ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Sunday, June 16, 2013

నాలుగు రోజుల్లో మా ఊరు వెళుతున్నా. అస‌లు ఆ ఫీలింగే అద‌ర‌గొడుతోంది..!

సొంత ఊరంటే ఎవ‌రికైనా కాస్తంత ప్రేమ‌. గోదావ‌రి జిల్లా బిడ్డల‌కు మాత్రం కాస్తంత ఎక్కువ ప్రేమ అన్న మాట‌. అటువంటి గ్రూపులో మ‌నం టాప్ ర్యాంక్‌. తూర్పు గోదావ‌రి జిల్లాలో పోస్టాఫీసు కూడా లేని అనేక ప‌ల్లెటూరుల్లో మాది కూడా ఒక‌టి. ప‌క్క ఊర్లో బ‌స్సు దిగి మా ఊర్లోకి న‌డుచుకొంటూ వెళ్లిపోవ‌చ్చు. ఊరి న‌డిబొడ్డు నుంచి ప‌ల‌క‌రింపులు మొద‌లువుతాయి. పావు గంట ప‌ట్టే న‌డ‌క్కి గంటం పావు ఈజీగా ప‌ట్టేస్తుంది. క‌నిపించిన ప్రతీవాళ్లు ముఖ‌మంతా న‌వ్వు చేసుకొని మ‌న‌స్ఫూర్తిగా ప‌ల‌క‌రిస్తూ ఉంటే ఆ ఆప్యాయ‌త‌ను దేంతో కొల‌వ‌గ‌లుగుతాం. అందుకే ఊరిలోకి వెళ్లిన కొద్ది సేప‌టికే వాతావ‌ర‌ణం మారిపోతుంది. మ‌ట్టి వాస‌న ప‌ల‌క‌రించి పుల‌క‌రింప చేస్తు ఉంటుంది. ఊర్లోకి వెళ్లాలంటే ముందుగానే గోదావ‌రి దాటాలి క‌దా.. రైలులో ఊరెళితే మాత్రం కొవ్వూరు స్టేష‌న్ దాట‌గానే గేటు లోకి వెళ్లిపోతాను. గోదావ‌రి దాటుతుంటే కిటికీ లోంచి చూడ‌టం క‌న్నా గేటు నుంచి చూడ‌టం భ‌లే గ‌మ్మతుగా ఉంటుంది. అందుకే న‌ది ని అక్కడ నుంచి చూడ‌టం అల‌వాటు. యూనివ‌ర్శీటి లో ఉన్నప్పటి నుంచి మొద‌లైన ఈ అల‌వాటు ఇప్పటికీ వ‌ద‌ల్లేదు. ఈ మ‌ధ్యన కారులో ప్రయాణం పెట్టుకొంటే రావుల‌పాలెం వంతెన మీద మ‌ధ్య లోకి వెళ్లాక ప‌క్కకు తీసి ఆపుతుంటాను. అప్పుడు న‌దిలోకి నాణేలు వేసేందుకు మా పిల్లలు కూడా పోటీ ప‌డ‌తారు. న‌దిలోకి డ‌బ్బు వేయ‌టం ఏంటి చాద‌స్తం అని న‌వ్వుకోవ‌చ్చు గాక గోదావ‌రి మీద ఇదంతా కామ‌న్ మరి. కొన్ని ఫీలింగ్స్ కు లాజిక్కులు ఉండ‌వు మ‌రి. ఊరికి వెళ్లిన‌ప్పుడు మాత్రం మొద‌ట ప‌రిగెత్తేది గుడిలోకే. ఎందుకంటే మా ఇంటి ప‌క్క నే ఠీవిగా వెల‌సిన శివాలయం నాజీవితంతో ముడిప‌డి ఉంది. చిన్నప్పటి నుంచి ఆ గుడిలోనే నా ఆట‌పాట‌లు సాగాయి. అందుకే ఎప్పుడు అక్కడ‌కు వెళ్లినా గుడికి వెళ్లి ద‌ర్శనం చేసుకోవ‌టం మాత్రం మాన‌ను. అంతే కాదు.,, ఎంత పెద్ద క్షేత్రంలోకి వెళ్లినా ఒక్క సారైనా మా ఊరి గుడిని గుర్తుచేసుకొంటాను. అక్కడ స్వామిని మ‌న‌స్సులో త‌ల‌చుకొంటాను. అంతే కాదు, ఆఫీసులో ప‌ని మొద‌లు పెట్టేట‌ప్పుడు కూడా ఒక్క సారి క‌ళ్లు మూసుకొని మా ఊరి స్వామిని ధ్యానించుకొంటా. అది కూడా లాజిక్కు కు అంద‌ని బ‌ల‌మైన సెంటిమెంట్. ఈ సారి కూడా కొన్ని జ్ఞాప‌కాల దొంత‌ర‌ను మోసుకొంటూ మా ఊరికి వెళుతున్నా. కొన్ని అనుభూతుల్ని ప‌దిల ప‌ర‌చుకొని వెన‌క్కి వ‌ద్దామ‌నుకొంటున్నా...!

1 comment:

  1. క్షేమంగా వెళ్లి లాభం గా తిరిగి రండి ,మోయలేనన్ని మధురానుభూతులతో .అందరికీ తలా కాసినీ పంచాలి కదా మరి .

    ReplyDelete