర్డర్ వేసేస్తారు.
అస‌లు ఆడ‌పిల్ల చిన్నత‌నం నుంచి చీర క‌ట్టుకొనేందుకు ఆస‌క్తి చూపుతుందంటారు. చిన్న నాటి ఆట‌ల్లో చిన్నారులు ట‌వ‌ల్ నే చీర‌గా చుట్టుకొని మురిసిపోతారు. ఆ త‌ర్వాత చ‌దువుల్లో ప‌డి మ‌రిచిపోయినా, పెద్దయ్యాక చీర ను సింగారించుకొంటారు. ఎప్పటిక‌ప్పుడు తాజా అందాల్ని చీర లో చాటుతూ మెరిసిపోతారు.


స్కూల్స్ లో హాఫ్ శారీ తో అదేనండీ లంగా ఓణీ లో త‌ళుక్కున మెరుస్తుంటారు. అప్పుడే విక‌సిస్తున్న తాజా పూల ను గుర్తు చేస్తారు. ఓణీ తో క్లాస్ కు వెళ్లిన కొత్త లో ప‌దే ప‌దే చూసుకొంటూ న‌డుస్తుంటారు. వాళ్లకే కాదు, చుట్టుప‌క్కల వాళ్లకు కూడా అల‌వాట‌య్యే దాకా ఇది త‌ప్పదు.
ఇక‌, కాలేజీ కి వెళ్లాక చుడీదార్‌లు, స‌ల్వార్ క‌మీజ్‌లు ఒక ట్రెండ్ అయితే జీన్స్, ప్యాంట్ షర్టులు మ‌రో ట్రెండ్. అప్పుడు అప్పుడు వేసుకొనే చీర‌లు మొత్తం ట్రెండ్ కే ట్రెండ్ సెట్టర్ లు. అప్పుడ‌ప్పుడే చీర క‌ట్టుని ప్రాక్టీస్ చేసే అమ్మాయిలు,, క్లాస్ లో ప‌ది సార్లు పైట ను ప‌ది సార్లు స‌ర్దుకోవ‌టం కామ‌న్ . దీన్ని అపార్థం చేసుకోవ‌టం నిషేధం. జూన్‌, జూలై ల్లో కాలేజ్ ఓపెన్ చేసినప్పటి శారీల‌కు , డిసెంబ‌ర్., జ‌న‌వ‌రిల్లో మిడిల్ సీజ‌న్ శారీ ల‌కు చాలా తేడా ఉంటుంది. కొత్త కాబ‌ట్టి, వేస‌వి సెల‌వ‌ల బ్రేక్ ను దాటుకొని వ‌చ్చిన శారీలు అవి. కానీ, డిసెంబ‌ర్, జ‌న‌వ‌రిల్లో ఒందిక‌గా, బాగా ఓర్పుగా సెల‌క్ట్ చేసుకొన్న శారీలు కాలేజీల్లో క‌ళ క‌ళ లాడుతుంటాయి.

యూనివ‌ర్శిటీ రోజుల్లో చీరలు అంటే ప్రపంచ స్థాయి బ‌ద్దకం అక్కడ క‌నిపిస్తుంది. డిపార్టమెంట్ లోనూ , లైబ్రరీల్లోనూ, ల్యాబ్ ల్లోనూ ఒక‌టే పుస్తకాల తో కుస్తీ ప‌ట్టడం కాబ‌ట్టి ఈ సెష‌న్ లో శారీలు కూడా అలాగే ఉంటాయి. దీన్నే నిపుణులు చీర క‌ట్టుకోవ‌టం అని కాకుండా చీర ను చుట్టుకోవ‌టం అని పిలుస్తారు. అన్నది నిపుణులు కాబ‌ట్టి ఏమైనా చెల్లుతుంది, మ‌న‌కు మాత్రం న‌డ‌వ‌దు. క్యాంప‌స్ ల్లో ఏదో సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంటారు కాబ‌ట్టి చీర‌ను కూడా సాధించేందుకు క‌ట్టుకొంటారు. ఈ సీజ‌న్ లో చ‌త్వారం క‌ళ్లజోడు ఏర్పడే ప్రమాదం ఉన్నందున , ఫాన్సీ చీర‌ల‌తో కాంబినేష‌న్ క‌లిపేస్తుంటారు. ఆదివారాలు, సెల‌వు రోజుల్లో ఎల్ హెచ్ లు ..అదేనండి లేడీస్ హాస్టల్స్ బ‌య‌ట‌కు చీర‌ల్లో సీతాకోక చిలుక‌లు వ‌స్తాయ‌ని స్థానిక క‌వులు రిపోర్ట్ చేస్తుంటారు.

ఉద్యోగ జీవితంలోకి వ‌చ్చాక , సొంత సంపాదన మొద‌ల‌వుతుంది కాబ‌ట్టి చీరెలు కొన‌టం మొద‌ల‌వుతుంది. అప్పటి దాకా సెల‌క్షన్ ఎవ‌రిదైనా ఎల‌క్షన్ ద‌గ్గర కొన్ని సార్లు రాజీ ప‌డ‌క త‌ప్పదు. అందుకే చ‌దువుకొనే రోజుల్లోనే ఉద్యోగంలో చేరాక సంపాద‌న‌ను చీర‌లు కొనేందుకు వెచ్చించాలి అని ఒట్టేసుకోవ‌టం..మ‌నం ఒట్టుతో పెట్టుకొన్న విద్య‌. శాల‌రీ చేతిలో ప‌డిన వెంట‌నే కొంత మొత్తం చీర‌ల షాపు పేరుతో రిజ‌ర్వ్ చేయాల్సిందే. ఆ త‌ర్వాత కొలీగ్స్ ను వెంటేసుకొని వెళ్లి చ‌క్కటి శారీ ని సెల‌క్ట్ చేసుకోవ‌డం రివాజు. ఈ స‌మ‌యంలో చీర‌ల ఎంపిక విష‌యంలో కాస్తంత క‌న్ ఫ్యూజ‌న్ ఉంటుంద‌ని కామాక్షి అనే కొలీగ్ కోట్ చేస్తున్నారు. కార‌ణం చెప్పలేదు కాబ‌ట్టి మ‌నం బుర్ర బ‌ద్దలు కొట్టుకోవ‌టం వేస్ట్.భార‌తీయ వివాహ చ‌ట్టాల ప్రకారం పై మూడు స్టేజ్ ల లోంచి ఎక్కడి నుంచైనా పెళ్లి చేసుకొని గృహిణి గా మారిపోవ‌చ్చు. శాస్త్రం ప్రకారం పెళ్లి కుతూరు ప‌ట్టు చీర‌లో మెరిసిపోవాల్సిందే. రాఘ‌వేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ క‌న్నా ఎక్కువ చీర‌లు పెళ్లి స‌మ‌యంలో మార్చాల్సిందే. పెళ్లి నాడు క‌ట్టుకొనే చీర గురించి ముందు నుంచే ప్లాన్ చేసుకొనే అమ్మాయిలు - ప్లాన్ చేసుకోని అమ్మాయిల క‌న్నా చాలా చాలా ఎక్కువ‌. కుటుంబం అంతా క‌లిసి క‌ట్టుగా రాజ‌మండ్రి తాడితోట సెంట‌ర్ కు వెళ్లి పెళ్లి చీర‌లు కొన‌టం మా గోదావ‌రి జిల్లాల్లో రివాజండీ...ఈ టీమ్ లో చేయి తిరిగిన ఎక్స్ ప‌ర్ట్ ను తీసుకెళ‌తారు. ఆ ఎక్స్ ప‌ర్ట్ చీర‌ల్ని ర‌క ర‌కాలుగా వ‌ర్ణిస్తూ చీర‌ల్ని కొనిపిస్తారు. చాలా మంది లాగే నాకూ అర్థం కాని విష‌యం ఏమంటే చీర‌ల సెల‌క్షన్ లో ఎక్స్ ప‌ర్ట్ లుగా మ‌గ‌వాళ్లు ఈ టీమ్ లో ఉంటారు.


ఇక‌, ఇంటికి అందం ఇల్లాలు అయితే, ఇల్లాలుకి అందాన్ని తెచ్చేది చీర కట్టు. పూర్వం ఇల్లాలు కి యూనిఫామ్ గా చీర ఉండేది. రోజులు మారాయి అనే సినిమా తీసిన నాటి నుంచి రోజులు మారి, మిగిలిన డ్రస్ లు కూడా హాయిగా వేసుకొంటున్నారు. అయిన‌నూ తెలుగింటి చీర‌కు ఉండే ప్రాధాన్యం ఏమీ త‌గ్గలేదు. పైగా ఇల్లాలి హోదాలో అనేక ర‌కాల చీర‌ల్ని వార్డ్ రోబ్ లో పెట్టుకోవ‌టం త‌ప్పనిస‌రి. రోజు వాడే సాదా చీర‌లు, అప్పుడుప్పుడు క‌ట్టే వెరైటీ చీర‌లు, పిల్లల‌తో బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు క‌ట్టే డిఫ‌రెంట్ చీర‌లు, భ‌ర్తతో మాత్రమే షికారుకి వెళ్లేప్పుడు స్పెష‌ల్ చీర‌లు, ఫంక్షన్ ల‌కు క‌ట్టే ప్రత్యేక చీరలు.. ఇలా రాస్తూ పోతే చంద‌న బ్రద‌ర్స్ బ్రాంచీ ల లిస్ట్ అంత అవుతుంది. టూకీ గా చెప్పాలంటే ఇల్లాలు కి చీర‌లు అంటే మ‌క్కువ ఎక్కువ‌. దీన్ని గౌర‌వించ‌క పోతే భ‌ర్తల‌కు క‌ష్టాలు ఎక్కువ‌. మ‌రీ కాదంటే అనేక రూపాల్లో క‌ష్టాల క‌డలి గా మారుతుంది. పెళ్లి అయిన కొత్తలోనే ఈ విష‌యంలో బోధి చెట్టు కానీ, బొబ్బాస చెట్టు కింద కానీ కూర్చొని జ్ఞానోద‌యం పొందుతారు కాబ‌ట్టి భ‌ర్తలు బ్రెహ్మాండంగా జాగ్రత్త ప‌డ‌తారు. దేవుడికి మొక్కులు ఉన్నట్లే భార్యల్ని ప్రస‌న్నం చేసుకోవాలంటే చీర‌లు కొని పెట్టాల‌ని సీనియ‌ర్లు అంత‌కు ముందే చెబుతారు కాబ‌ట్టి జూనియ‌ర్లు ఆ రూట్ లో ప్రొసీడ్ అవుతారు.
నాకు, ఇంత వ‌ర‌కే అవ‌గాహ‌న ఉంది కాబ‌ట్టి ఈ ద‌శ‌తో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ చీర‌ల క‌థానికను మంచి హృద‌యంలో స్వీక‌రిస్తార‌ని ఆశిస్తూ..( చీర‌ల మీద ఒక ఉత్తరాది ప‌డుచు మ‌న‌సు ప‌డి ఫోటోలు తీయించుకొంది.. ఆ ఫోటోల్ని మీరు ద‌ర్శించ‌వ‌చ్చు.pl. visit..http://www.godavariyouth.com/m/photos/home/

Monday, December 20, 2010

ఒక గోళీ సోడా క‌థ‌..చాలా కాలం త‌ర్వాత మా ఫ్రెండ్ ర‌విని క‌లిశాను. చాలా కాలం అంటే చాలా కాలం అన్న మాట‌.. ఇంకా చెప్పాలంటే 13 సంవ‌త్సరాల త‌ర్వాత అన్నమాట‌. నిజ్జంగా నిజ్జం. ఎంత నిజ్జం అంటే, మన గోదావ‌రి తల్లి వ‌య్యార‌మంత నిజ్జం. రేలంగి సెంట‌ర్ లో మా ర‌విని చూడ‌గానే చాలా సంతోషం వేసింది. వాడు అస్సలు మార‌లేదు. అప్పుడు కూడా చాలా స్మార్ట్ గా ఉండేవాడు. అదే స్టయిల్ లో హాయి గా న‌వ్వుతూ ప‌ల‌క‌రించాడు. ఈ న‌వ్వుతోనే ఎవ‌రో ఒక‌రిని ప‌డ‌గొట్టేస్తావురా అంటూ ఉండేవాడిని... అన్న ట్లే అయింద‌ని త‌ర్వాత చెప్పాడు ఒక స్టోరీ. ఇప్పుడు అది అప్రస్తుతం. మా ర‌వి మాత్రం నన్ను కావ‌లించుకొని చాలా సేపు ఉండిపోయాడు. దాదాపు 13 సంవ‌త్సరాల త‌ర్వాత చూసుకొన్న అనుబంధం.
హైదరాబాద్ లో టీవీ జ‌ర్నలిస్టు గా ఉరుకులు, ప‌రుగులు జీవితం గ‌డిపే మ‌న‌కు,, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా లో స్వచ్చమైన గోదార‌మ్మ ఒడిలో త‌ణుకు ప‌క్కన గువ్వలా ఒదిగిపోయిన రేలంగి లాంటి ఊరెళితే ఎలా ఉంటుంది..! సిటీ బ‌స్సు కండ‌క్టర్ కు ఓల్వా బ‌స్సు డ్యూటీ ప‌డ్డట్లు, గూడ్స్ బండి గార్డ్ కు ఏసీ టూ టైర్ కోచ్ లో టీసీ పోస్టింగ్ ఇచ్చిన‌ట్లు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే ముందు ఎటువంటి ఎసైన్ మెంట్లు చెప్పకుండా బాస్ సాగ‌నంపిన‌ట్లు...ఇలా ఎన్నయినా ఊహించుకోవ‌చ్చు. కానీ, ఈ ఊహ‌ల క‌న్నా ఆ రేలంగి ఊరే బాగుంది. పైగా మా రవిది డాబా ఇల్లు కాబ‌ట్టి పై అంత‌స్తు కి చేరిపోయాను. ర‌వి శ్రీ‌మ‌తి కూడా న‌న్ను సాద‌రంగా ఆహ్వానించారు. ఇంట్లో ద‌గ్గరుండి అతిథి మ‌ర్యాదలు చేశారు. హై స్కూలు లో చిగురించిన మా స్నేహం , కాలేజీ రోజుల్లో కూడా ఎలా ప‌రిమ‌ళించిందో ఇద్దరం గుర్తు చేసుకొన్నాం. నేను పెద్దాపురం కాలేజీ లో చ‌దువు వెల‌గ‌బెడుతున్నప్పుడు కాకినాడ కు సైకిల్ మీద చెక్కేసేవాడిని. అక్కడ ర‌విని తీసుకొని కాకినాడ లో బలాదూర్ తిరిగే వాళ్లం. తిరిగి ఇంటికి పాతిక కిలోమీటర్లు - సైకిల్ మీద వ‌చ్చినా అల‌స‌ట ఉండేది కాదు, ఎందుకంటే మా ర‌వి అంత బ్రహ్మాండంగా ఎ న‌ర్జీ ఇచ్చి పంపించేవాడు. రేలంగిలో కూడా అదే జ‌రిగింది.
ఉద‌య కాంతుల్లో కొబ్బరాకుల చాటున లేలేత కిర‌ణాలు దోబూచులాడుతుండ‌గా అక్కడ అడుగు పెట్టాను. మ‌ద్యాహ్నం దాకా మాకు పాత క‌బుర్లు గ్రైండ్ చేసుకోవ‌ట‌మే స‌రిపోయింది. మ‌ధ్యాహ్నం ర‌వి వాళ్ల శ్రీ‌మ‌తి భోజ‌నానికి పిలిచే దాకా మేం క‌బుర్ల లోనే మునిగిపోయాం. కాలేజీ రోజుల త‌ర్వాత ఒక్కో సంవ‌త్సరం లెక్కించుకొంటూ, ఆ సంవత్సరంలో తాను ఎక్కడ ఉన్నదీ, నేను ఎక్కడ గ‌డిపిందీ లెక్కలు వేసుకొన్నాం. అస‌లు మేం క‌లిసింది కూడా గ‌మ్మత్తే. గోదావ‌రి యూత్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో పాత మిత్రుల వివ‌రాలు కొంత దొరికితే జ‌గ్గంపేట లో ఎంక్వయిరీ చేయించా. అక్కడ లెక్కల మాస్టారు ర‌మ‌ణ‌మూర్తి గారి చిరునామా దొరికింది. ఆ రూట్ లో ప్రయ‌త్నిస్తే మా ర‌వి అడ్రస్ దొరికింది. దొరికిన నెల రోజుల‌కే సెల‌వు దొర‌క పుచ్చుకొని ఒక రోజు భాగ్యానికి ఎగురుకొంటూ రేలంగి లో వాలిపోయా. గోదావ‌రి యూత్ డాట్ కామ్ కాన్ సెప్ట్ విని మా ర‌వి వాళ్ల శ్రీ‌మ‌తి ఆశ్చర్య పోయారు. ఆమె చేతి భోజ‌నం ఇద్దరం సుష్టుగా తిని బ‌య‌ట ప‌డ్డాం. జ‌ర్నలిస్టుల‌కు కూడా చాలిన‌న్ని సెల‌వులు ఇచ్చే హామీ ఇస్తే నా ఓటు వారికే వేద్దామ‌ని చాలా కాలం నుంచి అనుకొంటున్నాను కానీ, ఇది ఒక తీర‌ని కోరిక అని తెలుసుకొన్నాను. కాబ‌ట్టే సాయంత్రం హైద‌రాబాద్ వెళ్లేందుకు బ‌య‌ట ప‌డ్డాను. అప్పుడే మ‌రిచిపోలేని బ‌హుమ‌తి ఇచ్చాడు మా ర‌వి.
కొట్టవోయ్ సోడా..!
ఊరి చివ‌ర ఉన్న బడ్డీ కొట్టు ద‌గ్గర ఆపి గోళీ సోడా తాగించాడు. నిజంగా ఎంత రుచిగా ఉంది. ఎన్ని సంవ‌త్సరాలై పోయింది సోడా తాగి. వారెవ్వా... హైద‌రాబాద్ లో డబ్బు పాడేస్తే అన్నీ దొరుకుతాయంటారు. ఎంత నిజ‌మో తెలీదు కానీ, గోళీ సోడా దొర‌క‌నే దొర‌క‌దు. పైగా బ‌డ్డీ కొట్టు ద‌గ్గర కులాసాగా నిల‌బ‌డి, విలాసంగా సోడా తాగుతుంటే ఆ స్టయిలే వేరు. మా చిన్నప్పుడు చిరంజీవి, బాల‌కృష్ణ ఫ్యాన్స గా విడిపోయి మేం కొట్టుకొనే వాళ్లం. అంటే చిరు అభిమానుల కొట్టు అంటే అక్కడ చెక్కల కు చిరంజీవి పోస్టర్లు అంటించి ఉంటాయ‌న్న మాట‌. అక్కడకు బాల‌య్య అభిమానులు పోర‌న్న మాట‌. ఇక‌, బాల‌య్య బొమ్మలు బెమ్మాండంగా అంటించిన కొట్టు బాల‌య్య ఫ్యాన్స్ ది. అక్కడే బాల‌కృష్ణ అభిమానులు సోడాలు తాగినా, కార‌ప్పూస తిన్నా. అది రూల్ మ‌రి. ల‌క్కీగా నేను ఇప్పుడు ఎవ‌రికీ ఫ్యాన్ కాక‌పోవ‌టం, అక్కడ ఏ బొమ్మలు లేక‌పోవ‌టంతో ర‌వి బ‌తికిపోయాడు. ఆ సంగతే ర‌వితో చెబితే ప‌డి ప‌డి న‌వ్వాడు. నిజంగా అదే ర‌వికి ఉన్న ఎసెట్. స్మార్ట్ గా ఉంటూ స్టయిల్ గా న‌వ్వటం. ఈ న‌వ్వుతోనే ఎవ‌రినైనా ప‌డేస్తావురా అనే వాడిని. అదే మాట అంటే స్టయిల్ గా న‌వ్వుతూ త‌ణుకు బ‌స్టాండ్ కు తీసుకొని వ‌చ్చాడు. ఏడాదికి ఒక‌సారి సంక్రాంతి పండ‌గ వ‌చ్చిన‌ట్లు, ఒక్క రోజు లో మా ర‌విని చూసి రాగ‌లిగాను, క‌లిసి సోడా తాగ‌గ‌లిగాను. మ‌రిచిపోలేని అనుభూతుల్ని మురిపెంగా మూట క‌ట్టుకొని , కాంక్రీట్ ఊసల వంటి హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరాను. మ‌ర్నాటి ఎసైన్ మెంట్లకు సంబందించి ఎస్ ఎమ్ ఎస్ లు స‌వ‌రించుకొంటూ ప్రయాణం సాగిపోయింది.

Sunday, November 7, 2010

ధర్మ సందేహాలుహైందవ ధర్మంలో ఉన్న వారికి నిత్యం ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. గతంలో ఉమ్మడి కుటుంబ వ్వవస్థ కాబట్టి, ఇంటిలోని పెద్దలు వీటిని తీర్చే వారు. నేటి ఆధునిక కాలంలో ఇటువంటి అవకాశం లేదు. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, అపర కర్మలు, నోములు, ఆచారాలు, సంప్రదాయాలు వంటి అనేక అంశాలపై సందేహాలు తీర్చేందుకు స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఛానెల్ ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం నుంచి శనివారం దాకా ప్రతీరోజు ఉదయం 6గంటల 30 నిముషాలనుంచి 7గంటల దాకా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
ప్రముఖ జ్యోతిష్కులు, గాయత్రీ జ్యోతిషాలయం నిర్వాహకులు మంథా సూర్యనారాయణ శర్మ దీన్ని నిర్వహిస్తున్నారు. బేసిక్ గా సూర్యనారాయణ శర్మ జ్యోతిష్కులు కావటం వల్ల జాతక పరమైన సమస్యలకు కూడా వారు పరిష్కారం చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు...కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.

Thursday, September 2, 2010

వాన కష్టాలు

గోదావరి జిల్లా వాసులకు వానా కాలం వచ్చిందంటే కష్టాలే అనుకోవాలి. ఇప్పటికే అనేక చోట్ల వాన కష్టాలు మొదలయ్యాయి. వానా కాలం లో జాగ్రత్తగా వుండాలని గోదావరి యూత్ కోరుకొంటోంది. వానా కాలం అప్ డేట్ ఎప్పడి కప్పుడు తెలుసు కోవాలి. ముఖ్యం గా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్త గా వుండాలి. వీలుంటే ఎగువ ప్రాంతాలకు చేరుకోవాలి. ఇందు కోసం ముందే ప్లాన్ చేసుకొంటె మంచిది.

Wednesday, June 2, 2010

light in poor houses

ఒక చక్కటి ప్రేరణ.. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రొఫెసర్ సౌర శక్తి తో పని చేసే విద్యుత్ దీపాలు తయారు చేస్తున్నారు. స్కూలు పిల్లలకు ఉపయోగ పడేట్లుగా కొన్ని లైట్లు తయారు చేశారు. కానీ వీటిని పేద పిల్లలకు ఉచితంగా అందించెందుకు కొందరు వ్యక్తుల సాయం అవసరం ఉంది. దీనికి మనం ఎమైన ముందడుగు వేయగలమ అని ఆలోచించండి. his email id is.. ranga@thrive.in

Monday, May 31, 2010

చిన్న ఆలోచన , పెద్ద సేవ
కష్టాల్లో ఉన్న వారికి సాయ పడాలని చాలామంది అనుకొంటారు. ఎక్కువమంది అనుకొంటూనే కాలం గడిపేస్తారు. కొందరే ముందుకు వచ్చి సేవాకార్యక్రమాలు చేపడతారు. ఇటువంటి వారిలో శివ, సునీత గురించి చెప్పాలి. బేసిక్ గా సాఫ్ట్ వేర్ నిపుణులు కాబట్టి, రెండు చేతులా సంపాదించి, జల్సాగా ఖర్చు పెట్టే రకం కాదు. ఒక చేత్తో సంపాదించి, రెండో చే్త్తో సేవ కార్యక్రమం చేపడుతున్నారు. పదేళ్ల క్రితం అమెరికా నుంచి తిరిగి వచ్చాక, మాదాపూర్ లో ప్రేమాలయం పేరుతో ఒక సేవా సంస్థను మొదలెట్టారు. దీని ద్వారా ఇప్పటికి మూడు గ్రామాల్ని దత్తత తీసుకొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల చిన్ని సాయంతోటి కొన్ని తరాల పాటు మేలు కలుగుతోంది. వీరి సంపాదనే, సేవకు వినియోగిస్తున్నారు. మన వంటి వారు ఒక చేయి వేస్తే .. మరి కొందరు పిల్లలు లాభ పడతారు. కావాలంటే సంప్రదించి చూడండి.http://www.premalayam.in/

Saturday, May 29, 2010

స్వాగతం


సాహితీ మిత్రులకు స్వాగతం.