ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Wednesday, January 19, 2011
వెన్నెల్లో గోదారి అందం.. తలచుకొంటే గుర్తొచ్చే అందమైన స్టోరీ(ఇవాళ పౌర్ణమి కదా...)
వెన్నెల్లో గోదారి అందం - నిజంగానే ఎంత అందమైన పదబంధం. వెన్నెల, గోదారి రెండింట్లో ఏది అందమైనది అని రెండు వేళ్లు చూపెడితే రెంటినీ పట్టేసుకోవాలని అనిపిస్తుంది. గోదారిని తలచుకొంటేనే ఒక అందమైన పులకింత, ఒక అద్భుతమైన అనుభూతి. మెరిసిపోతున్న వెన్నెల కాంతుల్లో గోదావరి.. అందమైన పూబంతి అవుతుంది. అంతకు మించి అందాల చామంతి అవుతుంది. పౌర్ణమి రోజున గోదావరిని చూస్తే.. వయ్యారి గోదారమ్మ, వెన్నెల్లో ఎందుకమ్మ పరవశం అని మనం డౌట్ అడిగేయచ్చు. ఆ వయ్యారి నడకను చూస్తే - కనులు పక్కకు తిప్పలేం. ఎందుకంటే వెన్నెల ను చూడగానే గోదారమ్మ నిజ్జంగానే పరవశించిపోతుంది. అందుకే ఉప్పొంగెనే గోదావరి అన్న మాటను నిజం చేస్తూ ఉరకలేస్తుంది. ఈ అందమైన దృశ్యాన్ని ఒడిసిపట్టి మనసు అనే సీపీయూ లో సేవ్ చేసుకొంటే ఎన్నిసార్లయినా రిఫ్రెష్ బటన్ తో రిఫ్రెష్ కావచ్చు. రాజమండ్రి దిగువన లంకల్లోంచి గోదారిని చూడటం ఒక ఎత్తయితే, దిగువగా కోటిపల్లి రేవులో అలల్ని తాకుతూ ఆస్వాదించటం మరొక ఎత్తు. ఎం త చూసినా తరిగిపోని అందం ఏదని ఎస్ ఎమ్ ఎస్ ప్రశ్మ అడిగితే గోదారమ్మ అని ఏకైక జవాబు రాసేయచ్చు. కావాలంటే పున్న మి వెన్నెల్లో ఇసుక తిన్నెలపై నడుస్తూ మార్కులు వేసుకొమ్మని సలహా పడేయచ్చు. వెండి గిన్నెల్లో చంద్రుడ్ని చూసినట్లు,, గోదారమ్మ కెరటాల మీద వెన్నెల కాంతుల్ని చూస్తే... లోకం ఒక్కసారి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సృష్టిలోని అందమంతా కనుచూపు మేర పరుచుకొన్నట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా గలగలల శబ్దం చెవులకు ఇంపుగా వినిపిస్తుంటే .. అందమే అనందం అన్న మాట నిజమనిపిస్తుంది. గోదారి గట్టు వెంట ఒంటరిగా చక్కర్లు కొట్టిన దానికి, జంటగా షికారు చేసిన దానికి బోలెడంత డిఫరెన్సు కనిపిస్తుంది. ఇద్దరం కలిసి నెమ్మదిగా నడుస్తూ... అడుగులో అడుగులు వేసుకొంటూ, మధ్యలో చేతిలో చేతిని సుతి మెత్తగా కలుపుకొంటూ నడుస్తుంటే మాటలు తడపడతాయి. ఎన్నెన్నో ఊసులు చెప్పుకోవాలని, చెవిలో చెవేసుకొని గుసగుసలాడుకోవాలని తలంపు ఉన్నా..మౌనంగా మనసు పలికే రాగాలు వింటూ కాలం గడపాల్సిందే. ((వెన్నెల్లో గోదారి అందాల్ని ఒడిసిపట్టిన ఒక కపుల్ అభివర్ణించిన అనుభూతుల పల్లవి.. www.godavariyouth.com లో ఆర్టికల్స్ పేజీలో చూడచ్చు. టైటిల్ - వెన్నెల్లో గోదావరి, ఒక తేనేచంద్రం ))ఏడాదికోసారైనా కాంక్రీట్ జంగిల్ నుంచి పారిపోవాలని, వెన్నెల్లో గోదారి అందాల్నిఒడిసి పట్టాలని బలంగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ప్రతీ పౌర్నమికి ఈ ప్రామీస్ చేసుకోవటం, వచ్చే పున్నమి రోజు మళ్లీ దాన్ని గుర్తు చేసుకోవటం ఆనవాయితీ అయిపోయింది.ఈ సారైనా గోదారమ్మ దర్శనం జరిగితే ఎంత బాగుండు, ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటే ఈ రాత్రి పున్నమి రాత్రి కాబట్టి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment