ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, August 23, 2014

మట్టి చేసే మేలు..

మట్టి అంటే స్వచ్చత కు మారు పేరు అటువంటి మట్టితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకొంటూ వస్తే చాంతాడంత అవుతుంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మాత్రం చెప్పాల్సి వుంది.
త్వరలోనే వినాయక చవితి వస్తోంది. వినాయకుడి పందిళ్లు ఎక్కువగా పెట్టే నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అయితే ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ ఇటువంటి మెటీరియల్స్ తో కాలుష్యం ఎక్కువగా విస్తరిస్తోంది. అందుచేత ఇటువంటి మెటీరియల్స్ ను దూరం పెట్టాలి. లేదంటే ఎంతో భక్తితో పూజించుకొన్న వినాయకుని ప్రతిమ ద్వారా కాలుష్యం విస్తరిస్తుందంటే..అసలు ఆ దేవుడే సహించడు. అందుచేత చక్కగా మట్టితో వినాయకుడి ప్రతిమలు చేయించుకొని ఉపయోగించుకొందాం..పూజలు అందుకొన్న తర్వాత గణ నాధుడ్ని సాగనంపితే ఆయన సంతోషిస్తాడు. మనకు మంచి జరుగుతుంది. అందుకని గణ నాయకుని ప్రతిమలు తీసుకొనేటప్పుడు కాస్తంత జాగ్రత్త తీసుకొంటే మంచిది.

Tuesday, June 10, 2014

పిల్లలు అక్కడకు ఎందుకు వెళతారంటే..

అప్పనపల్లి పేరు గోదావరి జిల్లాల్లో చాలా మందికి తెలిసి ఉంటుంది. బయట ప్రాంతాల వారికి తెలిసే అవకాశం కాస్త తక్కువ. నాకు మాత్రం చిన్నప్పడే తెలుసు. అది కూడా ఈ జూన్‌ నెలలోనే తెలిసింది. ఒక వర్షం కురవని రాత్రి నేను నిద్ర పోయి లేచే సరికి ఇంట్లో అమ్మా, నాన్మ కనిపించలేదు. పనిలో పని మా అక్క కూడా లేదు. మా పక్కింటి అత్త కనిపించింది. తెల్లవారు జామున నాలుగు, నాలుగున్నరకు నాన్న అమ్మ నిద్ర లేచే వారు. అమ్మ ఇంటిని శుభ్రం చేస్తూంటే, నాన్న గారు ఇంటికి కావలసినవన్నీ తెచ్చి పెట్టేవారు. నేను మాత్రం తెల్లవారు జామున 8గంటలకు నిద్ర లేచి అప్పుడే హడావుడిగా రెడీ అయి ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కు పరిగెత్తేవాడిని. అటువంటిది లేచిచూసే సరికి ఇద్దరూ కనిపించ లేదాయే. అప్పుడు మా అత్త చెప్పిన దేమిటంటే.. మా అక్క అప్పుడే ఏడో తరగతి పాస్ అయింది. పాస్‌ అయితే అన్నవరం వస్తానని మొక్కుకొందట. అప్పట్లో ఏడో తరగతి పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ అన్నమాట. అందుకని మొక్కు తీర్చటానికి అంతా కలిసి అన్నవరం వెళ్లారు. నాకు కోపం పెరిగిపోయింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు కొంత అయితే, అక్కను తీసుకొని వెళ్లటం మరికొంత, మరీ ముఖ్యంగా తన మొక్కు తీర్చటానికి వెళ్లటం ఇంకాస్త కొంత కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇక వెంటనే మాస్టర్‌ మైండ్‌ కు పదును పెట్టి స్కెచ్‌ వేశాను.
సాయంత్రం వాళ్లు ఇంటికి వచ్చే సరికి ప్లాన్‌ రెడీ చేశాను. ఇంటికి వచ్చి అన్నవరం ప్రసాదం పెడుతుంటే బాంబు పేల్చాను. అక్క ఏడో తరగతి పాస్‌ అయితే అన్న వరం వస్తానని మొక్కుకొన్నట్లే.. నేను కూడా మొక్కుకొన్నానని చెప్పాను. మూడో తరగతి పాస్‌ అయితే అప్పనపల్లి వస్తానని మొక్కుకొన్నానని చెప్పాను. మూడో తరగతి పాస్‌కు మొక్కు ఎందుకు రా అని ఎంత చెప్పినా పంతం వీడలేదు. అమ్మా, నాన్నగారు మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్లు నచ్చ చెప్పినా వినలేదు. పైగా అన్నవరం అంటే జాతీయ రహదారిమీద ఉంటుంది. ఉదయమే బస్‌ లో వెళ్లి సాయంత్రం వచ్చేశారు. ఇక అప్పనపల్లి అంటే చూసుకో నా సామిరంగా. అప్పనపల్లి అంటే కోనసీమలోని అమలాపురానికి 30 కిలోమీటర్ల దూరంలోని పల్లెటూరు. అక్కడ కొబ్బరితోటలో బాల బాలాజీ స్వామి కొలువై ఉన్నారు. అక్కడకు వెళ్లాలంటే అమలాపురం లో బస్సు దిగి, అక్కడ నుంచి బోడసకుర్రు దాకా ప్రైవేటు వాహనం మాట్లాడుకొని వెళ్లాలి. అక్కడ పడవ ఎక్కి గోదావరి దాటాలి. ఆ తర్వాత అక్కడ వాహనాలు ఉండవు . గుర్రపు బండ్లు మాత్రం ఉండేవి. ఆ గుర్రపుబండి ఎక్కి గుడికి వెళ్లేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడ ఉన్న బాల బాలాజీ స్వామిని దర్శించాక నా మొక్కు తీరింది.అంతకు మించి నా పంతం తీరింది. ఎర్రటి ఎండలోకుటుంబాన్ని అంతలా పరుగులు పెట్టానన్నమాట.
ఇక్కడే ఈ గుడి గురించి మరో మాట చెప్పుకోవాలి. దూర ప్రాంతాల నుంచి అనేక మంది కుటుంబాలతో సహా అప్పనపల్లి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయేది. అక్కడ పల్లెటూర కాబట్టి ఎటువంటి వసతులు ఉండేవి కావు. అందుకని అక్కడ ఒక మోతుబరి రైతు గారు.. .. భక్తులకు ఉచితంగా భోజనం పెట్టించేవారు. అప్పనపల్లి అంటే మద్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందన్న మాట చుట్టుపక్కల ప్రాచుర్యం పొందింది. ఈ సంగతి తెలుసుకొని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌ టీ రామారావు గారు స్వయంగా ఈ గుడిని దర్శించి ఈ భోజన సౌకర్యాన్ని పరిశీలించారట. ఇంత చిన్న ఊరులో జరగుతున్న అన్న ప్రసాదం పంపిణీ.. తిరుపతిలో ఎందుకు జరగకూడదు అన్న ఉద్దేశంతో తిరుమలలో కూడా మొదలు పెట్టారట.ఆ తర్వాత అనేక దేవాలయాల్లో మధ్యాహ్న అన్నదాన పథకానికి ఈ గుడి ఆదర్శంగా నిలిచింది. కొసమెరుపు ఏమిటంటే..ఈ ఏడాది వేసవిలో నేను కుటుంబంతో సహా కోనసీమ వెళ్లాను. మా అమ్మాయి కావ్య ఈ మద్యనే మూడో తరగతిలోకి వచ్చింది. అందుకని మా బంగారు తల్లి మొక్కుకోక పోయినా కానీ అప్పనపల్లి దర్శనం చేయించాను. ఇదండీ నా అప్పనపల్లి ఫ్లాష్ బ్యాక్‌..