ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Saturday, August 11, 2012
మా హైస్కూల్ లో అందాల రాక్షసి కథ..!
గోదావరి జిల్లా లో ఒక మారు మూల గ్రామం మాది. బస్ సౌకర్యం లేదు, పోస్టాఫీసు అంత కన్నా లేదు. ఇవన్నీ దర్జాగా ఉన్న ఒక పెద్ద ఊరి పక్కనే ఒదిగిపోయాం. అందుకని ఆ పెద్ద ఊరి కి ఉన్న సౌకర్యాలన్నీ మాకు ఉన్నట్లే. కుగ్రామం కాబట్టి మా ఊరి బడిలో ఐదో తరగతి దాకానే చదువులు. ఆ తర్వాత పక్క ఊరికి వెళ్లి చదువుకోవాల్సిందే. ఆరో తరగతి లో చేరాం అంటే నిజంగా పెద్దవాళ్లం అయిపోయినట్లు అన్న మాట. హాఫ్ నిక్కర్ ఎగవేసుకొంటూ పక్క ఊరికి పరిగెత్తటం ఒక దర్జా. అయితే ఇందులో రెండు శ్రేణులు ఉంటాయి. నడిచి వెళ్లి నడిచి వచ్చే మామూలు బ్యాచ్ ఒకటైతే, తల్లి దండ్రుల్ని కాకా పట్టి సైకిల్ సంపాదించుకొన్న బ్యాచ్ ఒకటి. ఎట్టకేలకు సైకిల్ సంపాదించుకొన్నప్పటికీ అందరం కలిసే షేర్ చేసుకొనే వాళ్లం. అబ్బాయిల వరకు ఇది సరే, అమ్మాయిలకు మాత్రం చిక్కు తప్పుదు. అసలు పేరంట్స్ ను ఒప్పించి హైస్కూల్ కు వెళ్లటమే ఒక సాహసం. అందుచేత ఆడ పిల్ల లంతా ఒక గుంపుగా చేరి పక్క ఊరికి నడక దారి పట్టే వారు. వాళ్లు పాపం ఉస్సూరు మంటూ సాయంత్రం నడిచి ఇంటికి చేరుకొనే వాళ్లు. మేం మాత్రం దర్జాగా సైకిల్ మీద రివ్వున దూసుకొని వెళ్లే వాళ్లం.
మా బ్యాచ్‌లో ఒక అమ్మాయి ఉండేది. చదువులో చాలా ఫాస్ట్ గా ఉండేది. బుర్ర దించుకొని తన పని తాను చేసుకొనే తత్వం ఆమెది. కానీ, అన్ని విషయాల్లోనూ అబ్బాయిలతో పోటీ పడేది. చదువులోనూ, ఆట పాటల్లోనూ యాక్టివ్ గా ఉండేది. స్కూల్ విద్యార్థుల కమిటీలో ఆమె మెంబర్. ఏదైనా తేడా వస్తే నేరుగా హెడ్ మాస్టర్ దగ్గర ఫిర్యాదు చేసేది. ఎన్ని చేసినా ఇంటికి వెళ్లాలంటే మాత్రం ఉస్సూరు మంటూ నడుచుకొంటూ వెళ్లాల్సిందే. చివరకు ఎట్టకేలకు మా బ్యాచ్ పదో తరగతి కి చేరుకొంది. అప్పటి దాకా హాప్ నిక్కర్ గాళ్లం అందరం ప్యాంట్ ల బాట పట్టాం. అటు అమ్మాయిలంతా పొట్టి పరికిణీలు వదిలేసి కండువా, ఓణీ డ్రెస్ లోకి మారిపోయారు.
రెండు రోజులు గడిచాక బాంబు లాంటి వార్త పేలింది. ఇందాక ప్రస్తావన చేసిన అమ్మాయి సైకిల్ తో స్కూల్ కి వచ్చిందన్న వార్త అన్ని క్లాసులకు పాకిపోయింది. ఇంకేముంది, అచ్చమైన పల్లెటూరు బడికి ఒక అమ్మాయి సైకిల్ తో వచ్చేసిందా..! సాయంత్రం అయ్యేసరికి అంతా బడి బయట మూగిపోయారు. అంత ధైర్యం ఉన్న అమ్మాయి కూడా ఒక్కసారిగా కంగారు పడిపోయిన పరిస్థితి. ఇంత మంది మధ్య నుంచి సైకిల్ తో ఇంటికి వెళ్లటం ఎలా. నెమ్మదిగా నడిపించుకొంటూ బయలు దేరింది. మిగిలిన వారు కూడా ఫాలో..! ఆ నాటి నుంచి ప్రతీరోజూ ఆమె తమ్ముడు సైకిల్ నడిపించుకొని ఊరి బయటకు తెస్తే అక్కడ నుంచి తొక్కుకొంటూ పక్కఊరి స్కూల్ కి వచ్చేసేది. తర్వాత సాయంత్రం ఊరి బయటే సైకిల్ తమ్ముడికి అప్పగించేసి బుర్ర దించుకొని నడక పట్టేది. వేసవిలో వాళ్ల మావయ్య గారి ఊర్లో సైకిల్ నేర్చుకొన్నప్పటికీ, సొంత ఊర్లో సైకిల్ మీద షికారు చేయలేని పరిస్తితి. ఆ తర్వాత కాలంలో ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామలి లైఫ్ లో సెటిల్ అయిపోయారనుకోండి. అందరితో చాలా గౌరవంగా ఉండే ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఇవాల మా ఊర్లో సైకిల్ తో స్కూల్ కి, బైక్ పై కాలేజీ కి వెళ్లటం చాలా కామన్ మరి..!
Subscribe to:
Post Comments (Atom)
photos are very nice..what is the name of this village...
ReplyDelete