ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Tuesday, January 18, 2011

స‌ఖి సినిమాలోని స్నేహితుడా.. ర‌హ‌స్య స్నేహితుడా.. పాట వింటే పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయి...


అర్థ‌రాత్రి వేళ మా మ్యూజిక్ ఛానెల్ లో స్నేహితుడా.. ర‌హస్య స్నేహితుడా .. పాట ప్లే అవుతోంది. ఆఫీసు లో హెడ్ లైన్స్ పెట్ట‌డానికి అయిడియా రాక త‌న్నుకొంటుంటే ఈ పాట చెవుల‌కుసోకింది. కాసేపు మ‌న‌సు కాలేజీ రోజుల‌కు వెళ్లిపోయింది. స‌ఖి సినిమా క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంటే కాలేజీ హ్యాపీ డేస్ లో మా ఫ్రెండ్‌ ప్రేమ క‌థ‌, పెళ్లి గాథ వ‌రుస‌గా గుర్తుకొని వ‌చ్చాయి. బులెటిన్ కు హెడ్ లైన్స్ పెట్టే ప‌ని కాసేపు వాయిదా వేసి.. ఆ హ్యాపీడేస్ ను త‌ల‌చుకొన్నా...
గోదావ‌రి జిల్లా లో పెద్ద‌గా ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకోని గ్రామం మాది. అక్క‌డ నుంచి కాలేజీ కి ప‌ది కిలోమీటర్లు .. పొలోమ‌ని సైకిల్ తొక్కుకొంటూ వెళ్లటం చాలా చాలా కామ‌న్ విష‌యం. ఉద‌య‌మే చ‌ద్ద‌న్నం తిని పుస్త‌కాలు సైకిల్ కి పెట్టుకొని బ‌య‌లు దేరితే .. పొలాల మ‌ధ్య నుంచి ఎంత స్పీడ్ గా సైకిల్ తొక్కామ‌న్న‌ది వీర‌త్వానికి ప్ర‌తీక‌. ఇంట‌ర్మీడియ‌ట్, అది అయ్యాక డిగ్రీ చ‌దివేయ‌ట‌మే త‌ప్ప అది చెయ్యాలి, ఇది పొడిచెయ్యాలి అని పెద్ద‌గా టార్గెట్ లు లేని ప్ర‌శాంత జీవితం అది. అస‌లు డిగ్రీ అయ్యాక జీవితాన్ని ఎలా గ‌డ‌పాలి అనే దాని మీద కూడా స్ప‌ష్టమైన అయిడియా లేని నిఖార్స‌యిన తాజా లైఫ్.
బీఎస్సీ అంటే స‌గం థీరీ క్లాసులు, స‌గం ప్రాక్టిక‌ల్ క్లాసుల‌తో తెల్ల‌వారే జీవితాలు. అందునా బ‌యాల‌జీ ల్యాబ్ లో స్టూడెంట్స్ అంతా ఒక చోట చేరి ల్యాబ్ లో కుస్తీ పట్టాల్సిందే క‌దా..స‌హ‌జంగానే రికార్డులు రాయ‌టం ద‌గ్గ‌రకు వ‌చ్చే స‌రికి బొమ్మ‌లు బాగా గీసేవారికి క్రేజ్ ఉండేది. బాగా డ్రాయింగ్ వ‌చ్చిన వారి బ‌తిమాలుకొని, మ‌న రికార్డ్ షీట్ ల మీద కూడా వాళ్ల చేత ర‌ఫ్ లైన్ గీయించుకొని,ఆ త‌ర్వాత ఫెయిర్ చేసుకొని మిగిలిన వారంతా ల్యాబ్ లోకి ప‌రుగులు తీయ‌టం రివాజు. ఈ క్ర‌మంలో మా క్లాసు లో జిమ్మీ కార్ట‌ర్ కు మంచి క్రేజ్ ఉండేది. జిమ్మీ బొమ్మ‌లు గీయ‌టం, పాట‌లు పాడ‌టం, క‌విత్వం రాయ‌టం వంటి క‌ళ‌ల్లో ఆరి తేరిన వాడు. అసువుగా పాట‌లు పాడేస్తూ. అందరి ద‌గ్గ‌ర మంచి గుడ్ విల్ సంపాదించుకొన్నారు. ఇక‌, మాబ్యాచ్ లోనే ఉండే అనిత కూడా డ్రాయింగ్ అవ‌స‌రాల కోసం జిమ్మీ తో స్నేహంగా ఉండ‌టం మొద‌లైంది. ఫ‌స్టియ‌ర్ లో ల్యాబ్ లో టేబుల్స్ పంచుకొనేట‌ప్పుడు అనిత‌, జిమ్మి, మ‌ధ్య‌లో నేను ఒక టేబుల్ తీసుకొన్నాం. కాలేజీలో ఉన్నంత సేపు హాయిగా స్టూడెంట్ లైఫ్ ని లీడ్ చేసేవాళ్లం. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా జిమ్మీ .. పాట‌లు పాడుతూ ఉత్సాహ ప‌రిచేవాడు. ఇక డిసెక్ష‌న్ లు చేయటం, ప్రాక్టిక‌ల్స్ చేయ‌టంలో అనిత మంచి ఎక్స్ ప‌ర్ట్. సో, ఇద్ద‌రి ద‌గ్గ‌ర స‌హాయం పొందుతూ నేను బండి లాగించేస్తూ.. ముందుకు సాగిపోయాం.
ఫ‌స్టియ‌ర్ దాటి సెకండియ‌ర్ కొచ్చేస‌రికి ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒక‌ట‌య్యారు. ఫ్రెండ్ షిప్ నుంచి ల‌వ్ షిప్ లోకి ఎంట‌ర‌య్యేస‌రికి మ్యాట‌ర్ కాస్త కాలేజీ అంతా పాకిపోయింది. అనిత తెల్ల‌టి తెలుపుతో మ‌ల్లెపువ్వులా ఉంటే, మా జిమ్మీ చ‌క్క‌టి న‌లుపుతో మెరిసిపోయేవారు.
అంత చ‌క్క‌టి తెలుపుకి, ఇంత చిక్క‌టి న‌లుపుకి ఎలా కుదిరింద‌బ్బా.. అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు కానీ, నేను మాత్రం ఏమాత్రం ఆశ్చ‌ర్య పోలేదు. స‌రికదా... చాలా సంతోషించాను. ఒకే మ‌న‌స్త‌త్వం, ఒకే సున్నిత‌త్వం క‌ల వాళ్లు క‌లిస్తే.. జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమా అంత స్వ‌చ్చంగా ఉంటుంది క‌దా..బీఎస్సీ చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి పీక‌ల్లోతు ప్రేమ లో మునిగి పోయిన మా ఫ్రెండ్స్ ఇద్ద‌రికీ, బాధ్య‌త‌లు మాత్రం గుర్తు ఉన్నాయి.

స‌ఖి సినిమా లోమాదిరిగానే ఇద్ద‌రూ పెళ్లి ని వాయిదా వేసి , కెరీర్‌ను న‌డిపించాల‌నుకొన్నారు. జిమ్మీ ఎమ్మెస్సీ కోసం ఆంధ్రా యూనివ‌ర్శిటీ కి వెళితే, అనిత బీ ఎడ్ కోసం ప్ర‌కాష్ కాలేజీ కి వెళ్లారు. ఈ కోర్సు లు పూర్తి కాగానే పెళ్లి ఘ‌డియ త‌రుముకొంటూ వచ్చేసింది. పెద్ద‌ల‌కు ఇష్టం లేని పెళ్లి కావ‌టంతో, కష్టంతోనే పెళ్లి చేసుకొన్నారు. మేం ఇంకా ఉద్యోగాల్లో ఇంకా కుద‌రుకోక‌పోవ‌టంతో త‌లో చేయ వేయ‌గ‌లిగాం త‌ప్పితే , ఫైనాన్షియ‌ల్ గా ఏమాత్రం ఆదుకోలేక పోయాం. దీంతో సినిమా మాదిరిగానే ఇరుకు గ‌దిలోనే లైఫ్ ను స్టార్ట్ చేశారు. చిన్న కుటుంబం, చీకు చింతా ఉన్న కుటుంబం గా ఉండేది. అడ‌పా త‌డ‌పా చిన్న చిన్న వ‌స్తువులు కొనుక్కొంటూ.. దిసీజ్ ద రిథ‌మ్ ఆఫ్ లైఫ్ అనిపించారు. ఈలోగా జ‌ర్న‌లిస్టు ఉద్యోగం రావ‌టంతో నేను హైద‌రాబాద్ కు ట‌పా క‌ట్టేశాను. ఇంటికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా.. జిమ్మీ-అనిత జంట‌ను క‌ల‌వ‌టం మాన‌లేదు.

ఆ త‌ర్వాత రిలీజైన స‌ఖి సినిమా ను చూశాక‌, థియోట‌ర్ లోనే టెన్స్ అవ్వాల్సి వ‌చ్చింది. చాలా చోట్ల మా ఫ్రెండ్స్ తో పోలిక ఉండ‌టం, సున్నిత‌మైన ల‌వ్ ట‌చ్ ఉండ‌టం బాగా గుర్తుండేలా చేసింది. అయిన వెంట‌నే ఇంటికి లెట‌ర్ రాశా. వెంట‌నే తిరుగు లేఖ వ‌చ్చేసింది. నా లెట‌ర్ తో రెస్పాండ్ అయిన మా జేసీ .. సినిమా చూడ‌టం, పోల్చుకోవ‌టం చ‌క చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. సెల‌వుకి ప్ర‌త్యేకంగా ఇంటికి ర‌మ్మని ఒక ఇన్విటేష‌న్ కూడా తోడ‌యింది. ఆ త‌ర్వాత సెల‌వు పుచ్చుకొని గౌత‌మీ ఎక్కి, ఇంటి ద‌గ్గ‌ర వాలిపోయా. అప్ప‌టికే మా ఇంటి దగ్గ‌ర నా పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌స్తుండేది. అప్ప‌ట్లో నేను పెళ్లి చేసుకొనేందుకు బాగా దూరంగా ఉండేవాడిని, ఈ విష‌యంలో నాకు కొన్ని అంచ‌నాలు ఉండేవి.. (ఇటువంటి పెళ్లి అంచ‌నాల‌తో కూడిన ఆర్టిక‌ల్ మీరూ చ‌ద‌వ‌చ్చు.. దాని పేరు - పెళ్లీ నీకో న‌మ‌స్కారం..http://www.godavariyouth.com/m/articles/view/--2010-12-22. )). దీంతో నా పెళ్లి వాయిదా ప‌డుతూ వ‌స్తుండేది. మా ఫ్రెండ్స్ మాత్రం చ‌క్క‌గా వైవాహిక జీవితంలో కుదురుకొన్నారు. కొంత కాలానికి బాబు పుట్టాడు. అప్పుడు రెండు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు కూడా ఈ జంట‌ను ఆశీర్వ‌దించారు. దీంతో అస‌లైన హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయ‌న్న మాట‌. ఈ మొత్తం ఎపిసోడ్ ను గుర్తు చేసుకొంటూ.. మ‌ళ్లీ బులెటిన్ ప‌నిలో ప‌డ్డా..

No comments:

Post a Comment