ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Sunday, May 12, 2013
పెద్ద మాస్టారు కి మాత్రం కన్నీటి అభిషేకం..!
మా ఊరు మొత్తానికి ఒకే ఒక్క స్కూల్ ఉండేది. సమితి ప్రాథమిక పాఠశాల. అక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి దాకా క్లాసులు ఉండేవి. నలుగురు మాస్టార్లు . అందులో హెడ్ మాస్టారు ను పెద్ద మాస్టారు అని పిలిచేవాళ్లం. ఆయన పేరు చీమల కొండ సత్యనారాయణ. ఆయన వయస్సు ఎక్కువగా ఉండటం కాదు కారణం. ఆయన మా ఊర్లో ఉండే పెద్దలకు కూడా మాస్టారే. ఎందుకంటే ఆయన అప్పటికే 20-25 సంవత్సరాలు గా అక్కడ పనిచేస్తు ఉండేవారు. దీంతో మా పెద్దలు కూడా ఆయన స్టూడెంట్స్ అన్న మాట. ఆయనకు కోపం వస్తే చేతిలో ఉన్న చింత బరికె విరిగిపోయే దాకా కొట్టే వారు. ఇతర మాస్టార్లు కొడితే ఇంటి దగ్గర పెద్దలకు కంప్లయింట్ చేసుకొనే చాన్సు ఉండేది. పెద్ద మాస్టారు కొడితే మాత్రం ఎవరికి చెప్పుకొనే దిక్కులేదు. ఆయన దగ్గరకు వచ్చి కంప్లియంట్ చెప్పటానికి పెద్దలు కూడా భయపడే వారు. ఉదయం తొమ్మిది అయిందంటే ఆయన స్కూల్ లో ఉండేవారు. అప్పటికల్లా మేమంతా పరిగెత్తుకొని లైన్ లో నుంచొని ఉండేవాళ్లం. ఉదయం అసెంబ్లీ జరపటం, సాయంత్రం పిల్లల్ని ఆడించటం అన్నీ చేయించేవారు. ఉదయం ఎంత సీరియస్ గా ఉండేవారో ఆడుకొనేటప్పుడు అంతటి సరదాగానూ కనిపించేవారు. మా ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకోవటం అంటే పూర్తిగా క్రమశిక్షణతో పెరిగినవాళ్లం అన్న బ్రాండ్ ఇమేజ్ ఉండేది. అంతేకాదు,,, తర్వాత హైస్కూల్ లో చేరినా, కాలేజీకి వెళ్లిపోయినా ఆగస్టు 15, జనవరి 26 కు ఆయన స్కూల్ కు పిలిపించే వారు. జెండా కర్ర కట్టడం, స్కూల్ అంతా డెకరేట్ చేయటం వంటి పనుల్ని పెద్ద పిల్లలకు అప్పగించేవారు. కాలేజీలో క్లాసు డుమ్మాకొట్టి బజారు లో తిరిగినా, టౌన్ లో సినిమాకు చెక్కేసినా పెద్ద మాస్టారు కనబడితే మాత్రం పరుగో పరుగు.
పెద్ద మాస్టారు రిటైర్ అయినప్పుడు మాత్రం ఊరంతా కదలి వచ్చింది. అప్పటి వేసవిలో ఈ మేనెల సమయంలోనే విపరీతమైన ఎండలు నడుస్తున్నాయి. కానీ పెద్ద మాస్టారు ఫంక్షన్ కు మాత్రం అంతా కదలి వచ్చారు. ఊరందరి సమక్షంలో సార్ కు మేం పుష్పాభిషేకం చేశాం. విద్యార్థులంతా కలిసి పాద పూజ చేశాం. అటువంటి మాస్టారిని మళ్లీ చూడలేమంటూ కన్నీళ్లు పెట్టుకొన్నాం. ఊరి ప్రారంభం నుంచి ఊరేగింపుగా స్కూల్ కు తీసుకొని వచ్చాం. అక్కడ అంతా కలిసి ఆయనకు పూజలు చేశాం. పిల్లా పెద్ద అనే తేడా లేకుండా స్కూల్ ప్రాంగణం మొత్తం కిట కిట లాడిపోయింది. మా స్కూల్ కే సర్వస్వం ధారపోసిన ఆయన్ని మా ఊరు వారు ఎవ్వరూ మరిచిపోరనుకొంటాను. ఆ మహానుభావుడి సంతతి ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలని దేవుడ్ని కోరుకొంటాను.
Subscribe to:
Post Comments (Atom)
గురువుని గౌరవించే మీ ఊరు చాలా సంస్కారవంతమైనది...!
ReplyDelete