ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Saturday, August 25, 2012
చిన్న పల్లెటూరు లో ఆటోగ్రాఫ్..స్వీట్ మెమరీస్..!
హై స్కూల్ లో ఏడో తరగతి పూర్తి చేసుకొని ఎనిమదో తరగతి లోకి అడుగు పెట్టాం. ఏడో తరగతి అప్పర్ ప్రైమరీ స్కూల్ లో వెలగబెట్టాక, హైస్కూల్ కి పొరుగు ఊరికి వెళతాం అన్న మాట. అప్పటినుంచి హైస్కూల్ విద్యార్థుల స్థాయి వచ్చేస్తుంది. పైగా కొత్త ఊరు, కొత్త ఫ్రెండ్స్ హడావుడి మొదలైపోతుంది.
రెండు నెలలు గడిచాక ఒక వార్త ఫ్లాష్ అయింది. అదేమిటంటే, మా బ్యాచ్ లోని ఒక అమ్మాయి రజస్వల అయిందని తెలిసింది. పల్లెటూరు లో దీనికి కూడా హడావుడి ఉంటుంది. బంధు మిత్రుల్ని పిలిచి భోజనాల కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి నిజాయితీ గా ఫ్రెండ్స్ అందరికీ కబురు పంపించేసింది. కొద్ది రోజులకే మేం అంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అందునా ఈ అమ్మాయి అందరితోటి చక్కగా కలిసిపోయి సందడిగా ఉండేది. పైగా హైస్కూల్ లో చేరిన కొత్త లో వచ్చిన ఫంక్షన్ అన్న మాట. అందుచేత తలో కొంత చందా వేసుకొని ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామనుకొన్నాం. ఏం కొనాలి అనేదానిపై చర్చలు తీవ్రంగా సాగాయి. ఈ లోగా టౌన్స్ లో ఇటువంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు కేక్ కొని దాన్ని కట్ చేయిస్తారని ఒక కబురు అందింది. ఇది ఎంతవరకు నిజమో అప్పట్లో ఎవరికీ తెలీదు. కానీ, తలకు రెండు రూపాయల చొప్పున చందాలు వసూలు చేశాం. యాభై రూపాయల పైనే వసూలు అయింది. దీంతో టౌన్ కు సైకిల్ మీద వెళ్లి ఒక కేక్ తెప్పించేశాం.
ఆ రోజు ఆదివారం కావటంతో క్లాస్ లోని వాళ్లం అంతా స్కూల్ దగ్గర పోగు అయ్యాం. నాలుగు ఊళ్లకు అది ఒకటే హైస్కూల్ మరి. అందుకే అందరం వచ్చాక వాళ్ల ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ఈ లోగా కేక్ వచ్చేసింది. ఆరాటం ఆగక కేక్ ఒకసారి చూడాలనిపించి ఓపెన్ చేయించాం. తీరా చూస్తే.. దానీ మీద క్రీమ్ తో హ్యాపీ బర్త్ డే అని రాసి ఉంది. ఈ సందర్భంలో ఈ వాక్యం మ్యాచ్ కాదు కదా.. ఎలా అన్న డౌట్ వచ్చింది. దీన్ని ఇంగ్లీస్ లో ఏమంటారో మాకు తెలియదాయే..! చివరకు బర్త్ అనే పదం తీసేశాం. అంటే హ్యాపీ డే అన్న మాట. వెంటనే కట్ట కట్టుకొని అక్కడకు చేరాం. మా హడావుడి చూసి ఆ అమ్మాయి పేరంట్స్, బంధువులు భలే నవ్వుకొన్నారు. కానీ, అంతా కల్మషం లేని స్నేహితులం కదా, పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇంటి మధ్యలో ఈ కేక్ ను అందరికీ పంచేశాం. ఎవరికి ఇది హ్యాపీ డే అన్న విషయం పక్కన పెడితే అంతా హ్యాపీగా ఆ ఈవెంట్ ను ఎంజాయ్ చేశాం. తర్వాత హైస్కూల్ చదువు పూర్తవుతూనే ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకొంది. ఇప్పుడు వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment