ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Monday, July 29, 2013

మా ఊర్లో మ‌హిళ‌లు ఏం చేస్తున్నారంటే... వామ్మో...!


మా ఊరు గురించి ఎంత చెప్పినా త‌నివి తీర‌దు.. ఎంత మాట్లాడినా మ‌న‌సు ఆగ‌దు. ఇది సోత్కర్ష అనుకోకండి సుమీ..! మొన్నటికి మొన్న మా ఊరు వెళ్లిన‌ప్పుడు ఇంకో కొత్త విష‌యం గ‌మ‌నించాను. ఊరిలో మ‌హిళ‌లే మ‌హారాణులుగా వెలిగిపోతున్నారు. గ‌తంలో ఇంటి బాధ్యత మ‌గ వారి చేతిలో ఉంటే ఆడ వారు కేవ‌లం వంట ఇంటికి ప‌రిమితం అయ్యేవారు. మ‌గ‌వారు వ్యవ‌సాయంలో ఉంటే పాడి ప‌శువుల సంగ‌తి ఆడ‌వారు చూసుకొనే వారు. కుటుంబ వ్యవ‌హారాల‌న్నీ మ‌గ‌వారివే. దీంతో ఆయ‌న చెప్పిన‌దానికి ఆమె ఊ కొట్టడ‌మే ప‌ర‌మావ‌ధిగా ఉండేది. మొన్న ఈ ట్రెండ్ కు భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. సెల్ ఫోన్‌లు చేతిలో ధ‌రించిన మ‌హిళ‌లు ప్రతీ ఇంట్లో కనిపించారు. ఇప్పుడు అంతా క‌మ్యూనికేష‌న్ చుట్టు తిరుగుతోంది. బ్యాంక్‌ల‌కు సైతం ఇద్దరు, ముగ్గురు మ‌హిళ‌లు క‌లిసి వెళ్లి ప‌నులు చ‌క్క బెట్టుకొంటున్నారు. డ్వాక్రా గ్రూపుల పుణ్యమా అని ఈ మార్పు వ‌చ్చింద‌ని మా మిత్రులు చెప్పారు. అది క‌ళ్లారా చూశాను. బ్యాంకు మేనేజ‌ర్ ను నేరుగా సంప్రదించి త‌మ ఆర్థిక విష‌యాలు నేరుగా మాట్లాడేస్తున్నారు. ఇందులో కొంద‌రు మా హైస్కూల్ మేట్స్ ఉన్నారు. ఆ మ‌హిళ‌లు ఉత్సాహంగా న‌న్ను ప‌ల‌క‌రించి హైద‌రాబాద్ విష‌యాలు అడిగి తెలుసుకొన్నారు. ప‌నిలో ప‌నిగా మా శ్రీ‌మ‌తిని ప‌ల‌క‌రించి వెళ్లారు.
ఇప్పుడు ఏ ప‌నికైనా దంప‌తులు ఇద్దరూ బైక్ మీద వెళ్లి చ‌క్క బెట్టుకొని రావ‌టాన్ని గ‌మ‌నించాను. అప్పట్లో మా ఊరి మోతుబ‌రి రైతు స్కూట‌ర్ కొనుక్కొన్నారు. కానీ దానీ మీద ఆయ‌న శ్రీ‌మ‌తి కూర్చొనే వారు కాదు. ఊరు చివ‌ర దాకా న‌డిచి వెళ్లి అక్కడ ఆ వాహ‌నం ఎక్కే వారు. ఇంట్లోకి ఎవ‌రైనా వ‌స్తే శ్రీ‌మ‌తి గారు లోప‌ల‌కు ప‌రిగెత్తాల్సిందే. క‌నీసం వారికి ప‌రిచ‌యం చేయ‌టం కూడా ఉండేది కాదు. ఇప్పుడు చ‌క్కగా ఒకే వాహ‌నం మీద ఇద్దరూ టౌన్ కు వెళుతున్నారు. క‌లిసి షాపింగ్ కు వెళ్లి వ‌స్తున్నారు. ఇంటికి కావ‌లిసిన విష‌యాల‌న్నీ జాయింట్ గా ప్లాన్ చేసుకొంటున్నారు. అంత ఎందుకు..పిల్లలు చ‌దివే కాన్వెంట్ ల‌కు పేరంట్స్ మీటింగ్‌ల‌కు మ‌హిళ‌లే వెళుతున్నారు. వామ్మో.. ఇది అద్భుతం సుమీ. ఇది అభినందించ‌ద‌గిన విష‌యం. దీనికి కార‌ణం ఏదైనా కానీ హైస్కూల్ దాకా మా జ‌న‌రేష‌న్ చ‌ద‌వ‌గ‌లిగింది కాబ‌ట్టే ఇది సాధ్యం అయింద‌ని అనుకొంటున్నాను. అంత‌కు ముందు జ‌న‌రేష‌న్ కు ఈ అవకాశం లేదు. చ‌దువుతోటే అభివృద్ధి అని నా న‌మ్మకం. నా శ్రీ‌మ‌తి దీన్ని అంగీక‌రిస్తూనే ఇంకో విష‌యం కూడా జోడించింది. ఇంట్లోకి టెలివిజ‌న్‌, సెల్ ఫోన్ లు వ‌చ్చేశాక క‌మ్యూనికేష‌న్ కూడా ముఖ్యమే అని చెప్పింది. ఇది కూడా వాస్తవ‌మే క‌దా..!

2 comments:

  1. "ఇంట్లోకి టెలివిజ‌న్‌, సెల్ ఫోన్ లు వ‌చ్చేశాక క‌మ్యూనికేష‌న్ కూడా ముఖ్యమే అని చెప్పింది."ఇది తప్పకుండా ఒప్పుకోవాల్సిన నిజం.

    ReplyDelete