ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, August 25, 2012

చిన్న ప‌ల్లెటూరు లో ఆటోగ్రాఫ్‌..స్వీట్ మెమ‌రీస్‌..!

హై స్కూల్ లో ఏడో త‌ర‌గతి పూర్తి చేసుకొని ఎనిమ‌దో త‌ర‌గ‌తి లోకి అడుగు పెట్టాం. ఏడో త‌ర‌గ‌తి అప్పర్ ప్రైమ‌రీ స్కూల్ లో వెల‌గ‌బెట్టాక‌, హైస్కూల్ కి పొరుగు ఊరికి వెళ‌తాం అన్న మాట‌. అప్పటినుంచి హైస్కూల్ విద్యార్థుల స్థాయి వ‌చ్చేస్తుంది. పైగా కొత్త ఊరు, కొత్త ఫ్రెండ్స్ హ‌డావుడి మొద‌లైపోతుంది.
రెండు నెల‌లు గ‌డిచాక ఒక వార్త ఫ్లాష్ అయింది. అదేమిటంటే, మా బ్యాచ్ లోని ఒక అమ్మాయి ర‌జ‌స్వల అయింద‌ని తెలిసింది. ప‌ల్లెటూరు లో దీనికి కూడా హ‌డావుడి ఉంటుంది. బంధు మిత్రుల్ని పిలిచి భోజ‌నాల కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి నిజాయితీ గా ఫ్రెండ్స్ అంద‌రికీ క‌బురు పంపించేసింది. కొద్ది రోజుల‌కే మేం అంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అందునా ఈ అమ్మాయి అంద‌రితోటి చ‌క్కగా క‌లిసిపోయి సంద‌డిగా ఉండేది. పైగా హైస్కూల్ లో చేరిన కొత్త లో వ‌చ్చిన ఫంక్షన్ అన్న మాట‌. అందుచేత త‌లో కొంత చందా వేసుకొని ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామ‌నుకొన్నాం. ఏం కొనాలి అనేదానిపై చ‌ర్చలు తీవ్రంగా సాగాయి. ఈ లోగా టౌన్స్ లో ఇటువంటి ఫంక్షన్స్ జ‌రిగిన‌ప్పుడు కేక్ కొని దాన్ని కట్ చేయిస్తార‌ని ఒక క‌బురు అందింది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో అప్పట్లో ఎవ‌రికీ తెలీదు. కానీ, త‌ల‌కు రెండు రూపాయ‌ల చొప్పున చందాలు వ‌సూలు చేశాం. యాభై రూపాయ‌ల పైనే వ‌సూలు అయింది. దీంతో టౌన్ కు సైకిల్ మీద వెళ్లి ఒక కేక్ తెప్పించేశాం.
ఆ రోజు ఆదివారం కావ‌టంతో క్లాస్ లోని వాళ్లం అంతా స్కూల్ ద‌గ్గర పోగు అయ్యాం. నాలుగు ఊళ్లకు అది ఒక‌టే హైస్కూల్ మ‌రి. అందుకే అంద‌రం వ‌చ్చాక వాళ్ల ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ఈ లోగా కేక్ వ‌చ్చేసింది. ఆరాటం ఆగ‌క కేక్ ఒకసారి చూడాల‌నిపించి ఓపెన్ చేయించాం. తీరా చూస్తే.. దానీ మీద క్రీమ్ తో హ్యాపీ బ‌ర్త్ డే అని రాసి ఉంది. ఈ సంద‌ర్భంలో ఈ వాక్యం మ్యాచ్ కాదు క‌దా.. ఎలా అన్న డౌట్ వ‌చ్చింది. దీన్ని ఇంగ్లీస్ లో ఏమంటారో మాకు తెలియ‌దాయే..! చివ‌ర‌కు బ‌ర్త్ అనే పదం తీసేశాం. అంటే హ్యాపీ డే అన్న మాట‌. వెంట‌నే క‌ట్ట క‌ట్టుకొని అక్కడ‌కు చేరాం. మా హ‌డావుడి చూసి ఆ అమ్మాయి పేరంట్స్, బంధువులు భ‌లే న‌వ్వుకొన్నారు. కానీ, అంతా క‌ల్మషం లేని స్నేహితులం క‌దా, పెద్దగా ప‌ట్టించుకోలేదు. అందుకే ఇంటి మ‌ధ్యలో ఈ కేక్ ను అంద‌రికీ పంచేశాం. ఎవ‌రికి ఇది హ్యాపీ డే అన్న విష‌యం ప‌క్కన పెడితే అంతా హ్యాపీగా ఆ ఈవెంట్ ను ఎంజాయ్ చేశాం. త‌ర్వాత హైస్కూల్ చ‌దువు పూర్తవుతూనే ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకొంది. ఇప్పుడు వాళ్ల పిల్లలు ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్నార‌ట‌.

Saturday, August 11, 2012

మా హైస్కూల్ లో అందాల రాక్షసి క‌థ‌..!

గోదావ‌రి జిల్లా లో ఒక మారు మూల గ్రామం మాది. బ‌స్ సౌక‌ర్యం లేదు, పోస్టాఫీసు అంత క‌న్నా లేదు. ఇవ‌న్నీ ద‌ర్జాగా ఉన్న ఒక పెద్ద ఊరి ప‌క్కనే ఒదిగిపోయాం. అందుక‌ని ఆ పెద్ద ఊరి కి ఉన్న సౌక‌ర్యాల‌న్నీ మాకు ఉన్నట్లే. కుగ్రామం కాబ‌ట్టి మా ఊరి బ‌డిలో ఐదో త‌ర‌గ‌తి దాకానే చదువులు. ఆ త‌ర్వాత ప‌క్క ఊరికి వెళ్లి చ‌దువుకోవాల్సిందే. ఆరో త‌ర‌గ‌తి లో చేరాం అంటే నిజంగా పెద్దవాళ్లం అయిపోయిన‌ట్లు అన్న మాట‌. హాఫ్ నిక్కర్ ఎగ‌వేసుకొంటూ ప‌క్క ఊరికి పరిగెత్తటం ఒక ద‌ర్జా. అయితే ఇందులో రెండు శ్రేణులు ఉంటాయి. న‌డిచి వెళ్లి న‌డిచి వచ్చే మామూలు బ్యాచ్ ఒక‌టైతే, త‌ల్లి దండ్రుల్ని కాకా ప‌ట్టి సైకిల్ సంపాదించుకొన్న బ్యాచ్ ఒక‌టి. ఎట్టకేల‌కు సైకిల్ సంపాదించుకొన్నప్పటికీ అంద‌రం క‌లిసే షేర్ చేసుకొనే వాళ్లం. అబ్బాయిల వ‌ర‌కు ఇది స‌రే, అమ్మాయిల‌కు మాత్రం చిక్కు త‌ప్పుదు. అస‌లు పేరంట్స్ ను ఒప్పించి హైస్కూల్ కు వెళ్లటమే ఒక సాహ‌సం. అందుచేత ఆడ పిల్ల లంతా ఒక గుంపుగా చేరి ప‌క్క ఊరికి న‌డ‌క దారి ప‌ట్టే వారు. వాళ్లు పాపం ఉస్సూరు మంటూ సాయంత్రం న‌డిచి ఇంటికి చేరుకొనే వాళ్లు. మేం మాత్రం ద‌ర్జాగా సైకిల్ మీద రివ్వున దూసుకొని వెళ్లే వాళ్లం.
మా బ్యాచ్‌లో ఒక అమ్మాయి ఉండేది. చ‌దువులో చాలా ఫాస్ట్ గా ఉండేది. బుర్ర దించుకొని త‌న పని తాను చేసుకొనే త‌త్వం ఆమెది. కానీ, అన్ని విష‌యాల్లోనూ అబ్బాయిల‌తో పోటీ ప‌డేది. చ‌దువులోనూ, ఆట పాట‌ల్లోనూ యాక్టివ్ గా ఉండేది. స్కూల్ విద్యార్థుల క‌మిటీలో ఆమె మెంబ‌ర్‌. ఏదైనా తేడా వ‌స్తే నేరుగా హెడ్ మాస్టర్ ద‌గ్గర ఫిర్యాదు చేసేది. ఎన్ని చేసినా ఇంటికి వెళ్లాలంటే మాత్రం ఉస్సూరు మంటూ న‌డుచుకొంటూ వెళ్లాల్సిందే. చివ‌ర‌కు ఎట్టకేల‌కు మా బ్యాచ్ ప‌దో త‌ర‌గ‌తి కి చేరుకొంది. అప్పటి దాకా హాప్ నిక్కర్ గాళ్లం అంద‌రం ప్యాంట్ ల బాట ప‌ట్టాం. అటు అమ్మాయిలంతా పొట్టి ప‌రికిణీలు వ‌దిలేసి కండువా, ఓణీ డ్రెస్ లోకి మారిపోయారు.
రెండు రోజులు గ‌డిచాక బాంబు లాంటి వార్త పేలింది. ఇందాక ప్రస్తావ‌న చేసిన అమ్మాయి సైకిల్ తో స్కూల్ కి వ‌చ్చింద‌న్న వార్త అన్ని క్లాసుల‌కు పాకిపోయింది. ఇంకేముంది, అచ్చమైన ప‌ల్లెటూరు బ‌డికి ఒక అమ్మాయి సైకిల్ తో వ‌చ్చేసిందా..! సాయంత్రం అయ్యేస‌రికి అంతా బ‌డి బ‌య‌ట మూగిపోయారు. అంత ధైర్యం ఉన్న అమ్మాయి కూడా ఒక్కసారిగా కంగారు ప‌డిపోయిన ప‌రిస్థితి. ఇంత మంది మ‌ధ్య నుంచి సైకిల్ తో ఇంటికి వెళ్లటం ఎలా. నెమ్మదిగా న‌డిపించుకొంటూ బ‌య‌లు దేరింది. మిగిలిన వారు కూడా ఫాలో..! ఆ నాటి నుంచి ప్రతీరోజూ ఆమె త‌మ్ముడు సైకిల్ న‌డిపించుకొని ఊరి బ‌య‌ట‌కు తెస్తే అక్కడ నుంచి తొక్కుకొంటూ ప‌క్కఊరి స్కూల్ కి వ‌చ్చేసేది. త‌ర్వాత సాయంత్రం ఊరి బ‌య‌టే సైకిల్ త‌మ్ముడికి అప్పగించేసి బుర్ర దించుకొని న‌డ‌క ప‌ట్టేది. వేసవిలో వాళ్ల మావ‌య్య గారి ఊర్లో సైకిల్ నేర్చుకొన్నప్పటికీ, సొంత ఊర్లో సైకిల్ మీద షికారు చేయ‌లేని ప‌రిస్తితి. ఆ త‌ర్వాత కాలంలో ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామ‌లి లైఫ్ లో సెటిల్ అయిపోయార‌నుకోండి. అంద‌రితో చాలా గౌర‌వంగా ఉండే ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఇవాల మా ఊర్లో సైకిల్ తో స్కూల్ కి, బైక్ పై కాలేజీ కి వెళ్లటం చాలా కామ‌న్ మ‌రి..!

Monday, August 6, 2012

వానాకాలం చ‌దువులు..

చిన్నప్పుడు వాన ప‌డుతుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. అప్పుడు నిజంగా మావి వానాకాలం చ‌దువ‌లే. ఎందుకంటే జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల కావ‌టంతో వరండాల్లో, ఇరుకు గ‌దుల్లో స‌ర్దుకోవ‌టం త‌ప్పనిస‌రి. వాన ప‌డితే త‌ప్పనిసరిగా కంటిన్యూ ప్రక‌టించేవారు. అంటే మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యాన్ని ర‌ద్దు చేసి మ‌రో గంట పాఠాలు చెప్పేసి ఇంటికి పంపించేస్తార‌న్న మాట‌. స‌రిగ్గా అక్కడే అస‌లు క‌థ మొద‌లయ్యేది. ఎందుకంటే మేమంతా పొరుగూరి నుంచి వ‌చ్చి చ‌దువుకొనే బ్యాచ్ క‌దా. అందుకే ఉద‌యాన్నే ఇంటి దగ్గర నుంచి క్యారియ‌ర్ తో స‌హా స్కూల్ కి వ‌చ్చే వాళ్లం. కంటిన్యూ చేసి పిల్లల్ని ఇంటికి వెళ్లిపోమ‌ని చెప్పేవారు. కానీ, మేం మాత్రం అక్కడే క్యారేజీలు తినేసి చ‌క్కగా కొద్దిసేపు పుస్తకాలు చదువుకొంటూ అక్కడే ఉండేవాళ్లం. ఈ సీన్ టీచ‌ర్లు ఇళ్లకు బ‌య‌ల్లేరే దాకా మాత్రమే .
ఆ త‌ర్వాత సాయంత్రం దాకా మా ఇష్టం అన్న మాట‌. వాన ప‌డుతూ ఉండే స్కూల్ లోనే వ‌రండాల్లో నే ర‌క ర‌కాల గేమ్స్ తో విజృంభించే వాళ్లం. కాస్త తెరిపి ఇచ్చాక పొలాల మీద‌కు దండు బ‌య‌లు దేరేది. మా హైస్కూల్ ప్రాంతంలో కూర‌గాయ‌లు ఎక్కువ‌గా సాగ‌య్యేవి. ఆ కూర‌గాయ‌ల తోట‌ల్లో ప‌డి ప‌రుగులు తీస్తుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. ఒక సారి ఇలాగే రెచ్చిపోయి అల్లరి చేస్తుంటే మా హెడ్ మాస్టర్ గారికి డౌట్ వ‌చ్చి వెన‌క్కి తిరిగి వ‌చ్చేశారు. జంప్ అయిపోయిన వాళ్లు పారిపోగా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ది మంది దొరికి పోయారు. చింత‌కాయ పచ్చడి ఎలా ఉంటుందో రుచి చూపించి ఆయ‌న ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులు కుదురుగా కుంటూ కుంటూ స్కూల్ కి వెళ్లాం. త‌ర్వాత మళ్లీ క‌థ మామూలే. అస‌లు వాన‌లు ప‌డాలి వాన దేవుడా ఇంటి దగ్గర రైతాంగం కోరుకోవ‌టం ఏమో కానీ, మేం మాత్రం బ‌లంగా కోరుకొనే వాళ్లం.

Saturday, January 7, 2012

కేర‌ళ అందాలు ఇక్కడ క‌నిపిస్తున్నాయే...!

మొన్నీ మ‌ధ్యనే కేర‌ళ వెళ్లి వ‌చ్చాను. కేర‌ళ కు వెళ్లి రావ‌టం కొత్త కాదు కానీ, ఈ సారి అమ్మ తో క‌లిసి కాస్త రిలాక్స్ గా వెళ్లాను. ఆగుతూ, ఆగుతూ స్థిమితంగా ప్రయాణించిన‌ప్పుడు అమ్మ చెప్పిన మాట విని ఆశ్చర్య పోయా. ఎప్పుడు నాకు ఈ విష‌యం తట్ట లేదు. కేర‌ళ అందాలు ఇక్కడే చూడ‌వ‌చ్చు. మ‌న తెలుగు నేల మీద కూడా కేర‌ళ అందాలు ఉన్నాయి క‌దా..! ముందు నేను పెద్దగా ప‌ట్టించుకోలేదు కానీ, ఒక్కో ఏరియా దాటి వెళుతుంటే అమ్మ చెప్పిన మాట అక్షరాలా నిజం అనిపించింది. అప్పటి నుంచి నేను కూడా పోలిక‌లు వెదికితే... అబ్బో, చాలా పోలిక‌లు కనిపించాయి



అమ్మ అన్నట్లుగా కేర‌ళ కు మ‌న కోన‌సీమ కు చాలా పోలిక‌లు ఉన్నాయి. ప‌చ్చని ప్రకృతి అందాలు క‌ళ్లకు క‌ట్టి ప‌డేస్తాయి కేర‌ళ లోనూ, కోన‌సీమ లోనూ వెళ్లే కొద్దీ ఎత్తయిన కొబ్బరి చెట్లు త‌ల‌లు ఊపుతూ స్వాగ‌తం ఇస్తాయి. కొబ్బరి చెట్ల మాటున దోబూచులాడుతూ ఉద‌య భానుడి అందాలు ప‌ల‌క‌రిస్తూ ఉంటాయి. వాలుజ‌డ‌ను త‌ల‌పించే మెలిక‌లు తిరిగిన పంట కాల్వలు, కాల్వలు ఆనుకొని ఉన్న జ‌నావాసాలు అచ్చంగా అమ‌లాపురం నుంచి కాట్రేనికోన ప‌య‌నిస్తున్నట్లే క‌నిపిస్తాయి. వేకువ జామున స‌న్నటి మంచు కురుస్తుండ‌గా, పొగ‌మంచు పొర‌లు క‌ప్పుకొన్న వేళ‌.... లేలేత భానుడి అందాలు రెండు చోట్ల ఒకేలా మురిపించారు. అంద‌మైన ఉద‌యాన్ని ఒడిసి ప‌ట్టాల‌న్నంత ప‌ర‌వ‌శం చాలా కామ‌న్ గా అనిపించింది. పిల్ల కాలువ‌లు, పంట కాల‌వ‌ల్ని విడ‌గొడుతూ లాకులు, వీటి నుంచి ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న నీటి తుంప‌ర‌లు క‌నిపిస్తున్నాయి. వాటి ఒడ్డున పెద్ద వ‌య‌సు వారు కూర్చొని చ‌క్కగా న్యూస్ పేపర్ చ‌దువుకొనే దృశ్యాలు రెండు ప్రాంతాల్లోనూ క‌నిపించాయి.


ముఖ్యమైన పోలిక ఏమిటంటే ఊరు విడి విడిగా క‌నిపించ‌వు. అంటే రోడ్ పొడ‌వునా కాలువ‌లు కొన‌సాగుతూంటే మ‌రో వైపు జనావాసాలు కూడా కొనసాగుతాయి. చిన్న కాల‌నీల మాదిరిగా జ‌నం నివ‌సిస్తుంటారు. పంట పొలాల్లోనే అచ్చంగా ఇళ్లు క‌ట్లుకొని ఉండిపోతారు. ఎక్కడ‌కు వెళ్లినా గుడి, చర్చి, మ‌సీదు అన్ని అక్కడిక‌క్కడే క‌నిపిస్తాయి. వీటిని వేరు చూసి చూడాల్సిన ప‌ని లేదు. అంతేనా, ఊరూరా సినీ హీరోల‌కు పెద్ద ఫ్లెక్సీలు, అభిమాన సంఘాలు త‌ప్పనిస‌రి. ఎటొచ్చి కేర‌ళ లో మ‌ల‌యాళ హీరోలు వెలిగిపోతుంటే, కోన‌సీమ లో తెలుగు హీరోలు ప్రకాశిస్తుంటారు. మ‌రిచా,,, ఇంకో ముఖ్యమైన విష‌యం ఏమిటంటే మ‌ల‌యాళీలు పెద్ద సంఖ్యలో గ‌ల్ప్ వల‌స వెళుతుంటారు. ఇటు, కోన‌సీమ నుంచి పెద్ద సంఖ్యలో గ‌ల్ప్ కు వ‌ల‌స‌లు ఉంటాయి.


మ‌రో అప్ డేట్ ఏమిటంటే ఇంత‌కు ముందు కేవ‌లం కొత్తపేట‌, అమలాపురం వంటి చోట్ల మాత్ర మే కాలేజీలు క‌నిపించేవి. ఇప్పుడు అన్నిచోట్ల ఠీవిగా నుంచొన్న ఇంజ‌నీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ పాత భ‌వ‌నాల రూపంలో కేర‌ళ లోనూ ఉంది. అంతే కాదు, కొబ్బరితోటల మ‌ధ్యన పాక‌లు వేసేసి ప్రభుత్వ పాఠశాల‌ల్ని న‌డిపించ‌టం రెండు చోట్ల కామ‌న్ ట్రెండ్‌. కాల‌వ‌ల్లో ప‌డ‌వ‌ల మీద ప్రయాణిస్తూ కాలేజీల‌కు, స్కూళ్లకు ప‌రిగెత్తే స్టూడెంట్ బ్యాచ్ లు రెండు చోట్ల క‌నిపించాయి.
చెప్పుకొంటూ పోతే, కేర‌ళ‌, కోన‌సీమ‌ల మ‌ధ్య చాలానే పోలిక‌లు క‌నిపించాయి. అందుకే అమ్మకు కేర‌ళ లో కూడా కోన‌సీమ అందాలే క‌నిపించాయి. ఆమెకు చిన్నప్పుడు తాను పుట్టి పెరిగిన అయినాపురం గురించి ప‌దే ప‌దే త‌ల‌చుకోవ‌టం, తీసుకెళ్లినందుకు నా జ‌న్మ ధ‌న్యం అనిపించింది.

Wednesday, January 19, 2011

వెన్నెల్లో గోదారి అందం.. త‌ల‌చుకొంటే గుర్తొచ్చే అంద‌మైన స్టోరీ(ఇవాళ పౌర్ణ‌మి క‌దా...)


వెన్నెల్లో గోదారి అందం - నిజంగానే ఎంత అంద‌మైన ప‌ద‌బంధం. వెన్నెల‌, గోదారి రెండింట్లో ఏది అందమైన‌ది అని రెండు వేళ్లు చూపెడితే రెంటినీ ప‌ట్టేసుకోవాల‌ని అనిపిస్తుంది. గోదారిని త‌ల‌చుకొంటేనే ఒక అంద‌మైన పుల‌కింత‌, ఒక అద్భుత‌మైన అనుభూతి. మెరిసిపోతున్న వెన్నెల కాంతుల్లో గోదావ‌రి.. అంద‌మైన పూబంతి అవుతుంది. అంత‌కు మించి అందాల చామంతి అవుతుంది. పౌర్ణ‌మి రోజున గోదావ‌రిని చూస్తే.. వ‌య్యారి గోదార‌మ్మ‌, వెన్నెల్లో ఎందుక‌మ్మ ప‌ర‌వ‌శం అని మ‌నం డౌట్ అడిగేయ‌చ్చు. ఆ వ‌య్యారి న‌డ‌క‌ను చూస్తే - క‌నులు ప‌క్క‌కు తిప్ప‌లేం. ఎందుకంటే వెన్నెల ను చూడ‌గానే గోదార‌మ్మ నిజ్జంగానే ప‌ర‌వ‌శించిపోతుంది. అందుకే ఉప్పొంగెనే గోదావ‌రి అన్న మాట‌ను నిజం చేస్తూ ఉర‌క‌లేస్తుంది. ఈ అంద‌మైన దృశ్యాన్ని ఒడిసిప‌ట్టి మ‌న‌సు అనే సీపీయూ లో సేవ్ చేసుకొంటే ఎన్నిసార్ల‌యినా రిఫ్రెష్ బ‌ట‌న్ తో రిఫ్రెష్ కావ‌చ్చు. రాజ‌మండ్రి దిగువ‌న లంక‌ల్లోంచి గోదారిని చూడ‌టం ఒక ఎత్త‌యితే, దిగువ‌గా కోటిప‌ల్లి రేవులో అల‌ల్ని తాకుతూ ఆస్వాదించ‌టం మ‌రొక ఎత్తు. ఎం త చూసినా త‌రిగిపోని అందం ఏద‌ని ఎస్ ఎమ్ ఎస్ ప్ర‌శ్మ అడిగితే గోదార‌మ్మ అని ఏకైక జ‌వాబు రాసేయ‌చ్చు. కావాలంటే పున్న మి వెన్నెల్లో ఇసుక తిన్నెల‌పై న‌డుస్తూ మార్కులు వేసుకొమ్మ‌ని స‌ల‌హా ప‌డేయ‌చ్చు. వెండి గిన్నెల్లో చంద్రుడ్ని చూసిన‌ట్లు,, గోదార‌మ్మ కెర‌టాల మీద వెన్నెల కాంతుల్ని చూస్తే... లోకం ఒక్క‌సారి ఆగిపోయిన‌ట్లు అనిపిస్తుంది. సృష్టిలోని అంద‌మంతా క‌నుచూపు మేర ప‌రుచుకొన్న‌ట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా గ‌ల‌గ‌ల‌ల శ‌బ్దం చెవుల‌కు ఇంపుగా వినిపిస్తుంటే .. అందమే అనందం అన్న మాట నిజ‌మ‌నిపిస్తుంది. గోదారి గ‌ట్టు వెంట ఒంట‌రిగా చ‌క్క‌ర్లు కొట్టిన దానికి, జంట‌గా షికారు చేసిన దానికి బోలెడంత డిఫ‌రెన్సు క‌నిపిస్తుంది. ఇద్ద‌రం క‌లిసి నెమ్మ‌దిగా న‌డుస్తూ... అడుగులో అడుగులు వేసుకొంటూ, మ‌ధ్య‌లో చేతిలో చేతిని సుతి మెత్త‌గా క‌లుపుకొంటూ న‌డుస్తుంటే మాట‌లు త‌డ‌ప‌డ‌తాయి. ఎన్నెన్నో ఊసులు చెప్పుకోవాల‌ని, చెవిలో చెవేసుకొని గుస‌గుస‌లాడుకోవాలని త‌లంపు ఉన్నా..మౌనంగా మ‌న‌సు ప‌లికే రాగాలు వింటూ కాలం గ‌డ‌పాల్సిందే. ((వెన్నెల్లో గోదారి అందాల్ని ఒడిసిప‌ట్టిన ఒక క‌పుల్ అభివ‌ర్ణించిన అనుభూతుల ప‌ల్ల‌వి.. www.godavariyouth.com లో ఆర్టిక‌ల్స్ పేజీలో చూడ‌చ్చు. టైటిల్ - వెన్నెల్లో గోదావ‌రి, ఒక తేనేచంద్రం ))ఏడాదికోసారైనా కాంక్రీట్ జంగిల్ నుంచి పారిపోవాల‌ని, వెన్నెల్లో గోదారి అందాల్నిఒడిసి ప‌ట్టాల‌ని బ‌లంగా అనిపిస్తుంది. మ‌రి ముఖ్యంగా ప్ర‌తీ పౌర్న‌మికి ఈ ప్రామీస్ చేసుకోవ‌టం, వ‌చ్చే పున్న‌మి రోజు మ‌ళ్లీ దాన్ని గుర్తు చేసుకోవ‌టం ఆన‌వాయితీ అయిపోయింది.ఈ సారైనా గోదార‌మ్మ ద‌ర్శ‌నం జ‌రిగితే ఎంత బాగుండు, ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటే ఈ రాత్రి పున్న‌మి రాత్రి కాబ‌ట్టి..

Tuesday, January 18, 2011

స‌ఖి సినిమాలోని స్నేహితుడా.. ర‌హ‌స్య స్నేహితుడా.. పాట వింటే పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయి...


అర్థ‌రాత్రి వేళ మా మ్యూజిక్ ఛానెల్ లో స్నేహితుడా.. ర‌హస్య స్నేహితుడా .. పాట ప్లే అవుతోంది. ఆఫీసు లో హెడ్ లైన్స్ పెట్ట‌డానికి అయిడియా రాక త‌న్నుకొంటుంటే ఈ పాట చెవుల‌కుసోకింది. కాసేపు మ‌న‌సు కాలేజీ రోజుల‌కు వెళ్లిపోయింది. స‌ఖి సినిమా క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంటే కాలేజీ హ్యాపీ డేస్ లో మా ఫ్రెండ్‌ ప్రేమ క‌థ‌, పెళ్లి గాథ వ‌రుస‌గా గుర్తుకొని వ‌చ్చాయి. బులెటిన్ కు హెడ్ లైన్స్ పెట్టే ప‌ని కాసేపు వాయిదా వేసి.. ఆ హ్యాపీడేస్ ను త‌ల‌చుకొన్నా...
గోదావ‌రి జిల్లా లో పెద్ద‌గా ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకోని గ్రామం మాది. అక్క‌డ నుంచి కాలేజీ కి ప‌ది కిలోమీటర్లు .. పొలోమ‌ని సైకిల్ తొక్కుకొంటూ వెళ్లటం చాలా చాలా కామ‌న్ విష‌యం. ఉద‌య‌మే చ‌ద్ద‌న్నం తిని పుస్త‌కాలు సైకిల్ కి పెట్టుకొని బ‌య‌లు దేరితే .. పొలాల మ‌ధ్య నుంచి ఎంత స్పీడ్ గా సైకిల్ తొక్కామ‌న్న‌ది వీర‌త్వానికి ప్ర‌తీక‌. ఇంట‌ర్మీడియ‌ట్, అది అయ్యాక డిగ్రీ చ‌దివేయ‌ట‌మే త‌ప్ప అది చెయ్యాలి, ఇది పొడిచెయ్యాలి అని పెద్ద‌గా టార్గెట్ లు లేని ప్ర‌శాంత జీవితం అది. అస‌లు డిగ్రీ అయ్యాక జీవితాన్ని ఎలా గ‌డ‌పాలి అనే దాని మీద కూడా స్ప‌ష్టమైన అయిడియా లేని నిఖార్స‌యిన తాజా లైఫ్.
బీఎస్సీ అంటే స‌గం థీరీ క్లాసులు, స‌గం ప్రాక్టిక‌ల్ క్లాసుల‌తో తెల్ల‌వారే జీవితాలు. అందునా బ‌యాల‌జీ ల్యాబ్ లో స్టూడెంట్స్ అంతా ఒక చోట చేరి ల్యాబ్ లో కుస్తీ పట్టాల్సిందే క‌దా..స‌హ‌జంగానే రికార్డులు రాయ‌టం ద‌గ్గ‌రకు వ‌చ్చే స‌రికి బొమ్మ‌లు బాగా గీసేవారికి క్రేజ్ ఉండేది. బాగా డ్రాయింగ్ వ‌చ్చిన వారి బ‌తిమాలుకొని, మ‌న రికార్డ్ షీట్ ల మీద కూడా వాళ్ల చేత ర‌ఫ్ లైన్ గీయించుకొని,ఆ త‌ర్వాత ఫెయిర్ చేసుకొని మిగిలిన వారంతా ల్యాబ్ లోకి ప‌రుగులు తీయ‌టం రివాజు. ఈ క్ర‌మంలో మా క్లాసు లో జిమ్మీ కార్ట‌ర్ కు మంచి క్రేజ్ ఉండేది. జిమ్మీ బొమ్మ‌లు గీయ‌టం, పాట‌లు పాడ‌టం, క‌విత్వం రాయ‌టం వంటి క‌ళ‌ల్లో ఆరి తేరిన వాడు. అసువుగా పాట‌లు పాడేస్తూ. అందరి ద‌గ్గ‌ర మంచి గుడ్ విల్ సంపాదించుకొన్నారు. ఇక‌, మాబ్యాచ్ లోనే ఉండే అనిత కూడా డ్రాయింగ్ అవ‌స‌రాల కోసం జిమ్మీ తో స్నేహంగా ఉండ‌టం మొద‌లైంది. ఫ‌స్టియ‌ర్ లో ల్యాబ్ లో టేబుల్స్ పంచుకొనేట‌ప్పుడు అనిత‌, జిమ్మి, మ‌ధ్య‌లో నేను ఒక టేబుల్ తీసుకొన్నాం. కాలేజీలో ఉన్నంత సేపు హాయిగా స్టూడెంట్ లైఫ్ ని లీడ్ చేసేవాళ్లం. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా జిమ్మీ .. పాట‌లు పాడుతూ ఉత్సాహ ప‌రిచేవాడు. ఇక డిసెక్ష‌న్ లు చేయటం, ప్రాక్టిక‌ల్స్ చేయ‌టంలో అనిత మంచి ఎక్స్ ప‌ర్ట్. సో, ఇద్ద‌రి ద‌గ్గ‌ర స‌హాయం పొందుతూ నేను బండి లాగించేస్తూ.. ముందుకు సాగిపోయాం.
ఫ‌స్టియ‌ర్ దాటి సెకండియ‌ర్ కొచ్చేస‌రికి ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒక‌ట‌య్యారు. ఫ్రెండ్ షిప్ నుంచి ల‌వ్ షిప్ లోకి ఎంట‌ర‌య్యేస‌రికి మ్యాట‌ర్ కాస్త కాలేజీ అంతా పాకిపోయింది. అనిత తెల్ల‌టి తెలుపుతో మ‌ల్లెపువ్వులా ఉంటే, మా జిమ్మీ చ‌క్క‌టి న‌లుపుతో మెరిసిపోయేవారు.
అంత చ‌క్క‌టి తెలుపుకి, ఇంత చిక్క‌టి న‌లుపుకి ఎలా కుదిరింద‌బ్బా.. అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు కానీ, నేను మాత్రం ఏమాత్రం ఆశ్చ‌ర్య పోలేదు. స‌రికదా... చాలా సంతోషించాను. ఒకే మ‌న‌స్త‌త్వం, ఒకే సున్నిత‌త్వం క‌ల వాళ్లు క‌లిస్తే.. జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమా అంత స్వ‌చ్చంగా ఉంటుంది క‌దా..బీఎస్సీ చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి పీక‌ల్లోతు ప్రేమ లో మునిగి పోయిన మా ఫ్రెండ్స్ ఇద్ద‌రికీ, బాధ్య‌త‌లు మాత్రం గుర్తు ఉన్నాయి.

స‌ఖి సినిమా లోమాదిరిగానే ఇద్ద‌రూ పెళ్లి ని వాయిదా వేసి , కెరీర్‌ను న‌డిపించాల‌నుకొన్నారు. జిమ్మీ ఎమ్మెస్సీ కోసం ఆంధ్రా యూనివ‌ర్శిటీ కి వెళితే, అనిత బీ ఎడ్ కోసం ప్ర‌కాష్ కాలేజీ కి వెళ్లారు. ఈ కోర్సు లు పూర్తి కాగానే పెళ్లి ఘ‌డియ త‌రుముకొంటూ వచ్చేసింది. పెద్ద‌ల‌కు ఇష్టం లేని పెళ్లి కావ‌టంతో, కష్టంతోనే పెళ్లి చేసుకొన్నారు. మేం ఇంకా ఉద్యోగాల్లో ఇంకా కుద‌రుకోక‌పోవ‌టంతో త‌లో చేయ వేయ‌గ‌లిగాం త‌ప్పితే , ఫైనాన్షియ‌ల్ గా ఏమాత్రం ఆదుకోలేక పోయాం. దీంతో సినిమా మాదిరిగానే ఇరుకు గ‌దిలోనే లైఫ్ ను స్టార్ట్ చేశారు. చిన్న కుటుంబం, చీకు చింతా ఉన్న కుటుంబం గా ఉండేది. అడ‌పా త‌డ‌పా చిన్న చిన్న వ‌స్తువులు కొనుక్కొంటూ.. దిసీజ్ ద రిథ‌మ్ ఆఫ్ లైఫ్ అనిపించారు. ఈలోగా జ‌ర్న‌లిస్టు ఉద్యోగం రావ‌టంతో నేను హైద‌రాబాద్ కు ట‌పా క‌ట్టేశాను. ఇంటికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా.. జిమ్మీ-అనిత జంట‌ను క‌ల‌వ‌టం మాన‌లేదు.

ఆ త‌ర్వాత రిలీజైన స‌ఖి సినిమా ను చూశాక‌, థియోట‌ర్ లోనే టెన్స్ అవ్వాల్సి వ‌చ్చింది. చాలా చోట్ల మా ఫ్రెండ్స్ తో పోలిక ఉండ‌టం, సున్నిత‌మైన ల‌వ్ ట‌చ్ ఉండ‌టం బాగా గుర్తుండేలా చేసింది. అయిన వెంట‌నే ఇంటికి లెట‌ర్ రాశా. వెంట‌నే తిరుగు లేఖ వ‌చ్చేసింది. నా లెట‌ర్ తో రెస్పాండ్ అయిన మా జేసీ .. సినిమా చూడ‌టం, పోల్చుకోవ‌టం చ‌క చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. సెల‌వుకి ప్ర‌త్యేకంగా ఇంటికి ర‌మ్మని ఒక ఇన్విటేష‌న్ కూడా తోడ‌యింది. ఆ త‌ర్వాత సెల‌వు పుచ్చుకొని గౌత‌మీ ఎక్కి, ఇంటి ద‌గ్గ‌ర వాలిపోయా. అప్ప‌టికే మా ఇంటి దగ్గ‌ర నా పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌స్తుండేది. అప్ప‌ట్లో నేను పెళ్లి చేసుకొనేందుకు బాగా దూరంగా ఉండేవాడిని, ఈ విష‌యంలో నాకు కొన్ని అంచ‌నాలు ఉండేవి.. (ఇటువంటి పెళ్లి అంచ‌నాల‌తో కూడిన ఆర్టిక‌ల్ మీరూ చ‌ద‌వ‌చ్చు.. దాని పేరు - పెళ్లీ నీకో న‌మ‌స్కారం..http://www.godavariyouth.com/m/articles/view/--2010-12-22. )). దీంతో నా పెళ్లి వాయిదా ప‌డుతూ వ‌స్తుండేది. మా ఫ్రెండ్స్ మాత్రం చ‌క్క‌గా వైవాహిక జీవితంలో కుదురుకొన్నారు. కొంత కాలానికి బాబు పుట్టాడు. అప్పుడు రెండు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు కూడా ఈ జంట‌ను ఆశీర్వ‌దించారు. దీంతో అస‌లైన హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయ‌న్న మాట‌. ఈ మొత్తం ఎపిసోడ్ ను గుర్తు చేసుకొంటూ.. మ‌ళ్లీ బులెటిన్ ప‌నిలో ప‌డ్డా..

Thursday, January 13, 2011

మకర జ్యోతిని దర్శించేందుకు అయ్యప్ప సన్నిధికి వెళ్లే 60 కిలోమీటర్ల అటవీ మార్గంలో ఉన్న విశేషాలు



చూడగానే భక్తి భావం కల్పించే అయ్యప్ప దీక్స చేయటం ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఆ తర్వాత శరణాలు పలుకుతూ శబరిమలై వెళ్లి, మకర జ్యోతిని దర్శించి రావటం ఇంకెంతో మధురానుభూతి. ఎక్కడో కేరళ అడవుల్లో కొలువున్న స్వామిని దర్శించుకొనేందుకు ఇన్ని లక్షల మంది దీక్ష చేసి వెళ్లటం ఎందుకు, ఇతర పుణ్యక్షేత్రాలు దర్శనానికి లేనట్లుగా అయ్యప్ప ను దర్శించేందుకు ఇన్ని నియమావళి ఎందుకు, స్వామి సన్నిధికి వెళ్లే 60 కిలోమీటర్ల పెద్ద పాదం అటవీ మార్గంలో ఉన్న విశేషాలు ఏమిటి... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం. ( to read this article, pl. visit.... http://www.godavariyouth.com/m/news/view/--2010-12-25 ))))))