ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Sunday, April 5, 2015
వెన్నెల్లో గోదారి అందం..చాలా రోజుల తర్వాత గుర్తుకొని వచ్చింది...!
చిన్నప్పుడు.. అఫ్ కోర్సు ఇప్పుడు కూడా ఈ పాటను బాగా ఇష్ట పడతాను. అంతకు మించి వెన్నెల్లో గోదావరి అందాన్ని తలచుకొని మరీ ఇష్ట పడతాను. వెన్నెల కిరణాలు గోదారమ్మ కెరటాలపై పడి తళ తళ మెరుస్తుంటే అబ్బా..ఆ ఊహే బాగుంటుంది.
చాలా కాలం తర్వాత వెన్నెల రాత్రి కుటుంబంతో సహా బయటకు షికారుకి వెళ్లా. ఉదయమే ఆఫీసుకి వెళ్లటం, రాత్రికి ఇంటికి వచ్చి తిని పడుకోవటం అనే బృహత్తరమైన టైమ్ టేబుల్ తో ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్న సగటు మనుషులం. అందుకే ఇంటికి వచ్చాక తిరిగి వెళ్లటం అన్నది పెద్దగా జరగదు. కానీ ఈ సారి పట్టు పట్టి కుటుంబంతో సహా రాత్రి ఇంటికి వచ్చి ఒక రౌండ్ భోజనం కానిచ్చి 8 గంటలకు బయలు దేరాం.
కారులో షికారు కొడుతూ వెళుతుంటే మెట్రో పుణ్యమా అని ట్రాఫిక్ కష్టాలు వెక్కిరించాయి. అందుకే ఒళ్లు దగ్గర బెట్టుకొని హుస్సేన్ సాగర్ దగ్గరకు కారు చేర్చి ఆపై ల్యాన్ లో సెటిల్ అయ్యాం. పిల్లలు ఆడుకొంటుంటే వెన్నెల కిరణాల చాటున హుస్సేన్ సాగర్ చూస్తూ కూర్చొన్నాం. అటువంటప్పుడు అలల అందాలు గుర్తుకొని వస్తాయి కానీ జలాల్లోని కాలుష్యం గుర్తుకొని రాదు. నెమ్మదిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొని వచ్చింది.
వాస్తవానికి వెన్నెల్లో గోదారి అందం గురించి నాకు చాలానే ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పట్లో అవి మరి కాస్త ఎక్కువ ఉండేవి. అప్పట్లో అంటే యూత్ రోజుల్లో అన్న మాట. పెళ్లికి ముందు గోపరాజు రాధాకృష్ణ గారు రాసిన వెన్నెల్లో గోదావరి కథను చాలా సార్లే చదివేశా. మా శ్రీమతికి దాన్ని పెళ్లికి ముందే పోస్టు చేసి మరీ చదివించా. అప్పట్లో వాట్స్ అప్ లు, ఫేస్ బుక్ లు లేవు కదా... బ్లాగులు అంతకన్నా లేవాయే. మనం మాటల్లో మనిషి కాదని,చేతల్లో మనిషని నిరూపించుకొనేందుకు ఫిక్స్ అయిపోయా.
అందుకే పెళ్లి అయ్యాక మొదటి పౌర్ణమి రోజు నిశ్శబ్దంగా బయటకు బయలు దేర దీశా. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన అమ్మాయికి కొబ్బరి చెట్టు, ఆ పై పిల్ల కాలువ గట్లు చూపిస్తూ రాత్రి బాగా పొద్దు పోయాక ముక్తేశ్వరం దగ్గరకు చేర్చా. అప్పుడు అర్థం అయింది, మన క్రియేటివ్ అయిడియా ఏమిటో. అప్పట్లో బజాజ్ చేతక్ మీద మన ప్రయాణం సాగుతుండేది. అందుకే ఆ స్కూటర్ ను జాగ్రత్తగా నావ ఎక్కించేసి ఆ ఒడ్డుకి బయలు దేరాం.
రాత్రి 9 గంటలకు పున్నమి చంద్రుడు పూర్తి అలర్ట్ లో కి వచ్చేశాక, నెమ్మదిగా పడవ ప్రయాణం మొదలైంది. ఎవరి హడావుడిలో వాళ్లు ఉంటేమేం మాత్రం నిశ్శబ్దంగా గోదారి అందాల్ని పరికిస్తూ కూర్చొన్నాం. ఒక్క మాట రాలితే ఒట్టు. అద్భుతమైన అందాల్ని ఒడిసిపడుతున్న వేళ మాటలు మూగ ఊసులయ్యాయి. కోటిపల్లి లో నావ దిగుతుంటే చాలా భారంగా కిందకు కదిలాం. అక్కడ నుంచి చెల్లూరు లోని అన్నయ్య వాళ్లింటికి వచ్చే దాకా మాత్రం ఆ ఊసులే దోబూచులాడాయి. మరిచిపోని జీవితంలో మెరుపులాంటి పేజీ ఇది.
అదేంటో ఈ రాత్రి హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చొని చక్కటి వెన్నెల్లో చిక్కటి అందాల్ని పరికిస్తూ కాలం గడిపాం. గంట గంటన్నర తరవాత సోమవారాన్ని తలచుకొని వెనక్కి మళ్లాం. పౌర్ణమి దాటి 1,2 రోజులు అయినా పున్నమి వెన్నెల అందాలు తగ్గిపోలేదు. పెళ్లయి పుష్కర కాలం గడుస్తున్నా, వెన్నెల్లో గోదారి అనుభూతులు మరిచిపోలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment