ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Thursday, April 18, 2013
మా ఊర్లో శ్రీరామ నవమి... మరిచిపోలేని జ్ఞాపకాలు..!
ఊర్లో ఎవరి ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నా చుట్టు పక్కల ఇళ్లలో సందడి ఉంటుంది. కానీ, ఊరంతా కదిలే పండుగ మాత్రం కచ్చితంగా శ్రీరాముని కళ్యాణం మాత్రమే. ఈ వేడుకకు ఊరంతా హడావుడి అనుకోవాల్సిందే . ఏప్రిల్ నెల మధ్య లో వచ్చే ఈ పండుగ కు ఒక స్పెషాలిటీ ఉంది. అదేమంటే మా చిన్నప్పుడు చాలా సార్లు ఈ పండుగ నాటికి మా పరీక్షలు పూర్తి అయిపోయేవి. దీంతో వేసవి సెలవుల్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వచ్చే పండుగ కావటంతో మా కుర్రకారు జోరుకి పట్ట పగ్గాలు ఉండేవి కావు. శ్రీ రామ నవమి కి వారం, పది రోజుల ముందే ఏర్పాట్లు మొదలయ్యేవి. అంటే ఊరి మధ్య లో ఉన్న రాముల వారి గుడి ముందు పెద్ద తాటాకు పందిరి వేసేవారు. దీంతో మేం చెలరేగిపోయి ఆడుకొనేందుకు ఒక వేదిక దొరికి నట్లయ్యేది. శ్రీ రామ నవమి ముందు రోజు సాయంత్రం గుడి ని ముస్తాబు చేయటంలో పోటీ పడేవాళ్లం. జెండా పండుగకు కలర్ పేపర్స్ తెచ్చినట్లు రక రకాల జెండాలు, పేపర్ కటింగ్స్ తెచ్చి అలంకరించేవాళ్లం.
శ్రీ రామ నవమి రోజు ఉదయమే గుడి దగ్గరకు చేరిపోయి ప్లేస్ లు వేసుకొని ఉండేవాళ్లం. దేవుని కళ్యాణం అంటే ఊరంతా కదలి అక్కడకు వస్తుంది కదా. అప్పుడు మనకు వెనకాల చోటు దక్కితే ఇబ్బంది కాబట్టి కుర్ర బ్యాచ్ ముందు వెళ్లి పోయి పెద్దలకు ప్లేస్ లు ఆపి ఉంచటం రివాజు అన్న మాట. అసలు రాముల వారి తత్వం ఏమిటి, ఎందుకు ఆయన ఆదర్శ పురుషుడు అయ్యాడు, సీతమ్మ తల్లి గొప్పతనం ఏమిటి అన్నది పంతులు గారు వివరించి చెబుతుంటే తన్మయత్వంతో వినే వాళ్లం. ఆ తర్వాత పానకం తాగేందుకు, వడపప్పు తినేందుకు పోటీ ఎలాగు తప్పదు కదా.. మధ్యాహ్నం దాకా ఊరంతా ఒక్క చోట చేరి రామయ్య తండ్రి కళ్యాణాన్ని తిలకిస్తుంటే .. రాములోరి పెళ్లికి ఊరంతా పండుగే అన్నట్లు ఉండేది. ఆ దృశ్యం ఎప్పటికీ కన్నుల ముందు కదలాడుతూ ఉండేది.
ఇక రాముల వారి కళ్యాణం సాయంత్రం నుంచి సాంస్క్రతిక కార్యక్రమాలు ఉండేవి. ముఖ్యంగా ఊర్లోని యూత్ అంతా కలిసి నాటకాలు ప్రాక్టీస్ చేసి నాటకం వేసేవాళ్లం. పెద్ద వాళ్లు పౌరాణిక నాటకం ఆడితే, కుర్ర బ్యాచ్ మాత్రం సాంఘిక నాటకానికి పరిమితం. ఈ నాటకం వచ్చే దాకా మాత్రం రోజు హరి కథ, బుర్ర కథ వంటివి ఉండేవి. దీంతో పాటు వీధిలో స్క్రీన్ కట్టి సినిమా వేసే వాళ్లు. ఆ సినిమా చూడటం అంటే అబ్బో . .. అదో వెరైటీ ఫీలింగ్. ఇప్పుడు తలచుకొంటే మాత్రం భలే నవ్వు వస్తుంది. ఎనీ హౌ శ్రీ రామ నవమి అంటే దాచుకొన్న అనుభూతుల్ని తలచుకొనే ఒక భక్తి భావన అన్న మాట.
Subscribe to:
Post Comments (Atom)
చిన్నప్పుడు గుడి దగ్గర వీధి సినిమా అంటే ఎంత సంబరపడేవాళ్లమో.. సాయంత్రం భోజనం అయిన వెంటనే కూర్చోవడానికి గోనెపట్టా పట్టుకుని గుడి దగ్గరకు పరిగెట్టేవాళ్లం. అసలే వేసవి కాలం కావడంతో పెద్దవాళ్లు కూడా చల్లగాలికి బయట కుర్చీలు, మంచాలు వేసుకుని సినిమా చూసేవాళ్లు.. పందిరి కింద స్తంభాలాట, వెన్నెల్లో వెన్నముద్ద ఆటలు హహహ భలే ఉండేవి.. అప్పటి మా ఊహకి రాములవారి కళ్యాణం అంటే, పెద్ద పందిరి వెయ్యడం, పానకం పంచిపెట్టడం, సాయంత్రాలు సినిమాలు చూడడం హహహ. బుర్రకథ అంటే కాస్త చూసేవాళ్లం. హరికథ అంటే కుర్రాళ్లు డుమ్మా నే. హహ ఆ రాగాలు అర్థంకాక ఇక ఏం చేస్తాం. తోలుబొమ్మలాట కూడా అప్పుడప్పుడు పెట్టేవారు. పాపం ఈ కాళాకారులు అంతా ఇపుడు ఏం చేస్తున్నారో. భజన మాత్రం ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఏదేమైనా ఆ పల్లెటూరి వాసనలు, ఆ బాల్య జ్హాపకాలు పోయేవరకు నీడలా మనతోనే ఉంటాయి..
ReplyDelete