ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Tuesday, December 21, 2010

చీర క‌ట్టు సొగ‌సు చూడ‌త‌ర‌మా..:

అందానికి ఆడవారు పేటెంట్ హ‌క్కు పొందిన వార‌ని క‌వులు చెబుతారు. ఆడ‌వారి అందానికి వ‌న్నె తెచ్చే వాటిలో చీర‌క‌ట్టు ని మించింది లేదు. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో కూడా వాదించి నెగ్గవ‌చ్చు. ఎందుకంటే అక్కడి న్యాయ‌మూర్తులకు చీర అంటే అర్థం కాదు కాబ‌ట్టి అనుకోవ‌ద్దు. చీర క‌ట్టుని, చీరె లో అందాలు ఒలికించే తెలుగింటి అమ్మాయిని చూస్తే.. జడ్జి లు మారు మాట లేకుండా ఆర్డర్‌,, ఆర్డర్ .. అంటూ సుత్తిని సినిమాల్లో చూపిన‌ట్లు బాది మ‌రీ ఆర్డర్ వేసేస్తారు.
అస‌లు ఆడ‌పిల్ల చిన్నత‌నం నుంచి చీర క‌ట్టుకొనేందుకు ఆస‌క్తి చూపుతుందంటారు. చిన్న నాటి ఆట‌ల్లో చిన్నారులు ట‌వ‌ల్ నే చీర‌గా చుట్టుకొని మురిసిపోతారు. ఆ త‌ర్వాత చ‌దువుల్లో ప‌డి మ‌రిచిపోయినా, పెద్దయ్యాక చీర ను సింగారించుకొంటారు. ఎప్పటిక‌ప్పుడు తాజా అందాల్ని చీర లో చాటుతూ మెరిసిపోతారు.


స్కూల్స్ లో హాఫ్ శారీ తో అదేనండీ లంగా ఓణీ లో త‌ళుక్కున మెరుస్తుంటారు. అప్పుడే విక‌సిస్తున్న తాజా పూల ను గుర్తు చేస్తారు. ఓణీ తో క్లాస్ కు వెళ్లిన కొత్త లో ప‌దే ప‌దే చూసుకొంటూ న‌డుస్తుంటారు. వాళ్లకే కాదు, చుట్టుప‌క్కల వాళ్లకు కూడా అల‌వాట‌య్యే దాకా ఇది త‌ప్పదు.
ఇక‌, కాలేజీ కి వెళ్లాక చుడీదార్‌లు, స‌ల్వార్ క‌మీజ్‌లు ఒక ట్రెండ్ అయితే జీన్స్, ప్యాంట్ షర్టులు మ‌రో ట్రెండ్. అప్పుడు అప్పుడు వేసుకొనే చీర‌లు మొత్తం ట్రెండ్ కే ట్రెండ్ సెట్టర్ లు. అప్పుడ‌ప్పుడే చీర క‌ట్టుని ప్రాక్టీస్ చేసే అమ్మాయిలు,, క్లాస్ లో ప‌ది సార్లు పైట ను ప‌ది సార్లు స‌ర్దుకోవ‌టం కామ‌న్ . దీన్ని అపార్థం చేసుకోవ‌టం నిషేధం. జూన్‌, జూలై ల్లో కాలేజ్ ఓపెన్ చేసినప్పటి శారీల‌కు , డిసెంబ‌ర్., జ‌న‌వ‌రిల్లో మిడిల్ సీజ‌న్ శారీ ల‌కు చాలా తేడా ఉంటుంది. కొత్త కాబ‌ట్టి, వేస‌వి సెల‌వ‌ల బ్రేక్ ను దాటుకొని వ‌చ్చిన శారీలు అవి. కానీ, డిసెంబ‌ర్, జ‌న‌వ‌రిల్లో ఒందిక‌గా, బాగా ఓర్పుగా సెల‌క్ట్ చేసుకొన్న శారీలు కాలేజీల్లో క‌ళ క‌ళ లాడుతుంటాయి.

యూనివ‌ర్శిటీ రోజుల్లో చీరలు అంటే ప్రపంచ స్థాయి బ‌ద్దకం అక్కడ క‌నిపిస్తుంది. డిపార్టమెంట్ లోనూ , లైబ్రరీల్లోనూ, ల్యాబ్ ల్లోనూ ఒక‌టే పుస్తకాల తో కుస్తీ ప‌ట్టడం కాబ‌ట్టి ఈ సెష‌న్ లో శారీలు కూడా అలాగే ఉంటాయి. దీన్నే నిపుణులు చీర క‌ట్టుకోవ‌టం అని కాకుండా చీర ను చుట్టుకోవ‌టం అని పిలుస్తారు. అన్నది నిపుణులు కాబ‌ట్టి ఏమైనా చెల్లుతుంది, మ‌న‌కు మాత్రం న‌డ‌వ‌దు. క్యాంప‌స్ ల్లో ఏదో సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంటారు కాబ‌ట్టి చీర‌ను కూడా సాధించేందుకు క‌ట్టుకొంటారు. ఈ సీజ‌న్ లో చ‌త్వారం క‌ళ్లజోడు ఏర్పడే ప్రమాదం ఉన్నందున , ఫాన్సీ చీర‌ల‌తో కాంబినేష‌న్ క‌లిపేస్తుంటారు. ఆదివారాలు, సెల‌వు రోజుల్లో ఎల్ హెచ్ లు ..అదేనండి లేడీస్ హాస్టల్స్ బ‌య‌ట‌కు చీర‌ల్లో సీతాకోక చిలుక‌లు వ‌స్తాయ‌ని స్థానిక క‌వులు రిపోర్ట్ చేస్తుంటారు.

ఉద్యోగ జీవితంలోకి వ‌చ్చాక , సొంత సంపాదన మొద‌ల‌వుతుంది కాబ‌ట్టి చీరెలు కొన‌టం మొద‌ల‌వుతుంది. అప్పటి దాకా సెల‌క్షన్ ఎవ‌రిదైనా ఎల‌క్షన్ ద‌గ్గర కొన్ని సార్లు రాజీ ప‌డ‌క త‌ప్పదు. అందుకే చ‌దువుకొనే రోజుల్లోనే ఉద్యోగంలో చేరాక సంపాద‌న‌ను చీర‌లు కొనేందుకు వెచ్చించాలి అని ఒట్టేసుకోవ‌టం..మ‌నం ఒట్టుతో పెట్టుకొన్న విద్య‌. శాల‌రీ చేతిలో ప‌డిన వెంట‌నే కొంత మొత్తం చీర‌ల షాపు పేరుతో రిజ‌ర్వ్ చేయాల్సిందే. ఆ త‌ర్వాత కొలీగ్స్ ను వెంటేసుకొని వెళ్లి చ‌క్కటి శారీ ని సెల‌క్ట్ చేసుకోవ‌డం రివాజు. ఈ స‌మ‌యంలో చీర‌ల ఎంపిక విష‌యంలో కాస్తంత క‌న్ ఫ్యూజ‌న్ ఉంటుంద‌ని కామాక్షి అనే కొలీగ్ కోట్ చేస్తున్నారు. కార‌ణం చెప్పలేదు కాబ‌ట్టి మ‌నం బుర్ర బ‌ద్దలు కొట్టుకోవ‌టం వేస్ట్.భార‌తీయ వివాహ చ‌ట్టాల ప్రకారం పై మూడు స్టేజ్ ల లోంచి ఎక్కడి నుంచైనా పెళ్లి చేసుకొని గృహిణి గా మారిపోవ‌చ్చు. శాస్త్రం ప్రకారం పెళ్లి కుతూరు ప‌ట్టు చీర‌లో మెరిసిపోవాల్సిందే. రాఘ‌వేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ క‌న్నా ఎక్కువ చీర‌లు పెళ్లి స‌మ‌యంలో మార్చాల్సిందే. పెళ్లి నాడు క‌ట్టుకొనే చీర గురించి ముందు నుంచే ప్లాన్ చేసుకొనే అమ్మాయిలు - ప్లాన్ చేసుకోని అమ్మాయిల క‌న్నా చాలా చాలా ఎక్కువ‌. కుటుంబం అంతా క‌లిసి క‌ట్టుగా రాజ‌మండ్రి తాడితోట సెంట‌ర్ కు వెళ్లి పెళ్లి చీర‌లు కొన‌టం మా గోదావ‌రి జిల్లాల్లో రివాజండీ...ఈ టీమ్ లో చేయి తిరిగిన ఎక్స్ ప‌ర్ట్ ను తీసుకెళ‌తారు. ఆ ఎక్స్ ప‌ర్ట్ చీర‌ల్ని ర‌క ర‌కాలుగా వ‌ర్ణిస్తూ చీర‌ల్ని కొనిపిస్తారు. చాలా మంది లాగే నాకూ అర్థం కాని విష‌యం ఏమంటే చీర‌ల సెల‌క్షన్ లో ఎక్స్ ప‌ర్ట్ లుగా మ‌గ‌వాళ్లు ఈ టీమ్ లో ఉంటారు.


ఇక‌, ఇంటికి అందం ఇల్లాలు అయితే, ఇల్లాలుకి అందాన్ని తెచ్చేది చీర కట్టు. పూర్వం ఇల్లాలు కి యూనిఫామ్ గా చీర ఉండేది. రోజులు మారాయి అనే సినిమా తీసిన నాటి నుంచి రోజులు మారి, మిగిలిన డ్రస్ లు కూడా హాయిగా వేసుకొంటున్నారు. అయిన‌నూ తెలుగింటి చీర‌కు ఉండే ప్రాధాన్యం ఏమీ త‌గ్గలేదు. పైగా ఇల్లాలి హోదాలో అనేక ర‌కాల చీర‌ల్ని వార్డ్ రోబ్ లో పెట్టుకోవ‌టం త‌ప్పనిస‌రి. రోజు వాడే సాదా చీర‌లు, అప్పుడుప్పుడు క‌ట్టే వెరైటీ చీర‌లు, పిల్లల‌తో బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు క‌ట్టే డిఫ‌రెంట్ చీర‌లు, భ‌ర్తతో మాత్రమే షికారుకి వెళ్లేప్పుడు స్పెష‌ల్ చీర‌లు, ఫంక్షన్ ల‌కు క‌ట్టే ప్రత్యేక చీరలు.. ఇలా రాస్తూ పోతే చంద‌న బ్రద‌ర్స్ బ్రాంచీ ల లిస్ట్ అంత అవుతుంది. టూకీ గా చెప్పాలంటే ఇల్లాలు కి చీర‌లు అంటే మ‌క్కువ ఎక్కువ‌. దీన్ని గౌర‌వించ‌క పోతే భ‌ర్తల‌కు క‌ష్టాలు ఎక్కువ‌. మ‌రీ కాదంటే అనేక రూపాల్లో క‌ష్టాల క‌డలి గా మారుతుంది. పెళ్లి అయిన కొత్తలోనే ఈ విష‌యంలో బోధి చెట్టు కానీ, బొబ్బాస చెట్టు కింద కానీ కూర్చొని జ్ఞానోద‌యం పొందుతారు కాబ‌ట్టి భ‌ర్తలు బ్రెహ్మాండంగా జాగ్రత్త ప‌డ‌తారు. దేవుడికి మొక్కులు ఉన్నట్లే భార్యల్ని ప్రస‌న్నం చేసుకోవాలంటే చీర‌లు కొని పెట్టాల‌ని సీనియ‌ర్లు అంత‌కు ముందే చెబుతారు కాబ‌ట్టి జూనియ‌ర్లు ఆ రూట్ లో ప్రొసీడ్ అవుతారు.
నాకు, ఇంత వ‌ర‌కే అవ‌గాహ‌న ఉంది కాబ‌ట్టి ఈ ద‌శ‌తో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ చీర‌ల క‌థానికను మంచి హృద‌యంలో స్వీక‌రిస్తార‌ని ఆశిస్తూ..( చీర‌ల మీద ఒక ఉత్తరాది ప‌డుచు మ‌న‌సు ప‌డి ఫోటోలు తీయించుకొంది.. ఆ ఫోటోల్ని మీరు ద‌ర్శించ‌వ‌చ్చు.pl. visit..http://www.godavariyouth.com/m/photos/home/

No comments:

Post a Comment