ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, December 1, 2012

వామ్మో ఆదివారం..!

స‌హ‌జంగా ఆదివారం వచ్చిందంటే అంద‌రికీ ఆనంద‌మే. ముఖ్యంగా బ‌డి పిల్లల‌కు మ‌రింత ఆనందం. క్లాసులు, పుస్తకాలు అన్నిటినీ ప‌క్కన పెట్టేసి హాయిగా ఆడుకొంటూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మేం కూడా చిన్నప్పుడు జిల్లా ప‌రిష‌త్ స్కూల్ లో చదివేట‌ప్పుడు అదే చేసే వాళ్లం.కానీ, ప‌దోత‌ర‌గ‌తిలోకి వ‌చ్చాక మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. వారం అంతా టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జ‌రిపేవాళ్లు. ఆదివారం వ‌చ్చిందంటే మాత్రం ప్రైవేటు క్లాసులు పెట్టేసేవాళ్లు.
ప్రభుత్వ పాఠ‌శాలల్లో వానాకాలం చ‌దువులు అంటారు కానీ, మా జిల్లా ప‌రిష‌త్‌స్కూల్ లో మాత్రం పరిస్థితి వేరు. టీచ‌ర్లు అంద‌రూ చాలాచాలా నిబ‌ద్దత‌తో ఉండేవారు. అంటే ఆదివారం కుటుంబ సభ్యుల‌తో కాలం గ‌డిపే చాన్సు ఉన్నా, దాన్ని వ‌దులుకొని స్కూల్ కు వ‌చ్చే వాళ్లు. ప్రతీ ఆదివారం ఒక్కో టీచ‌ర్ వ‌చ్చి మాకు ప్రైవేటు క్లాస్ పెట్టే వారు. ఏడో త‌ర‌గతిని ఒక టీచ‌ర్ తీసుకొంటే, ప‌దో త‌ర‌గ‌తిని మరో టీచ‌ర్ తీసుకొనేవారు. అప్పటికప్పుడు పాఠాలు చ‌దివించి అప్పగించుకొనే వారు. అక్కడే అస‌లు క‌థ మొద‌ల‌య్యేది. ఏడో త‌ర‌గ‌తిలో అయితే ఏదో గ‌డ‌చి పోయింది కానీ, ప‌దో త‌ర‌గ‌తి లో మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది. ప్రశ్నల‌కు జ‌వాబులు అప్పగించ‌క పోతే అక్కడిక‌క్కడ చిత‌క్కొట్టే వారు. అది కూడా క్లాస్ లోని ఆడ‌పిల్లల ముందు తిట్టి పోస్తూ బెత్తంతో కొడుతుంటే పైకి ఏడ్వలేక‌, లోప‌ల ఉండ‌లేక చాలా ఇబ్బంది ప‌డేవాళ్లం. టీచ‌ర్లు సెటైర్లు వేస్తూ కొడుతుంటే ఆడ‌పిల్లలు ముసి ముసి న‌వ్వులు న‌వ్వేవారు. అంత‌కు ముందు ఏడో త‌ర‌గ‌తిలో ఇటువంటి ప‌రిస్థితి ఉన్నప్పటికీ అప్పుడు అంత‌టి ఫీలింగ్స్ ఉండేవి కాదు. కానీ, నెమ్మదిగా 8, 9 క్లాసులు దాటి ప‌దికి వ‌చ్చేసరికి సీన్ మారిపోయేది. ఆడపిల్లల ముందు ఏమిచేసినా జాగ్రత్తగా ఉండాల్సి వ‌చ్చేది. కొత్త సిగ్గులు మొగ్గలు తొడిగే సీజ‌న్ అది. క్లాసు లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండేవాళ్లం. కానీ, అంతా ఒక‌రిని ఒక‌రిని గౌర‌వంగా, అభిమానంగా వ్యవ‌హ‌రించేవాళ్లం. త‌ప్పితే ఎటువంటి సిల్లీ ప‌నులు ఉండేవికాదు. ఆ తాకిడి నుంచి త‌ప్పించుకొనేందుకైనా ఏ రోజు పాఠాలు ఆ రోజు చ‌దివేయాల్సి వ‌చ్చేది. ఎటువంటి వ‌స‌తులు లేక‌పోయినా చెట్టుకింద కూర్చొబెట్టి చ‌దువులు చెప్పారు. త‌ల‌చుకొంటే వారి క‌మిట్ మెంట్ ముందు మ‌న వృత్తి నిబ‌ద్దత ఏపాటిది అనిపిస్తుంది. అందుకే ఆ ఫౌండేష‌న్ బ్రహ్మాండంగా ఉండేది. వెన్ను త‌ట్టే వారు లేకపోయినా కాలేజీ చ‌దువులు, యూనివ‌ర్శిటీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేసుకొని మ‌హా నగ‌రంలో ఉద్యోగం అందుకోగ‌లిగామంటే ఆ మ‌హాను భావుల ఆశీస్సులే. అందుకే ఇప్పటికీ ఆదివారం నాడు కూడా ఆఫీసు ప‌నులు, ఇంటి ప‌నులు స‌మ‌న్వయంతో సాధించుకోగ‌లుగుతున్నాం అనిపిస్తుంటుంది.

Sunday, October 7, 2012

సాక్షాత్తు సాయి మా ఇంటికి వ‌చ్చాడు...!

నిజ‌మే.. సాయి రాత్రి మా ఇంటికి వ‌చ్చాడు. అస‌లు ఆ పేరులోనే ఒక రిలీఫ్ ఉంటుంది. సాయి అంటే అందుకే మా అంద‌రికీ అంత ఆస‌క్తి. సాయి ప‌లుకులు, వాక్యాలు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడు చూసినా ఒక‌టే త‌ర‌హా.. అందుకే సాయి అంటే మా ఇంటిల్లి పాదికి అంత ఇష్టం. ఎన్ని రోజులైంది. సొంత ఊరి మ‌నిషి... అనుకోకుండా ఇంటికి వ‌స్తే భ‌లే గ‌మ్మతుగా ఉంటుంది క‌దా..! అదే జ‌రిగింది. రాత్రి సాయి మా ఇంటికి వచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ లో చ‌క్రం వెన‌క్కి తిప్పితే...!
గోదావ‌రి జిల్లా లో ఒక సాధార‌ణ ప‌ల్లెటూరు. న‌డిచి స్కూల్ కి వెళ్లి ప‌రీక్ష పాస్ అయినందుకు.. ఇంట్లో సైకిల్ కొనిస్తే, దాని మీద కాలేజీ కి అక్కడ ప‌రీక్ష పాస్ అయినందుకు... ఇంట్లో బ్యాగ్ స‌ర్ది ఇస్తే యూనివ‌ర్శిటీ కి వెళ్లి ప‌రీక్ష పాస్ అయినందుకు... ఇంట్లో అన్ని విష‌యాలు వివ‌రించి చెప్పినందుకు ఉద్యోగం సంపాదించుకొన్నామ‌న్న మాట‌. నాలుగు ముక్కల్లో ఫ్లాష్ బ్యాక్ ముగిశాక జ‌ర్నలిస్టు గా హైద‌రాబాద్లో స్థిర ప‌డ్డాక అప్పుడ‌ప్పుడు మా ఊరికి వెళ్లి అంతా చూసుకోవ‌టం కుదిరేది. ఉద్యోగంలో బాధ్యత‌లు పెరిగి, సెల‌వులు త‌గ్గి, వ‌య‌స్సు మీద‌కు రావ‌టం మొద‌లెట్టాక‌.. ఊరికి వెళ్లటానికి వీలు లేకుండా పోయేది. స‌రిగ్గా అప్పుడే ఊరి నుంచి సాయి ఊడి ప‌డ్డాడు. సినిమా టిక్ గా ఇనిస్పిరేష‌న్ క‌థ‌లు చెబితే బాగోదు కాబ‌ట్టి తాను కూడా జ‌ర్నలిస్టు ఉద్యోగం మీద మోజుతో న‌గ‌రానికి రావ‌టం, ఉప సంపాద‌కుడిగా జీవితాన్ని ప్రారంభించ‌టం చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు తాను .. మా అంద‌రికీ ఆత్మీయుడు. ఊరికి వెళ్లి అక్కడ విశేషాల్నీ క‌వ‌ర్‌చేసి న‌గ‌రానికి వ‌స్తాడు. ఆ త‌ర్వాత మాకు అక్కడ విశేషాలు పూస‌గుచ్చిన‌ట్లు చెబుతాడు. అంతేనా.. వాళ్ల అమ్మ గారు పాల‌కోవా, సున్నుండ‌లు వంటివి తోడుగా పంపిస్తారు కాబ‌ట్టి మ‌న‌కు వాటా ద‌క్కుతుంది. అయితే, ఇందుకోసం మా ఏర్పాట్లు మాకు ఉన్నాయి. న‌గ‌రం నిద్ర పోయాకే జ‌ర్నలిస్టులు ఇంటి ముఖం ప‌ట్టాల‌న్న రూల్ ప్రకారం రాత్రి కూడా ప‌ది దాటాకే ఇల్లు చేరా. కొద్ది సేప‌టికే మా సాయి కూడా వ‌చ్చేశాడు. అప్పటి నుంచి మా దృశ్య మాలిక మా ఊరికి వెళ్లి పోయింది.
ఎంత చెప్పుకొన్నా త‌ర‌గ‌ని క‌బుర్లు.. ప‌ట్టుమ‌ని ప‌ది వీధులు లేక‌పోవ‌చ్చు గాక‌, స‌రైన బ‌స్ సౌక‌ర్యం ఉండ‌క పోవ‌చ్చు గాక‌, ప‌క్క ఊరి పోస్టాఫీసు, అక్కడి హైస్కూలే మాకు గ‌తి కావ‌చ్చు గాక‌.. అంత మాత్రాన మా ఊరిలో విశేషాలు త‌క్కువ అనుకోవ‌ద్దు సుమా.. అంద‌రికీ అంద‌రం బంధువుల‌మే. అందుకే కుల మ‌తాలు ప‌క్కన పెట్టేసి చుట్టరికాల‌తో పిలుచుకోవ‌టం అల‌వాటు. రాత్రంతా మా ఊరి విశేషాల‌తో కాల‌క్షేపం చేశాక‌, సాయి వాళ్ల అమ్మగారు ఇచ్చిన స్వీట్స్ ఖాళీ చేశాక నిద్ర ప‌ట్టింది. అంద‌మైన రాత్రి అల‌వోక‌గా క‌రిగిపోయాక ఆదివారం వ‌చ్చేసింది. ఇత‌ర ర‌కాల ఉద్యోగులు హాయిగా ఇళ్ల ద‌గ్గర కాల‌క్షేపం చేస్తున్న వేళ‌.. జ‌ర్నలిస్టు ఉద్యోగాన్ని త‌ల‌చుకొంటూ ఆఫీసు ముఖం ప‌ట్టాను.

Saturday, August 25, 2012

చిన్న ప‌ల్లెటూరు లో ఆటోగ్రాఫ్‌..స్వీట్ మెమ‌రీస్‌..!

హై స్కూల్ లో ఏడో త‌ర‌గతి పూర్తి చేసుకొని ఎనిమ‌దో త‌ర‌గ‌తి లోకి అడుగు పెట్టాం. ఏడో త‌ర‌గ‌తి అప్పర్ ప్రైమ‌రీ స్కూల్ లో వెల‌గ‌బెట్టాక‌, హైస్కూల్ కి పొరుగు ఊరికి వెళ‌తాం అన్న మాట‌. అప్పటినుంచి హైస్కూల్ విద్యార్థుల స్థాయి వ‌చ్చేస్తుంది. పైగా కొత్త ఊరు, కొత్త ఫ్రెండ్స్ హ‌డావుడి మొద‌లైపోతుంది.
రెండు నెల‌లు గ‌డిచాక ఒక వార్త ఫ్లాష్ అయింది. అదేమిటంటే, మా బ్యాచ్ లోని ఒక అమ్మాయి ర‌జ‌స్వల అయింద‌ని తెలిసింది. ప‌ల్లెటూరు లో దీనికి కూడా హ‌డావుడి ఉంటుంది. బంధు మిత్రుల్ని పిలిచి భోజ‌నాల కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి నిజాయితీ గా ఫ్రెండ్స్ అంద‌రికీ క‌బురు పంపించేసింది. కొద్ది రోజుల‌కే మేం అంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అందునా ఈ అమ్మాయి అంద‌రితోటి చ‌క్కగా క‌లిసిపోయి సంద‌డిగా ఉండేది. పైగా హైస్కూల్ లో చేరిన కొత్త లో వ‌చ్చిన ఫంక్షన్ అన్న మాట‌. అందుచేత త‌లో కొంత చందా వేసుకొని ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామ‌నుకొన్నాం. ఏం కొనాలి అనేదానిపై చ‌ర్చలు తీవ్రంగా సాగాయి. ఈ లోగా టౌన్స్ లో ఇటువంటి ఫంక్షన్స్ జ‌రిగిన‌ప్పుడు కేక్ కొని దాన్ని కట్ చేయిస్తార‌ని ఒక క‌బురు అందింది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో అప్పట్లో ఎవ‌రికీ తెలీదు. కానీ, త‌ల‌కు రెండు రూపాయ‌ల చొప్పున చందాలు వ‌సూలు చేశాం. యాభై రూపాయ‌ల పైనే వ‌సూలు అయింది. దీంతో టౌన్ కు సైకిల్ మీద వెళ్లి ఒక కేక్ తెప్పించేశాం.
ఆ రోజు ఆదివారం కావ‌టంతో క్లాస్ లోని వాళ్లం అంతా స్కూల్ ద‌గ్గర పోగు అయ్యాం. నాలుగు ఊళ్లకు అది ఒక‌టే హైస్కూల్ మ‌రి. అందుకే అంద‌రం వ‌చ్చాక వాళ్ల ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ఈ లోగా కేక్ వ‌చ్చేసింది. ఆరాటం ఆగ‌క కేక్ ఒకసారి చూడాల‌నిపించి ఓపెన్ చేయించాం. తీరా చూస్తే.. దానీ మీద క్రీమ్ తో హ్యాపీ బ‌ర్త్ డే అని రాసి ఉంది. ఈ సంద‌ర్భంలో ఈ వాక్యం మ్యాచ్ కాదు క‌దా.. ఎలా అన్న డౌట్ వ‌చ్చింది. దీన్ని ఇంగ్లీస్ లో ఏమంటారో మాకు తెలియ‌దాయే..! చివ‌ర‌కు బ‌ర్త్ అనే పదం తీసేశాం. అంటే హ్యాపీ డే అన్న మాట‌. వెంట‌నే క‌ట్ట క‌ట్టుకొని అక్కడ‌కు చేరాం. మా హ‌డావుడి చూసి ఆ అమ్మాయి పేరంట్స్, బంధువులు భ‌లే న‌వ్వుకొన్నారు. కానీ, అంతా క‌ల్మషం లేని స్నేహితులం క‌దా, పెద్దగా ప‌ట్టించుకోలేదు. అందుకే ఇంటి మ‌ధ్యలో ఈ కేక్ ను అంద‌రికీ పంచేశాం. ఎవ‌రికి ఇది హ్యాపీ డే అన్న విష‌యం ప‌క్కన పెడితే అంతా హ్యాపీగా ఆ ఈవెంట్ ను ఎంజాయ్ చేశాం. త‌ర్వాత హైస్కూల్ చ‌దువు పూర్తవుతూనే ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకొంది. ఇప్పుడు వాళ్ల పిల్లలు ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్నార‌ట‌.

Saturday, August 11, 2012

మా హైస్కూల్ లో అందాల రాక్షసి క‌థ‌..!

గోదావ‌రి జిల్లా లో ఒక మారు మూల గ్రామం మాది. బ‌స్ సౌక‌ర్యం లేదు, పోస్టాఫీసు అంత క‌న్నా లేదు. ఇవ‌న్నీ ద‌ర్జాగా ఉన్న ఒక పెద్ద ఊరి ప‌క్కనే ఒదిగిపోయాం. అందుక‌ని ఆ పెద్ద ఊరి కి ఉన్న సౌక‌ర్యాల‌న్నీ మాకు ఉన్నట్లే. కుగ్రామం కాబ‌ట్టి మా ఊరి బ‌డిలో ఐదో త‌ర‌గ‌తి దాకానే చదువులు. ఆ త‌ర్వాత ప‌క్క ఊరికి వెళ్లి చ‌దువుకోవాల్సిందే. ఆరో త‌ర‌గ‌తి లో చేరాం అంటే నిజంగా పెద్దవాళ్లం అయిపోయిన‌ట్లు అన్న మాట‌. హాఫ్ నిక్కర్ ఎగ‌వేసుకొంటూ ప‌క్క ఊరికి పరిగెత్తటం ఒక ద‌ర్జా. అయితే ఇందులో రెండు శ్రేణులు ఉంటాయి. న‌డిచి వెళ్లి న‌డిచి వచ్చే మామూలు బ్యాచ్ ఒక‌టైతే, త‌ల్లి దండ్రుల్ని కాకా ప‌ట్టి సైకిల్ సంపాదించుకొన్న బ్యాచ్ ఒక‌టి. ఎట్టకేల‌కు సైకిల్ సంపాదించుకొన్నప్పటికీ అంద‌రం క‌లిసే షేర్ చేసుకొనే వాళ్లం. అబ్బాయిల వ‌ర‌కు ఇది స‌రే, అమ్మాయిల‌కు మాత్రం చిక్కు త‌ప్పుదు. అస‌లు పేరంట్స్ ను ఒప్పించి హైస్కూల్ కు వెళ్లటమే ఒక సాహ‌సం. అందుచేత ఆడ పిల్ల లంతా ఒక గుంపుగా చేరి ప‌క్క ఊరికి న‌డ‌క దారి ప‌ట్టే వారు. వాళ్లు పాపం ఉస్సూరు మంటూ సాయంత్రం న‌డిచి ఇంటికి చేరుకొనే వాళ్లు. మేం మాత్రం ద‌ర్జాగా సైకిల్ మీద రివ్వున దూసుకొని వెళ్లే వాళ్లం.
మా బ్యాచ్‌లో ఒక అమ్మాయి ఉండేది. చ‌దువులో చాలా ఫాస్ట్ గా ఉండేది. బుర్ర దించుకొని త‌న పని తాను చేసుకొనే త‌త్వం ఆమెది. కానీ, అన్ని విష‌యాల్లోనూ అబ్బాయిల‌తో పోటీ ప‌డేది. చ‌దువులోనూ, ఆట పాట‌ల్లోనూ యాక్టివ్ గా ఉండేది. స్కూల్ విద్యార్థుల క‌మిటీలో ఆమె మెంబ‌ర్‌. ఏదైనా తేడా వ‌స్తే నేరుగా హెడ్ మాస్టర్ ద‌గ్గర ఫిర్యాదు చేసేది. ఎన్ని చేసినా ఇంటికి వెళ్లాలంటే మాత్రం ఉస్సూరు మంటూ న‌డుచుకొంటూ వెళ్లాల్సిందే. చివ‌ర‌కు ఎట్టకేల‌కు మా బ్యాచ్ ప‌దో త‌ర‌గ‌తి కి చేరుకొంది. అప్పటి దాకా హాప్ నిక్కర్ గాళ్లం అంద‌రం ప్యాంట్ ల బాట ప‌ట్టాం. అటు అమ్మాయిలంతా పొట్టి ప‌రికిణీలు వ‌దిలేసి కండువా, ఓణీ డ్రెస్ లోకి మారిపోయారు.
రెండు రోజులు గ‌డిచాక బాంబు లాంటి వార్త పేలింది. ఇందాక ప్రస్తావ‌న చేసిన అమ్మాయి సైకిల్ తో స్కూల్ కి వ‌చ్చింద‌న్న వార్త అన్ని క్లాసుల‌కు పాకిపోయింది. ఇంకేముంది, అచ్చమైన ప‌ల్లెటూరు బ‌డికి ఒక అమ్మాయి సైకిల్ తో వ‌చ్చేసిందా..! సాయంత్రం అయ్యేస‌రికి అంతా బ‌డి బ‌య‌ట మూగిపోయారు. అంత ధైర్యం ఉన్న అమ్మాయి కూడా ఒక్కసారిగా కంగారు ప‌డిపోయిన ప‌రిస్థితి. ఇంత మంది మ‌ధ్య నుంచి సైకిల్ తో ఇంటికి వెళ్లటం ఎలా. నెమ్మదిగా న‌డిపించుకొంటూ బ‌య‌లు దేరింది. మిగిలిన వారు కూడా ఫాలో..! ఆ నాటి నుంచి ప్రతీరోజూ ఆమె త‌మ్ముడు సైకిల్ న‌డిపించుకొని ఊరి బ‌య‌ట‌కు తెస్తే అక్కడ నుంచి తొక్కుకొంటూ ప‌క్కఊరి స్కూల్ కి వ‌చ్చేసేది. త‌ర్వాత సాయంత్రం ఊరి బ‌య‌టే సైకిల్ త‌మ్ముడికి అప్పగించేసి బుర్ర దించుకొని న‌డ‌క ప‌ట్టేది. వేసవిలో వాళ్ల మావ‌య్య గారి ఊర్లో సైకిల్ నేర్చుకొన్నప్పటికీ, సొంత ఊర్లో సైకిల్ మీద షికారు చేయ‌లేని ప‌రిస్తితి. ఆ త‌ర్వాత కాలంలో ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామ‌లి లైఫ్ లో సెటిల్ అయిపోయార‌నుకోండి. అంద‌రితో చాలా గౌర‌వంగా ఉండే ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఇవాల మా ఊర్లో సైకిల్ తో స్కూల్ కి, బైక్ పై కాలేజీ కి వెళ్లటం చాలా కామ‌న్ మ‌రి..!

Monday, August 6, 2012

వానాకాలం చ‌దువులు..

చిన్నప్పుడు వాన ప‌డుతుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. అప్పుడు నిజంగా మావి వానాకాలం చ‌దువ‌లే. ఎందుకంటే జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల కావ‌టంతో వరండాల్లో, ఇరుకు గ‌దుల్లో స‌ర్దుకోవ‌టం త‌ప్పనిస‌రి. వాన ప‌డితే త‌ప్పనిసరిగా కంటిన్యూ ప్రక‌టించేవారు. అంటే మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యాన్ని ర‌ద్దు చేసి మ‌రో గంట పాఠాలు చెప్పేసి ఇంటికి పంపించేస్తార‌న్న మాట‌. స‌రిగ్గా అక్కడే అస‌లు క‌థ మొద‌లయ్యేది. ఎందుకంటే మేమంతా పొరుగూరి నుంచి వ‌చ్చి చ‌దువుకొనే బ్యాచ్ క‌దా. అందుకే ఉద‌యాన్నే ఇంటి దగ్గర నుంచి క్యారియ‌ర్ తో స‌హా స్కూల్ కి వ‌చ్చే వాళ్లం. కంటిన్యూ చేసి పిల్లల్ని ఇంటికి వెళ్లిపోమ‌ని చెప్పేవారు. కానీ, మేం మాత్రం అక్కడే క్యారేజీలు తినేసి చ‌క్కగా కొద్దిసేపు పుస్తకాలు చదువుకొంటూ అక్కడే ఉండేవాళ్లం. ఈ సీన్ టీచ‌ర్లు ఇళ్లకు బ‌య‌ల్లేరే దాకా మాత్రమే .
ఆ త‌ర్వాత సాయంత్రం దాకా మా ఇష్టం అన్న మాట‌. వాన ప‌డుతూ ఉండే స్కూల్ లోనే వ‌రండాల్లో నే ర‌క ర‌కాల గేమ్స్ తో విజృంభించే వాళ్లం. కాస్త తెరిపి ఇచ్చాక పొలాల మీద‌కు దండు బ‌య‌లు దేరేది. మా హైస్కూల్ ప్రాంతంలో కూర‌గాయ‌లు ఎక్కువ‌గా సాగ‌య్యేవి. ఆ కూర‌గాయ‌ల తోట‌ల్లో ప‌డి ప‌రుగులు తీస్తుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. ఒక సారి ఇలాగే రెచ్చిపోయి అల్లరి చేస్తుంటే మా హెడ్ మాస్టర్ గారికి డౌట్ వ‌చ్చి వెన‌క్కి తిరిగి వ‌చ్చేశారు. జంప్ అయిపోయిన వాళ్లు పారిపోగా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ది మంది దొరికి పోయారు. చింత‌కాయ పచ్చడి ఎలా ఉంటుందో రుచి చూపించి ఆయ‌న ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులు కుదురుగా కుంటూ కుంటూ స్కూల్ కి వెళ్లాం. త‌ర్వాత మళ్లీ క‌థ మామూలే. అస‌లు వాన‌లు ప‌డాలి వాన దేవుడా ఇంటి దగ్గర రైతాంగం కోరుకోవ‌టం ఏమో కానీ, మేం మాత్రం బ‌లంగా కోరుకొనే వాళ్లం.

Saturday, January 7, 2012

కేర‌ళ అందాలు ఇక్కడ క‌నిపిస్తున్నాయే...!

మొన్నీ మ‌ధ్యనే కేర‌ళ వెళ్లి వ‌చ్చాను. కేర‌ళ కు వెళ్లి రావ‌టం కొత్త కాదు కానీ, ఈ సారి అమ్మ తో క‌లిసి కాస్త రిలాక్స్ గా వెళ్లాను. ఆగుతూ, ఆగుతూ స్థిమితంగా ప్రయాణించిన‌ప్పుడు అమ్మ చెప్పిన మాట విని ఆశ్చర్య పోయా. ఎప్పుడు నాకు ఈ విష‌యం తట్ట లేదు. కేర‌ళ అందాలు ఇక్కడే చూడ‌వ‌చ్చు. మ‌న తెలుగు నేల మీద కూడా కేర‌ళ అందాలు ఉన్నాయి క‌దా..! ముందు నేను పెద్దగా ప‌ట్టించుకోలేదు కానీ, ఒక్కో ఏరియా దాటి వెళుతుంటే అమ్మ చెప్పిన మాట అక్షరాలా నిజం అనిపించింది. అప్పటి నుంచి నేను కూడా పోలిక‌లు వెదికితే... అబ్బో, చాలా పోలిక‌లు కనిపించాయి



అమ్మ అన్నట్లుగా కేర‌ళ కు మ‌న కోన‌సీమ కు చాలా పోలిక‌లు ఉన్నాయి. ప‌చ్చని ప్రకృతి అందాలు క‌ళ్లకు క‌ట్టి ప‌డేస్తాయి కేర‌ళ లోనూ, కోన‌సీమ లోనూ వెళ్లే కొద్దీ ఎత్తయిన కొబ్బరి చెట్లు త‌ల‌లు ఊపుతూ స్వాగ‌తం ఇస్తాయి. కొబ్బరి చెట్ల మాటున దోబూచులాడుతూ ఉద‌య భానుడి అందాలు ప‌ల‌క‌రిస్తూ ఉంటాయి. వాలుజ‌డ‌ను త‌ల‌పించే మెలిక‌లు తిరిగిన పంట కాల్వలు, కాల్వలు ఆనుకొని ఉన్న జ‌నావాసాలు అచ్చంగా అమ‌లాపురం నుంచి కాట్రేనికోన ప‌య‌నిస్తున్నట్లే క‌నిపిస్తాయి. వేకువ జామున స‌న్నటి మంచు కురుస్తుండ‌గా, పొగ‌మంచు పొర‌లు క‌ప్పుకొన్న వేళ‌.... లేలేత భానుడి అందాలు రెండు చోట్ల ఒకేలా మురిపించారు. అంద‌మైన ఉద‌యాన్ని ఒడిసి ప‌ట్టాల‌న్నంత ప‌ర‌వ‌శం చాలా కామ‌న్ గా అనిపించింది. పిల్ల కాలువ‌లు, పంట కాల‌వ‌ల్ని విడ‌గొడుతూ లాకులు, వీటి నుంచి ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న నీటి తుంప‌ర‌లు క‌నిపిస్తున్నాయి. వాటి ఒడ్డున పెద్ద వ‌య‌సు వారు కూర్చొని చ‌క్కగా న్యూస్ పేపర్ చ‌దువుకొనే దృశ్యాలు రెండు ప్రాంతాల్లోనూ క‌నిపించాయి.


ముఖ్యమైన పోలిక ఏమిటంటే ఊరు విడి విడిగా క‌నిపించ‌వు. అంటే రోడ్ పొడ‌వునా కాలువ‌లు కొన‌సాగుతూంటే మ‌రో వైపు జనావాసాలు కూడా కొనసాగుతాయి. చిన్న కాల‌నీల మాదిరిగా జ‌నం నివ‌సిస్తుంటారు. పంట పొలాల్లోనే అచ్చంగా ఇళ్లు క‌ట్లుకొని ఉండిపోతారు. ఎక్కడ‌కు వెళ్లినా గుడి, చర్చి, మ‌సీదు అన్ని అక్కడిక‌క్కడే క‌నిపిస్తాయి. వీటిని వేరు చూసి చూడాల్సిన ప‌ని లేదు. అంతేనా, ఊరూరా సినీ హీరోల‌కు పెద్ద ఫ్లెక్సీలు, అభిమాన సంఘాలు త‌ప్పనిస‌రి. ఎటొచ్చి కేర‌ళ లో మ‌ల‌యాళ హీరోలు వెలిగిపోతుంటే, కోన‌సీమ లో తెలుగు హీరోలు ప్రకాశిస్తుంటారు. మ‌రిచా,,, ఇంకో ముఖ్యమైన విష‌యం ఏమిటంటే మ‌ల‌యాళీలు పెద్ద సంఖ్యలో గ‌ల్ప్ వల‌స వెళుతుంటారు. ఇటు, కోన‌సీమ నుంచి పెద్ద సంఖ్యలో గ‌ల్ప్ కు వ‌ల‌స‌లు ఉంటాయి.


మ‌రో అప్ డేట్ ఏమిటంటే ఇంత‌కు ముందు కేవ‌లం కొత్తపేట‌, అమలాపురం వంటి చోట్ల మాత్ర మే కాలేజీలు క‌నిపించేవి. ఇప్పుడు అన్నిచోట్ల ఠీవిగా నుంచొన్న ఇంజ‌నీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ పాత భ‌వ‌నాల రూపంలో కేర‌ళ లోనూ ఉంది. అంతే కాదు, కొబ్బరితోటల మ‌ధ్యన పాక‌లు వేసేసి ప్రభుత్వ పాఠశాల‌ల్ని న‌డిపించ‌టం రెండు చోట్ల కామ‌న్ ట్రెండ్‌. కాల‌వ‌ల్లో ప‌డ‌వ‌ల మీద ప్రయాణిస్తూ కాలేజీల‌కు, స్కూళ్లకు ప‌రిగెత్తే స్టూడెంట్ బ్యాచ్ లు రెండు చోట్ల క‌నిపించాయి.
చెప్పుకొంటూ పోతే, కేర‌ళ‌, కోన‌సీమ‌ల మ‌ధ్య చాలానే పోలిక‌లు క‌నిపించాయి. అందుకే అమ్మకు కేర‌ళ లో కూడా కోన‌సీమ అందాలే క‌నిపించాయి. ఆమెకు చిన్నప్పుడు తాను పుట్టి పెరిగిన అయినాపురం గురించి ప‌దే ప‌దే త‌ల‌చుకోవ‌టం, తీసుకెళ్లినందుకు నా జ‌న్మ ధ‌న్యం అనిపించింది.