ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Monday, August 6, 2012

వానాకాలం చ‌దువులు..

చిన్నప్పుడు వాన ప‌డుతుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. అప్పుడు నిజంగా మావి వానాకాలం చ‌దువ‌లే. ఎందుకంటే జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల కావ‌టంతో వరండాల్లో, ఇరుకు గ‌దుల్లో స‌ర్దుకోవ‌టం త‌ప్పనిస‌రి. వాన ప‌డితే త‌ప్పనిసరిగా కంటిన్యూ ప్రక‌టించేవారు. అంటే మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యాన్ని ర‌ద్దు చేసి మ‌రో గంట పాఠాలు చెప్పేసి ఇంటికి పంపించేస్తార‌న్న మాట‌. స‌రిగ్గా అక్కడే అస‌లు క‌థ మొద‌లయ్యేది. ఎందుకంటే మేమంతా పొరుగూరి నుంచి వ‌చ్చి చ‌దువుకొనే బ్యాచ్ క‌దా. అందుకే ఉద‌యాన్నే ఇంటి దగ్గర నుంచి క్యారియ‌ర్ తో స‌హా స్కూల్ కి వ‌చ్చే వాళ్లం. కంటిన్యూ చేసి పిల్లల్ని ఇంటికి వెళ్లిపోమ‌ని చెప్పేవారు. కానీ, మేం మాత్రం అక్కడే క్యారేజీలు తినేసి చ‌క్కగా కొద్దిసేపు పుస్తకాలు చదువుకొంటూ అక్కడే ఉండేవాళ్లం. ఈ సీన్ టీచ‌ర్లు ఇళ్లకు బ‌య‌ల్లేరే దాకా మాత్రమే .
ఆ త‌ర్వాత సాయంత్రం దాకా మా ఇష్టం అన్న మాట‌. వాన ప‌డుతూ ఉండే స్కూల్ లోనే వ‌రండాల్లో నే ర‌క ర‌కాల గేమ్స్ తో విజృంభించే వాళ్లం. కాస్త తెరిపి ఇచ్చాక పొలాల మీద‌కు దండు బ‌య‌లు దేరేది. మా హైస్కూల్ ప్రాంతంలో కూర‌గాయ‌లు ఎక్కువ‌గా సాగ‌య్యేవి. ఆ కూర‌గాయ‌ల తోట‌ల్లో ప‌డి ప‌రుగులు తీస్తుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. ఒక సారి ఇలాగే రెచ్చిపోయి అల్లరి చేస్తుంటే మా హెడ్ మాస్టర్ గారికి డౌట్ వ‌చ్చి వెన‌క్కి తిరిగి వ‌చ్చేశారు. జంప్ అయిపోయిన వాళ్లు పారిపోగా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ది మంది దొరికి పోయారు. చింత‌కాయ పచ్చడి ఎలా ఉంటుందో రుచి చూపించి ఆయ‌న ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులు కుదురుగా కుంటూ కుంటూ స్కూల్ కి వెళ్లాం. త‌ర్వాత మళ్లీ క‌థ మామూలే. అస‌లు వాన‌లు ప‌డాలి వాన దేవుడా ఇంటి దగ్గర రైతాంగం కోరుకోవ‌టం ఏమో కానీ, మేం మాత్రం బ‌లంగా కోరుకొనే వాళ్లం.

1 comment: