ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, July 13, 2013

మా ఊరు వెళ్లి వ‌చ్చా..ఎంతటి మార్పు క‌నిపించిందో..!

రెండు రోజులు శెల‌వు పెట్టి మా ఊరు వెళితే రెండు వారాల ప‌ని బ‌రువు నెత్తిన ప‌డింది. దీన్ని తెముల్చుకొనేందుకు ఇంత స‌మ‌యం ప‌ట్టింది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఈ బ‌రువు బాధ్యత‌లు త‌ప్పవు. దీనిపై బ్లాగు రాయటానికి ఇంత‌టి స‌మ‌యం ప‌ట్టింది. మా ఊరు కి వెళ్లే ముందు ఈ సారి కూడా మ‌రిచిపోకుండా గోదావ‌ర‌మ్మ ను ప‌ల‌కరించాను. రావుల‌పాలెం కు ఇవ‌త‌ర సిద్దాంతం బ్రిడ్జి ఎక్కగానే కారు ఆపుదామ‌నుకొన్నా.. పిల్లలు ప‌డుకొన్నారు. అందుకే రావుల‌పాలెం దాటాక మాత్రం గౌత‌మి గోదావ‌రి మీద ప‌క్కకు తీసి కారు ఆపాను. పిల్లల‌ను లేపి గోదావ‌ర‌మ్మ ను చూపిస్తే ఎంత పొంగిపోయారో. అప్పటికే తెల తెల వారుతోంది. ఆ చిరు చీక‌ట్లో గోదావ‌రి త‌ల్లి అందాల్ని చూస్తే మాట‌లు చాల‌వ‌నిపించింది. పిల్లల చేత డ‌బ్బులు వేయించాను అఫ్ కోర్స్ మా శ్రీ‌మ‌తి న‌వ్వుకొంటూనే చూసింది ఈ దృశ్యాల్ని. హైద‌రాబాద్ అమ్మాయిల‌కు ఇవ‌న్నీ పెద్దగా ప‌ట్టక పోవ‌చ్చు. కొద్ది సేపు అక్కడ ఎంజాయ్ చేశాకే ముందుకు క‌దిలాం. వేకువ జామున మా ఊరికి వెళుతుంటే ఒక్క సారిగా సంద‌డి నెల‌కొంది. ఒక‌ప్పుడు మా ఊరి నుంచి హైస్కూల్ కు వెళితే గొప్ప. అటువంటిది ఇప్పుడు ఉద‌యాన్ని ఊరికి స్కూల్ బస్సులు, కాలేజీ బ‌స్సులు పొలోమ‌ని వ‌చ్చేస్తున్నాయి. వాటిని ఎక్కి మా ఊరి పిల్లలు చ‌దువుల‌కు చ‌క చ‌కా ముందుకు సాగుతున్నారు. ఇది చూసి భ‌లే ముచ్చట వేసింది. నేను యూనివ‌ర్శిటీ లో చ‌దువుకొనేట‌ప్పుడు మా ఊరి విద్యార్థుల చ‌దువుల గురించి బాగా ఆలోచించే వాడిని. అప్పట్లో ఒక సారి వేకువ జామున రైలు కి వెళ్లాలంటే మా ఊరాయ‌న సైకిల్ మీద న‌న్ను స్టేష‌న్ కు దింపాడు. ఆయ‌న అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చ‌దువుతున్నాడు. చక్కగా కాలేజ్ బ‌స్స్ లో వెల్లిపోతున్నాడు. ఆ సంగ‌తి ఆయ‌న గుర్తు చేశారు. ఊర్లోకి వెళ్లి కాసేపు సేద తీరాక చుట్టు ప‌క్కల వారి ప‌ల‌క‌రింపులు మొద‌ల‌య్యాయి. మా ఊర్లో అనేక కుల‌స్తులు ఉన్నారు. కానీ అంతా మావ‌య్య, బాబాయ్‌, పెద నాన్న అని పిలుచుకొంటాం. ఎవ‌రికి ఈ పిలుపుల మీద ప‌ట్టింపు ఉండ‌దు. అదంతా ఒక ఆత్మీయ‌త‌.
ఆ రోజు మా ఊరి శివాల‌యంలో క‌ళ్యాణం. ఈ క‌ళ్యాణం చేయించుకొనేందుకు మేం వెళ్లాం. అందుకే సాయంత్రం దేవుడి ఊరేగింపు జ‌రుగుతుంటే కూడా వెళ్లా. ఊరంతా ఒక‌టే ప‌ల‌క‌రింపులు. అప్పటి పిల్లలంతా పెద్దలై పోయారు. పెద్ద వారంతా వృద్దులై పోయారు. మా అబ్బాయి అయితే బోలెడు ఆశ్చర్య పోయాడు. మీకు ఇంత స‌ర్కిల్ ఉందా అంటే ప్రశ్నలే. వాడికి ఇదంతా కాస్త కొత్త. రాత్రి మాత్రం దేవుడి క‌ళ్యాణం చేయించాం. ఎంత‌టి మ‌ధుర‌మైన అనుభూతో. మా ఊరంటేనే నేను ప‌డి చ‌స్తాను. అటువంటి చోట దేవుడి కళ్యాణం చేయించుకొన్న అనుభూతిని ఒడిసి ప‌ట్టి తెచ్చుకొన్నాను. దేవుడి సేవ‌లో త‌రించే ఒక మ‌ధుర జ్ఞాప‌కం. అందుకే ఇప్పటికి ఆ జ్ఞాప‌కాన్ని దాచుకొన్నాను. మ‌ర్నాటి విశేషాలు మ‌ళ్లా చెబుతాను.

1 comment:

  1. మీ బ్లాగుని పూదండ తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete