ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Friday, May 15, 2015
ఈ పుట్టిన రోజు నాడు, నీవు లేవు కానీ నీ జ్ఞాపకాల వెల్లువలో తడిసిపోతా..!
ఎవరి పుట్టిన రోజు అయినా వాళ్లకు వేడుక గా ఉంటుంది. కానీ ఒకరి పుట్టిన రోజుని మరొకరు గుర్తు ఉంచుకొన్నారు అంటే కచ్చితంగా దానికో కారణం ఉంటుంది. సదరు వ్యక్తి బందువో, మిత్రులో అయ్యుండాలి. లేదా జనం అంతా గుర్తించుకొనే మంచి వ్యక్తి అయి ఉండాలి.
ఇప్పుడు నేను గుర్తు చేస్తున్న వ్యక్తి ఈ రెండో కోవకు చెందిన వారే. ఆయన పేరు సర్ ఆర్దర్ కాటన్. ముద్దుగా కాటన్ దొర గారు అని పిలుచుకొంటారు. గోదావరి నుంచి వెల్లువలా సముద్రంలోకి నదీ జలాలు పోతుంటే నదికి అటు ఇటు ఉన్న జిల్లాల్లోనే పంటలు సరిగ్గా పండని స్థితి ఉండేదట. అటువంటి సమయలో కాటన్ మహాశయుడు స్వయంగా గుర్రం మీద ఈ రెండు జిల్లాలు పర్యటించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాలని నిర్ణయించారు. అక్కడ ఆనకట్టను నిర్మించి నీటికి అడ్డుకట్ట వేసి, అక్కడ నుంచి పంట కాల్వల ద్వారా రెండు జిల్లాలకు సరఫరా అయ్యేట్లుగా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో రెండు లేక మూడు పంటలు పండుతున్నాయంటే అది నిజంగా కాటన్ మహాశయుడి గొప్పతనమే. తర్వాత కాలంలో ధవళేశ్వరం దగ్గర ఆనకట్టను బ్యారేజ్ గా మార్చి నిర్మించినప్పటికీ, దానికి మూలస్తంభంగా నిలిచింది. కాటన్ గారే. అందుకే ఆయన జయంతి అయిన మే 15న సవినయంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నాం.
Saturday, May 2, 2015
ఆ రాణి గారి భవంతి కట్టించిన విప్లవ వీరుడు ఎవరో తెలుసా...!
రాణులు, రాజులు, రాజ్యాలు పోయాయి. కానీ వారు మిగిల్చిన గురుతులు మాత్రం మిగిలాయి. రాజులు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కోటలు, అంతఃపురాల్లో తిరుగాడిన వారు గుర్తుకొని వస్తారు. కానీ ఈ కథనం ఈ శతాబ్దపు కాలం నాటిదే, ఇంకా చెప్పాలంటే , ముప్పై, నలభై సంవత్సరాల కితం నాటిది.
తూర్పు గోదావరి జిల్లా లో ఏజన్సీ ఏరియా బాగావిస్తరించి కనిపిస్తుంది. మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, గోకవరం, ఏలేశ్వరం, రాజవొమ్మంగి వంటి ప్రాంతాల్లో ఈ అటవీ ప్రాంతం విస్తరించింది. దీనికి అంతటికి దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతంగా పెద్దాపురం ను చెబుతారు. ఇటు, మెట్ట సీమ అయిన చాగల్నాడు కి కూడ ఇదికేంద్ర బిందువు. అందుచేత ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేస్తే పిల్లల చదువులకు బాగుంటుందని ధర్మాత్ములైన పెద్దలు సంకల్పించారు. దీంతో అప్పటి మహారాజ కుటుంబాల్ని సంప్రదించటం జరిగింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్దికి, దీన జనోద్ధరణకు వాత్సవాయి రాజ కుటుంబాలు విరివిగా డబ్బులు ఖర్చు పెట్టాయి. అందులో భాగంగా కాలేజీ ఏర్పాటుకి ఈ కుటుంబం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కాలేజీ ఏర్పాటు చేయించారు. రాజా వాత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణి కళాశాల పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సింపుల్ గా మహారాణి కాలేజీ అని పిలుచుకొంటారు. అంతే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు భోజనం పెట్టించాలన్న ఉద్దేశంతో మహారాణి సత్రం ఏర్పాటుచేశారు. అంటే ఈ కాలేజీలో సీటు తెచ్చుకొంటే రెండు పూటలా సత్రంలో భోజనం ఉచితంగా పెడతారు. ఇది మామూలు విషయం కాదు. కొన్ని వేలకుటుంబాల్లోని పేద విద్యార్థులు ఈ రకంగా చదువుకొని జీవితంలో స్థిర పడ్డారు. కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ఆ మహారాణికుటుంబానికి చెందుతుంది.
సరే, పెద్దాపురంలో కాలేజీ పెట్టారన్న సంగతి ఆ నోట, ఈ నోట ఏజన్సీ అంతా తెలిసిపోయింది. రౌతులపూడికి దగ్గరలో ఒక గ్రామం నుంచి ఒక విద్యార్థి వచ్చి కాలేజీలో చేరాడు. మొదట నుంచి విప్లవ భావాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న ఆ విద్యార్థి కాలేజీ స్టూడెంట్ యూనియన్ నాయకుడు అయ్యాడు. కాలేజీ ఉంది కానీ సరైన భవనాలు లేకపోటంతో అనేక కార్యక్రమాలు చేపట్టి, పెద్దలు మహారాణికుటుంబ సభ్యుల సాయంతో భవనాలు కట్టించారు. ఈ విధంగా తర్వాత తరం వారికి మంచిభవనాల్లో చదువుకొనే యోగం పట్టింది. ఇంతకీ ఈ విద్యార్థి నాయకుడు తర్వాత కాలంలో చెన్నై వెళ్లిపోయి సినిమాల్లో చేరాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక వెలుగు వెలిగాడు. ఆయన ఎవరో కాదు, విప్లవ సీనిమాల హీరో ఆర్. నారాయణ మూర్తి.
ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా చెప్పారు. మొన్న చాలాకాలం తర్వాత ఆయన్ని కలిస్తే ఈ విషయాలన్నీ నెమరు వేసుకొన్నారు. అదే కాలేజీలో చదువుకొని జీవితంలో స్థిర పడిన వ్యక్తిగా మహారాణికుటుంబాన్ని, నారాయణ మూర్తి గారు వంటి వదాన్యుల్ని గుర్తు చేసుకొంటాను.
Thursday, April 9, 2015
పదో తరగతి పరీక్షల చివరి రోజు ఏమైందంటే..!
ఎందుకంటే అప్పటి దాకా చదివిన చదువంతా ఒక ఎత్తు అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో ఎత్తు. ముఖ్యంగా పది సంవత్సరాల పాటు ఏదో ఒక మాదిరిగా దొర్లించేసినా ఈ గండం గట్టు ఎక్కడం కష్టం అన్నది పల్లెటూళ్లలో పెద్దల అభిప్రాయం. అందుకే పదో తరగతి పరీక్షలకు బాగా ముందునుంచే బాగా చదవాలి అంటూ నూరి పోసేవారు. మా ఊరికి మరో ఇబ్బంది ఏమిటంటే..పదో తరగతి పరీక్షలకు పక్కన ఉన్న జగ్గం పేట కు వెళ్లి రాయాలన్న మాట. అందుకు ముందునుంచి ప్రిపరేషన్ అన్న మాట. అప్పటి దాకా హాఫ్ నిక్కర్లతో స్కూల్ కు వెళ్లిన బ్యాచ్ అంతా అప్పటి నుంచి పొడుగు ఫ్యాంట్లతో వెళ్లినట్లు గుర్తు. అక్కడకు మా ఊరి తో పాటు మరో మూడు హైస్కూల్స్ కు చెందిన పిల్లలు వచ్చారు. వాళ్ల సంగతి ఎలా ఉన్నా..మాది చిన్న స్కూల్ కాబట్టి తిప్పితిప్పి కొడితే 30 మందికి మించి లేం. అయితేనేం. మేం బాగా చదివేసుకొని పరీక్షలకు వెళ్లిపోయాం.
అంత వరకు బాగానే ఉంది కానీ, మా హైస్కూల్ లో దాదాపు నాలుగు ఊళ్లకు చెందిన విద్యార్థులం చదువుకొనే వాళ్లం. అందులో ఒక్కో ఊరి నుంచి ఏడేనుమందిమి, కలిపితే ముప్పై మందిమి అన్న మాట. అబ్బాయిలు పొడుగు ఫాంట్లతో ( ఇందులో చాలా మందివి సైజ్ చేయించినవి అని గమనించ ప్రార్థన) అమ్మాయిలు కండువా వోణీలతో ఉత్సాహంగా పరీక్షలు ప్రారంభించాం. పరీక్షలు పూర్తయ్యాక కబుర్లు చెప్పుకొంటూ వెనక్కి రావటం అంతా బాగానే ఉంది. అనుకొన్నట్లుగా చివరి పరీక్ష వచ్చేసింది. సోషల్ స్టడీస్ రెండో పేపర్.
ఆ రోజు పేపర్ పూర్తయ్యాక మాత్రం మునుపటి సందడి అంతా మటు మాయం అయిపోయింది. ప్రతీ రోజు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ వెనక్కి మళ్లే వాళ్లం కాస్తా అక్కడ నుంచి కదల్లేక పోయాం. దాదాపు గా ఐదేళ్ల స్నేహం. అందులో కొందరు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కలిసిన వాళ్లు ఉన్నారు. పరీక్షల తర్వాత ఎవరి దారి వారిదే. పక్క పక్క ఊళ్లు అయినా ఎప్పటికి కలుస్తామో, ఏమవుతామో అన్న గంభీర వాతావరణం వచ్చేసింది. కళ్ల నుంచి ఏడుపులు అయితే రాలేదుకానీ దాదాపుగా అంత పని జరిగిపోయింది. ఈలోగా టైమ్ సాయంత్రం అయిపోయింది.
అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు కదా..ఇళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్లు ఒక్కొక్కరూ వెదక్కొంటూ వచ్చేశారు. అప్పుడు బయట పడి నెమ్మదిగా ఇళ్లకు మళ్లాం. పక్క పక్క ఊళ్లే అయినా చాలా మందిమి కొన్ని నెలల వ్యవధిలోనే దూరం అయిపోయాం. ఫలితాల తర్వాత కొంత కాలం కలిసి ఉన్నా దూరం పెరిగిపోయిది. భారం మిగిలిపోయింది. అందుకే పరీక్షల చివరి రోజు అంటే ఈ దృశ్యాలు కనుల ముందు మెదలుతాయి.మొన్నటి టెన్త్ పరీక్షల సమయంలో కూడా ఇదే గుర్తుకొని వచ్చింది. అదేంటో జీవితంలో చాలా పరీక్షలు రాసాం కానీ ఆ చివరి రోజు దృశ్యం మాత్రం టెన్త్ పరీక్షల్లోదే గుర్తుకు వస్తుంది.
Sunday, April 5, 2015
వెన్నెల్లో గోదారి అందం..చాలా రోజుల తర్వాత గుర్తుకొని వచ్చింది...!
చిన్నప్పుడు.. అఫ్ కోర్సు ఇప్పుడు కూడా ఈ పాటను బాగా ఇష్ట పడతాను. అంతకు మించి వెన్నెల్లో గోదావరి అందాన్ని తలచుకొని మరీ ఇష్ట పడతాను. వెన్నెల కిరణాలు గోదారమ్మ కెరటాలపై పడి తళ తళ మెరుస్తుంటే అబ్బా..ఆ ఊహే బాగుంటుంది.
చాలా కాలం తర్వాత వెన్నెల రాత్రి కుటుంబంతో సహా బయటకు షికారుకి వెళ్లా. ఉదయమే ఆఫీసుకి వెళ్లటం, రాత్రికి ఇంటికి వచ్చి తిని పడుకోవటం అనే బృహత్తరమైన టైమ్ టేబుల్ తో ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్న సగటు మనుషులం. అందుకే ఇంటికి వచ్చాక తిరిగి వెళ్లటం అన్నది పెద్దగా జరగదు. కానీ ఈ సారి పట్టు పట్టి కుటుంబంతో సహా రాత్రి ఇంటికి వచ్చి ఒక రౌండ్ భోజనం కానిచ్చి 8 గంటలకు బయలు దేరాం.
కారులో షికారు కొడుతూ వెళుతుంటే మెట్రో పుణ్యమా అని ట్రాఫిక్ కష్టాలు వెక్కిరించాయి. అందుకే ఒళ్లు దగ్గర బెట్టుకొని హుస్సేన్ సాగర్ దగ్గరకు కారు చేర్చి ఆపై ల్యాన్ లో సెటిల్ అయ్యాం. పిల్లలు ఆడుకొంటుంటే వెన్నెల కిరణాల చాటున హుస్సేన్ సాగర్ చూస్తూ కూర్చొన్నాం. అటువంటప్పుడు అలల అందాలు గుర్తుకొని వస్తాయి కానీ జలాల్లోని కాలుష్యం గుర్తుకొని రాదు. నెమ్మదిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొని వచ్చింది.
వాస్తవానికి వెన్నెల్లో గోదారి అందం గురించి నాకు చాలానే ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పట్లో అవి మరి కాస్త ఎక్కువ ఉండేవి. అప్పట్లో అంటే యూత్ రోజుల్లో అన్న మాట. పెళ్లికి ముందు గోపరాజు రాధాకృష్ణ గారు రాసిన వెన్నెల్లో గోదావరి కథను చాలా సార్లే చదివేశా. మా శ్రీమతికి దాన్ని పెళ్లికి ముందే పోస్టు చేసి మరీ చదివించా. అప్పట్లో వాట్స్ అప్ లు, ఫేస్ బుక్ లు లేవు కదా... బ్లాగులు అంతకన్నా లేవాయే. మనం మాటల్లో మనిషి కాదని,చేతల్లో మనిషని నిరూపించుకొనేందుకు ఫిక్స్ అయిపోయా.
అందుకే పెళ్లి అయ్యాక మొదటి పౌర్ణమి రోజు నిశ్శబ్దంగా బయటకు బయలు దేర దీశా. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన అమ్మాయికి కొబ్బరి చెట్టు, ఆ పై పిల్ల కాలువ గట్లు చూపిస్తూ రాత్రి బాగా పొద్దు పోయాక ముక్తేశ్వరం దగ్గరకు చేర్చా. అప్పుడు అర్థం అయింది, మన క్రియేటివ్ అయిడియా ఏమిటో. అప్పట్లో బజాజ్ చేతక్ మీద మన ప్రయాణం సాగుతుండేది. అందుకే ఆ స్కూటర్ ను జాగ్రత్తగా నావ ఎక్కించేసి ఆ ఒడ్డుకి బయలు దేరాం.
రాత్రి 9 గంటలకు పున్నమి చంద్రుడు పూర్తి అలర్ట్ లో కి వచ్చేశాక, నెమ్మదిగా పడవ ప్రయాణం మొదలైంది. ఎవరి హడావుడిలో వాళ్లు ఉంటేమేం మాత్రం నిశ్శబ్దంగా గోదారి అందాల్ని పరికిస్తూ కూర్చొన్నాం. ఒక్క మాట రాలితే ఒట్టు. అద్భుతమైన అందాల్ని ఒడిసిపడుతున్న వేళ మాటలు మూగ ఊసులయ్యాయి. కోటిపల్లి లో నావ దిగుతుంటే చాలా భారంగా కిందకు కదిలాం. అక్కడ నుంచి చెల్లూరు లోని అన్నయ్య వాళ్లింటికి వచ్చే దాకా మాత్రం ఆ ఊసులే దోబూచులాడాయి. మరిచిపోని జీవితంలో మెరుపులాంటి పేజీ ఇది.
అదేంటో ఈ రాత్రి హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చొని చక్కటి వెన్నెల్లో చిక్కటి అందాల్ని పరికిస్తూ కాలం గడిపాం. గంట గంటన్నర తరవాత సోమవారాన్ని తలచుకొని వెనక్కి మళ్లాం. పౌర్ణమి దాటి 1,2 రోజులు అయినా పున్నమి వెన్నెల అందాలు తగ్గిపోలేదు. పెళ్లయి పుష్కర కాలం గడుస్తున్నా, వెన్నెల్లో గోదారి అనుభూతులు మరిచిపోలేదు.
Subscribe to:
Posts (Atom)