ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Thursday, April 9, 2015
పదో తరగతి పరీక్షల చివరి రోజు ఏమైందంటే..!
ఎందుకంటే అప్పటి దాకా చదివిన చదువంతా ఒక ఎత్తు అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో ఎత్తు. ముఖ్యంగా పది సంవత్సరాల పాటు ఏదో ఒక మాదిరిగా దొర్లించేసినా ఈ గండం గట్టు ఎక్కడం కష్టం అన్నది పల్లెటూళ్లలో పెద్దల అభిప్రాయం. అందుకే పదో తరగతి పరీక్షలకు బాగా ముందునుంచే బాగా చదవాలి అంటూ నూరి పోసేవారు. మా ఊరికి మరో ఇబ్బంది ఏమిటంటే..పదో తరగతి పరీక్షలకు పక్కన ఉన్న జగ్గం పేట కు వెళ్లి రాయాలన్న మాట. అందుకు ముందునుంచి ప్రిపరేషన్ అన్న మాట. అప్పటి దాకా హాఫ్ నిక్కర్లతో స్కూల్ కు వెళ్లిన బ్యాచ్ అంతా అప్పటి నుంచి పొడుగు ఫ్యాంట్లతో వెళ్లినట్లు గుర్తు. అక్కడకు మా ఊరి తో పాటు మరో మూడు హైస్కూల్స్ కు చెందిన పిల్లలు వచ్చారు. వాళ్ల సంగతి ఎలా ఉన్నా..మాది చిన్న స్కూల్ కాబట్టి తిప్పితిప్పి కొడితే 30 మందికి మించి లేం. అయితేనేం. మేం బాగా చదివేసుకొని పరీక్షలకు వెళ్లిపోయాం.
అంత వరకు బాగానే ఉంది కానీ, మా హైస్కూల్ లో దాదాపు నాలుగు ఊళ్లకు చెందిన విద్యార్థులం చదువుకొనే వాళ్లం. అందులో ఒక్కో ఊరి నుంచి ఏడేనుమందిమి, కలిపితే ముప్పై మందిమి అన్న మాట. అబ్బాయిలు పొడుగు ఫాంట్లతో ( ఇందులో చాలా మందివి సైజ్ చేయించినవి అని గమనించ ప్రార్థన) అమ్మాయిలు కండువా వోణీలతో ఉత్సాహంగా పరీక్షలు ప్రారంభించాం. పరీక్షలు పూర్తయ్యాక కబుర్లు చెప్పుకొంటూ వెనక్కి రావటం అంతా బాగానే ఉంది. అనుకొన్నట్లుగా చివరి పరీక్ష వచ్చేసింది. సోషల్ స్టడీస్ రెండో పేపర్.
ఆ రోజు పేపర్ పూర్తయ్యాక మాత్రం మునుపటి సందడి అంతా మటు మాయం అయిపోయింది. ప్రతీ రోజు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ వెనక్కి మళ్లే వాళ్లం కాస్తా అక్కడ నుంచి కదల్లేక పోయాం. దాదాపు గా ఐదేళ్ల స్నేహం. అందులో కొందరు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కలిసిన వాళ్లు ఉన్నారు. పరీక్షల తర్వాత ఎవరి దారి వారిదే. పక్క పక్క ఊళ్లు అయినా ఎప్పటికి కలుస్తామో, ఏమవుతామో అన్న గంభీర వాతావరణం వచ్చేసింది. కళ్ల నుంచి ఏడుపులు అయితే రాలేదుకానీ దాదాపుగా అంత పని జరిగిపోయింది. ఈలోగా టైమ్ సాయంత్రం అయిపోయింది.
అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు కదా..ఇళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్లు ఒక్కొక్కరూ వెదక్కొంటూ వచ్చేశారు. అప్పుడు బయట పడి నెమ్మదిగా ఇళ్లకు మళ్లాం. పక్క పక్క ఊళ్లే అయినా చాలా మందిమి కొన్ని నెలల వ్యవధిలోనే దూరం అయిపోయాం. ఫలితాల తర్వాత కొంత కాలం కలిసి ఉన్నా దూరం పెరిగిపోయిది. భారం మిగిలిపోయింది. అందుకే పరీక్షల చివరి రోజు అంటే ఈ దృశ్యాలు కనుల ముందు మెదలుతాయి.మొన్నటి టెన్త్ పరీక్షల సమయంలో కూడా ఇదే గుర్తుకొని వచ్చింది. అదేంటో జీవితంలో చాలా పరీక్షలు రాసాం కానీ ఆ చివరి రోజు దృశ్యం మాత్రం టెన్త్ పరీక్షల్లోదే గుర్తుకు వస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment