ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, January 7, 2012

కేర‌ళ అందాలు ఇక్కడ క‌నిపిస్తున్నాయే...!

మొన్నీ మ‌ధ్యనే కేర‌ళ వెళ్లి వ‌చ్చాను. కేర‌ళ కు వెళ్లి రావ‌టం కొత్త కాదు కానీ, ఈ సారి అమ్మ తో క‌లిసి కాస్త రిలాక్స్ గా వెళ్లాను. ఆగుతూ, ఆగుతూ స్థిమితంగా ప్రయాణించిన‌ప్పుడు అమ్మ చెప్పిన మాట విని ఆశ్చర్య పోయా. ఎప్పుడు నాకు ఈ విష‌యం తట్ట లేదు. కేర‌ళ అందాలు ఇక్కడే చూడ‌వ‌చ్చు. మ‌న తెలుగు నేల మీద కూడా కేర‌ళ అందాలు ఉన్నాయి క‌దా..! ముందు నేను పెద్దగా ప‌ట్టించుకోలేదు కానీ, ఒక్కో ఏరియా దాటి వెళుతుంటే అమ్మ చెప్పిన మాట అక్షరాలా నిజం అనిపించింది. అప్పటి నుంచి నేను కూడా పోలిక‌లు వెదికితే... అబ్బో, చాలా పోలిక‌లు కనిపించాయి



అమ్మ అన్నట్లుగా కేర‌ళ కు మ‌న కోన‌సీమ కు చాలా పోలిక‌లు ఉన్నాయి. ప‌చ్చని ప్రకృతి అందాలు క‌ళ్లకు క‌ట్టి ప‌డేస్తాయి కేర‌ళ లోనూ, కోన‌సీమ లోనూ వెళ్లే కొద్దీ ఎత్తయిన కొబ్బరి చెట్లు త‌ల‌లు ఊపుతూ స్వాగ‌తం ఇస్తాయి. కొబ్బరి చెట్ల మాటున దోబూచులాడుతూ ఉద‌య భానుడి అందాలు ప‌ల‌క‌రిస్తూ ఉంటాయి. వాలుజ‌డ‌ను త‌ల‌పించే మెలిక‌లు తిరిగిన పంట కాల్వలు, కాల్వలు ఆనుకొని ఉన్న జ‌నావాసాలు అచ్చంగా అమ‌లాపురం నుంచి కాట్రేనికోన ప‌య‌నిస్తున్నట్లే క‌నిపిస్తాయి. వేకువ జామున స‌న్నటి మంచు కురుస్తుండ‌గా, పొగ‌మంచు పొర‌లు క‌ప్పుకొన్న వేళ‌.... లేలేత భానుడి అందాలు రెండు చోట్ల ఒకేలా మురిపించారు. అంద‌మైన ఉద‌యాన్ని ఒడిసి ప‌ట్టాల‌న్నంత ప‌ర‌వ‌శం చాలా కామ‌న్ గా అనిపించింది. పిల్ల కాలువ‌లు, పంట కాల‌వ‌ల్ని విడ‌గొడుతూ లాకులు, వీటి నుంచి ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న నీటి తుంప‌ర‌లు క‌నిపిస్తున్నాయి. వాటి ఒడ్డున పెద్ద వ‌య‌సు వారు కూర్చొని చ‌క్కగా న్యూస్ పేపర్ చ‌దువుకొనే దృశ్యాలు రెండు ప్రాంతాల్లోనూ క‌నిపించాయి.


ముఖ్యమైన పోలిక ఏమిటంటే ఊరు విడి విడిగా క‌నిపించ‌వు. అంటే రోడ్ పొడ‌వునా కాలువ‌లు కొన‌సాగుతూంటే మ‌రో వైపు జనావాసాలు కూడా కొనసాగుతాయి. చిన్న కాల‌నీల మాదిరిగా జ‌నం నివ‌సిస్తుంటారు. పంట పొలాల్లోనే అచ్చంగా ఇళ్లు క‌ట్లుకొని ఉండిపోతారు. ఎక్కడ‌కు వెళ్లినా గుడి, చర్చి, మ‌సీదు అన్ని అక్కడిక‌క్కడే క‌నిపిస్తాయి. వీటిని వేరు చూసి చూడాల్సిన ప‌ని లేదు. అంతేనా, ఊరూరా సినీ హీరోల‌కు పెద్ద ఫ్లెక్సీలు, అభిమాన సంఘాలు త‌ప్పనిస‌రి. ఎటొచ్చి కేర‌ళ లో మ‌ల‌యాళ హీరోలు వెలిగిపోతుంటే, కోన‌సీమ లో తెలుగు హీరోలు ప్రకాశిస్తుంటారు. మ‌రిచా,,, ఇంకో ముఖ్యమైన విష‌యం ఏమిటంటే మ‌ల‌యాళీలు పెద్ద సంఖ్యలో గ‌ల్ప్ వల‌స వెళుతుంటారు. ఇటు, కోన‌సీమ నుంచి పెద్ద సంఖ్యలో గ‌ల్ప్ కు వ‌ల‌స‌లు ఉంటాయి.


మ‌రో అప్ డేట్ ఏమిటంటే ఇంత‌కు ముందు కేవ‌లం కొత్తపేట‌, అమలాపురం వంటి చోట్ల మాత్ర మే కాలేజీలు క‌నిపించేవి. ఇప్పుడు అన్నిచోట్ల ఠీవిగా నుంచొన్న ఇంజ‌నీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ పాత భ‌వ‌నాల రూపంలో కేర‌ళ లోనూ ఉంది. అంతే కాదు, కొబ్బరితోటల మ‌ధ్యన పాక‌లు వేసేసి ప్రభుత్వ పాఠశాల‌ల్ని న‌డిపించ‌టం రెండు చోట్ల కామ‌న్ ట్రెండ్‌. కాల‌వ‌ల్లో ప‌డ‌వ‌ల మీద ప్రయాణిస్తూ కాలేజీల‌కు, స్కూళ్లకు ప‌రిగెత్తే స్టూడెంట్ బ్యాచ్ లు రెండు చోట్ల క‌నిపించాయి.
చెప్పుకొంటూ పోతే, కేర‌ళ‌, కోన‌సీమ‌ల మ‌ధ్య చాలానే పోలిక‌లు క‌నిపించాయి. అందుకే అమ్మకు కేర‌ళ లో కూడా కోన‌సీమ అందాలే క‌నిపించాయి. ఆమెకు చిన్నప్పుడు తాను పుట్టి పెరిగిన అయినాపురం గురించి ప‌దే ప‌దే త‌ల‌చుకోవ‌టం, తీసుకెళ్లినందుకు నా జ‌న్మ ధ‌న్యం అనిపించింది.

2 comments:

  1. కోనసీమ,కేరళ,రెండూ చాలా అందమైన ప్రదేశాలే .అక్కడ లేని గోదావరి ఇక్కడ ఉంది.అక్కడ ఉన్న ఎత్తయిన పర్వతాలు,దట్టమైన అడవులు,వన్య మృగాలు, ఇక్కడలేవు.

    ReplyDelete