ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, May 2, 2015

ఆ రాణి గారి భ‌వంతి కట్టించిన విప్ల‌వ వీరుడు ఎవ‌రో తెలుసా...!

రాణులు, రాజులు, రాజ్యాలు పోయాయి. కానీ వారు మిగిల్చిన గురుతులు మాత్రం మిగిలాయి. రాజులు అంటే కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం కోట‌లు, అంతఃపురాల్లో తిరుగాడిన వారు గుర్తుకొని వ‌స్తారు. కానీ ఈ క‌థ‌నం ఈ శ‌తాబ్ద‌పు కాలం నాటిదే, ఇంకా చెప్పాలంటే , ముప్పై, న‌ల‌భై సంవ‌త్స‌రాల కితం నాటిది. తూర్పు గోదావ‌రి జిల్లా లో ఏజ‌న్సీ ఏరియా బాగావిస్త‌రించి క‌నిపిస్తుంది. మారేడుమిల్లి, రంప‌చోడ‌వ‌రం, అడ్డ‌తీగ‌ల‌, గోక‌వ‌రం, ఏలేశ్వ‌రం, రాజ‌వొమ్మంగి వంటి ప్రాంతాల్లో ఈ అట‌వీ ప్రాంతం విస్త‌రించింది. దీనికి అంత‌టికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌ట్ట‌ణ ప్రాంతంగా పెద్దాపురం ను చెబుతారు. ఇటు, మెట్ట సీమ అయిన చాగ‌ల్నాడు కి కూడ ఇదికేంద్ర బిందువు. అందుచేత ఇక్క‌డ కాలేజీ ఏర్పాటు చేస్తే పిల్ల‌ల చ‌దువుల‌కు బాగుంటుంద‌ని ధ‌ర్మాత్ములైన పెద్ద‌లు సంక‌ల్పించారు. దీంతో అప్ప‌టి మ‌హారాజ కుటుంబాల్ని సంప్ర‌దించ‌టం జ‌రిగింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్దికి, దీన జ‌నోద్ధ‌ర‌ణ‌కు వాత్స‌వాయి రాజ కుటుంబాలు విరివిగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టాయి. అందులో భాగంగా కాలేజీ ఏర్పాటుకి ఈ కుటుంబం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కాలేజీ ఏర్పాటు చేయించారు. రాజా వాత్స‌వాయి బుచ్చి సీతాయ‌మ్మ జ‌గ‌ప‌తి బ‌హ‌దూర్ మ‌హారాణి క‌ళాశాల పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సింపుల్ గా మహారాణి కాలేజీ అని పిలుచుకొంటారు. అంతే కాదు, దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే పిల్ల‌ల‌కు భోజ‌నం పెట్టించాల‌న్న ఉద్దేశంతో మ‌హారాణి స‌త్రం ఏర్పాటుచేశారు. అంటే ఈ కాలేజీలో సీటు తెచ్చుకొంటే రెండు పూట‌లా స‌త్రంలో భోజ‌నం ఉచితంగా పెడ‌తారు. ఇది మామూలు విష‌యం కాదు. కొన్ని వేల‌కుటుంబాల్లోని పేద విద్యార్థులు ఈ ర‌కంగా చ‌దువుకొని జీవితంలో స్థిర ప‌డ్డారు. కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘ‌న‌త ఆ మ‌హారాణికుటుంబానికి చెందుతుంది.
స‌రే, పెద్దాపురంలో కాలేజీ పెట్టార‌న్న సంగ‌తి ఆ నోట‌, ఈ నోట ఏజ‌న్సీ అంతా తెలిసిపోయింది. రౌతుల‌పూడికి ద‌గ్గ‌రలో ఒక గ్రామం నుంచి ఒక విద్యార్థి వ‌చ్చి కాలేజీలో చేరాడు. మొద‌ట నుంచి విప్ల‌వ భావాలు, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్న ఆ విద్యార్థి కాలేజీ స్టూడెంట్ యూనియ‌న్ నాయ‌కుడు అయ్యాడు. కాలేజీ ఉంది కానీ స‌రైన భ‌వ‌నాలు లేక‌పోటంతో అనేక కార్య‌క్ర‌మాలు చేపట్టి, పెద్ద‌లు మ‌హారాణికుటుంబ స‌భ్యుల సాయంతో భ‌వ‌నాలు కట్టించారు. ఈ విధంగా త‌ర్వాత త‌రం వారికి మంచిభ‌వ‌నాల్లో చ‌దువుకొనే యోగం ప‌ట్టింది. ఇంత‌కీ ఈ విద్యార్థి నాయ‌కుడు త‌ర్వాత కాలంలో చెన్నై వెళ్లిపోయి సినిమాల్లో చేరాడు. న‌టుడుగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఒక వెలుగు వెలిగాడు. ఆయ‌న ఎవ‌రో కాదు, విప్ల‌వ సీనిమాల హీరో ఆర్‌. నారాయ‌ణ మూర్తి. ఈ విష‌యాల‌న్నీ ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. మొన్న చాలాకాలం త‌ర్వాత ఆయ‌న్ని క‌లిస్తే ఈ విష‌యాల‌న్నీ నెమ‌రు వేసుకొన్నారు. అదే కాలేజీలో చ‌దువుకొని జీవితంలో స్థిర ప‌డిన వ్య‌క్తిగా మహారాణికుటుంబాన్ని, నారాయ‌ణ మూర్తి గారు వంటి వ‌దాన్యుల్ని గుర్తు చేసుకొంటాను.

No comments:

Post a Comment