ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Sunday, August 4, 2013
మేమే అత్యంత దురదృష్టవంతులు..!
అదృష్టం, దురదృష్టం అన్నవి మన చేతిలో ఉండవు. పరిణామాలు జరిగినప్పుడు మనం అదృష్టవంతులో, దురదృష్టవంతులో తెలిసి పోతుంది.
మన సమాజంలో తల్లిదండ్రుల మాటే శిరోధార్యం. ముఖ్యంగా తండ్రి ఏం చెబితే అది వినటం, ఆచరించటం ఆనవాయితీ. దీనికి వ్యతిరేకత చెప్పటానికి కూడా సావకాశం ఉండేది కాదు. ఏది చదవమంటే అది చదవటం, ఏం చెబితే అది వినటం..ఆనవాయితీ. దాదాపుగా ప్రతీ ఇంట్లో అదే పరిస్థితి. దుస్తులు కొని పెట్టడం, వాటిని కుట్టించటం, బొమ్మలు కావాలంటే పెద్దల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి ఉండేది. తర తరాలుగా ఇదే తంతు. చిన్నప్పుడు పెద్దల చేతిలో అవస్థలు పడటం, తర్వాత పెద్దయ్యాక పిల్లలకు సుద్దులు చెప్పటం కొనసాగింది. ప్రతీ తరం ఈ విషయంలో ముందు ఇబ్బంది పడినా, పెద్దయ్యాక అధికారం చెలాయించింది.
కానీ మా తరం వచ్చేసరికి మ్యాటర్ రివర్స్ అయింది. చిన్నప్పుడు మా పెద్దల చేతిలో మగ్గిపోయిన మేం.. ఇప్పుడు మా పిల్లల చేతిలో మగ్గిపోతున్న పరిస్థితి. ఏ ఇంట్లో చూసినా పిల్లలదే ఆధిపత్యం సాగుతోంది. పిల్లలు ఏం కొనమంటే అది కొనాల్సిందే. పిల్లలు ఏ చానెల్ చూద్దామనుకొంటే ఆ చానెల్ చూడాల్సిందే. పిల్లలు ఏ కోర్స్ చదువుతామంటే దానికి ఫీజు కట్టాల్సిందే. పిల్లల కోసం మా సర్వస్వం అన్న ట్రెండ్ కొనసాగిస్తున్నాం. ఇది తప్పని చెప్పటం లేదు సుమా..!
సమాజంలో వచ్చిన ఒక మార్పుకి మా తరం వేదిక అయింది. అప్పటి దాకా కొనసాగిన ట్రెండ్ మా తరంలోనే రివర్స్ అయింది. ఇక నుంచి పిల్లల మాట నెగ్గే పరిస్థితులు కొనసాగుతాయి. మొత్తం మీద మేం మాత్రం చిన్నప్పుడు పెద్దల మాట విన్నాం. ఇప్పుడు పిల్లల మాట వింటున్నాం.. అందుచేత మేమే అత్యంత దురదృష్టవంతులం..!
Monday, July 29, 2013
మా ఊర్లో మహిళలు ఏం చేస్తున్నారంటే... వామ్మో...!
Saturday, July 13, 2013
మా ఊరు వెళ్లి వచ్చా..ఎంతటి మార్పు కనిపించిందో..!
రెండు రోజులు శెలవు పెట్టి మా ఊరు వెళితే రెండు వారాల పని బరువు నెత్తిన పడింది. దీన్ని తెముల్చుకొనేందుకు ఇంత సమయం పట్టింది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఈ బరువు బాధ్యతలు తప్పవు. దీనిపై బ్లాగు రాయటానికి ఇంతటి సమయం పట్టింది.
మా ఊరు కి వెళ్లే ముందు ఈ సారి కూడా మరిచిపోకుండా గోదావరమ్మ ను పలకరించాను. రావులపాలెం కు ఇవతర సిద్దాంతం బ్రిడ్జి ఎక్కగానే కారు ఆపుదామనుకొన్నా.. పిల్లలు పడుకొన్నారు. అందుకే రావులపాలెం దాటాక మాత్రం గౌతమి గోదావరి మీద పక్కకు తీసి కారు ఆపాను. పిల్లలను లేపి గోదావరమ్మ ను చూపిస్తే ఎంత పొంగిపోయారో. అప్పటికే తెల తెల వారుతోంది. ఆ చిరు చీకట్లో గోదావరి తల్లి అందాల్ని చూస్తే మాటలు చాలవనిపించింది. పిల్లల చేత డబ్బులు వేయించాను అఫ్ కోర్స్ మా శ్రీమతి నవ్వుకొంటూనే చూసింది ఈ దృశ్యాల్ని. హైదరాబాద్ అమ్మాయిలకు ఇవన్నీ పెద్దగా పట్టక పోవచ్చు. కొద్ది సేపు అక్కడ ఎంజాయ్ చేశాకే ముందుకు కదిలాం.
వేకువ జామున మా ఊరికి వెళుతుంటే ఒక్క సారిగా సందడి నెలకొంది. ఒకప్పుడు మా ఊరి నుంచి హైస్కూల్ కు వెళితే గొప్ప. అటువంటిది ఇప్పుడు ఉదయాన్ని ఊరికి స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు పొలోమని వచ్చేస్తున్నాయి. వాటిని ఎక్కి మా ఊరి పిల్లలు చదువులకు చక చకా ముందుకు సాగుతున్నారు. ఇది చూసి భలే ముచ్చట వేసింది. నేను యూనివర్శిటీ లో చదువుకొనేటప్పుడు మా ఊరి విద్యార్థుల చదువుల గురించి బాగా ఆలోచించే వాడిని. అప్పట్లో ఒక సారి వేకువ జామున రైలు కి వెళ్లాలంటే మా ఊరాయన సైకిల్ మీద నన్ను స్టేషన్ కు దింపాడు. ఆయన అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చక్కగా కాలేజ్ బస్స్ లో వెల్లిపోతున్నాడు. ఆ సంగతి ఆయన గుర్తు చేశారు.
ఊర్లోకి వెళ్లి కాసేపు సేద తీరాక చుట్టు పక్కల వారి పలకరింపులు మొదలయ్యాయి. మా ఊర్లో అనేక కులస్తులు ఉన్నారు. కానీ అంతా మావయ్య, బాబాయ్, పెద నాన్న అని పిలుచుకొంటాం. ఎవరికి ఈ పిలుపుల మీద పట్టింపు ఉండదు. అదంతా ఒక ఆత్మీయత.
ఆ రోజు మా ఊరి శివాలయంలో కళ్యాణం. ఈ కళ్యాణం చేయించుకొనేందుకు మేం వెళ్లాం. అందుకే సాయంత్రం దేవుడి ఊరేగింపు జరుగుతుంటే కూడా వెళ్లా. ఊరంతా ఒకటే పలకరింపులు. అప్పటి పిల్లలంతా పెద్దలై పోయారు. పెద్ద వారంతా వృద్దులై పోయారు. మా అబ్బాయి అయితే బోలెడు ఆశ్చర్య పోయాడు. మీకు ఇంత సర్కిల్ ఉందా అంటే ప్రశ్నలే. వాడికి ఇదంతా కాస్త కొత్త.
రాత్రి మాత్రం దేవుడి కళ్యాణం చేయించాం. ఎంతటి మధురమైన అనుభూతో. మా ఊరంటేనే నేను పడి చస్తాను. అటువంటి చోట దేవుడి కళ్యాణం చేయించుకొన్న అనుభూతిని ఒడిసి పట్టి తెచ్చుకొన్నాను. దేవుడి సేవలో తరించే ఒక మధుర జ్ఞాపకం. అందుకే ఇప్పటికి ఆ జ్ఞాపకాన్ని దాచుకొన్నాను. మర్నాటి విశేషాలు మళ్లా చెబుతాను.
Sunday, June 16, 2013
నాలుగు రోజుల్లో మా ఊరు వెళుతున్నా. అసలు ఆ ఫీలింగే అదరగొడుతోంది..!
సొంత ఊరంటే ఎవరికైనా కాస్తంత ప్రేమ. గోదావరి జిల్లా బిడ్డలకు మాత్రం కాస్తంత ఎక్కువ ప్రేమ అన్న మాట. అటువంటి గ్రూపులో మనం టాప్ ర్యాంక్. తూర్పు గోదావరి జిల్లాలో పోస్టాఫీసు కూడా లేని అనేక పల్లెటూరుల్లో మాది కూడా ఒకటి. పక్క ఊర్లో బస్సు దిగి మా ఊర్లోకి నడుచుకొంటూ వెళ్లిపోవచ్చు. ఊరి నడిబొడ్డు నుంచి పలకరింపులు మొదలువుతాయి. పావు గంట పట్టే నడక్కి గంటం పావు ఈజీగా పట్టేస్తుంది. కనిపించిన ప్రతీవాళ్లు ముఖమంతా నవ్వు చేసుకొని మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉంటే ఆ ఆప్యాయతను దేంతో కొలవగలుగుతాం. అందుకే ఊరిలోకి వెళ్లిన కొద్ది సేపటికే వాతావరణం మారిపోతుంది. మట్టి వాసన పలకరించి పులకరింప చేస్తు ఉంటుంది.
ఊర్లోకి వెళ్లాలంటే ముందుగానే గోదావరి దాటాలి కదా.. రైలులో ఊరెళితే మాత్రం కొవ్వూరు స్టేషన్ దాటగానే గేటు లోకి వెళ్లిపోతాను. గోదావరి దాటుతుంటే కిటికీ లోంచి చూడటం కన్నా గేటు నుంచి చూడటం భలే గమ్మతుగా ఉంటుంది. అందుకే నది ని అక్కడ నుంచి చూడటం అలవాటు. యూనివర్శీటి లో ఉన్నప్పటి నుంచి మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ వదల్లేదు. ఈ మధ్యన కారులో ప్రయాణం పెట్టుకొంటే రావులపాలెం వంతెన మీద మధ్య లోకి వెళ్లాక పక్కకు తీసి ఆపుతుంటాను. అప్పుడు నదిలోకి నాణేలు వేసేందుకు మా పిల్లలు కూడా పోటీ పడతారు. నదిలోకి డబ్బు వేయటం ఏంటి చాదస్తం అని నవ్వుకోవచ్చు గాక గోదావరి మీద ఇదంతా కామన్ మరి. కొన్ని ఫీలింగ్స్ కు లాజిక్కులు ఉండవు మరి.
ఊరికి వెళ్లినప్పుడు మాత్రం మొదట పరిగెత్తేది గుడిలోకే. ఎందుకంటే మా ఇంటి పక్క నే ఠీవిగా వెలసిన శివాలయం నాజీవితంతో ముడిపడి ఉంది. చిన్నప్పటి నుంచి ఆ గుడిలోనే నా ఆటపాటలు సాగాయి. అందుకే ఎప్పుడు అక్కడకు వెళ్లినా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవటం మాత్రం మానను. అంతే కాదు.,, ఎంత పెద్ద క్షేత్రంలోకి వెళ్లినా ఒక్క సారైనా మా ఊరి గుడిని గుర్తుచేసుకొంటాను. అక్కడ స్వామిని మనస్సులో తలచుకొంటాను. అంతే కాదు, ఆఫీసులో పని మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక్క సారి కళ్లు మూసుకొని మా ఊరి స్వామిని ధ్యానించుకొంటా. అది కూడా లాజిక్కు కు అందని బలమైన సెంటిమెంట్.
ఈ సారి కూడా కొన్ని జ్ఞాపకాల దొంతరను మోసుకొంటూ మా ఊరికి వెళుతున్నా. కొన్ని అనుభూతుల్ని పదిల పరచుకొని వెనక్కి వద్దామనుకొంటున్నా...!
Sunday, May 12, 2013
పెద్ద మాస్టారు కి మాత్రం కన్నీటి అభిషేకం..!

Thursday, April 18, 2013
మా ఊర్లో శ్రీరామ నవమి... మరిచిపోలేని జ్ఞాపకాలు..!
ఊర్లో ఎవరి ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నా చుట్టు పక్కల ఇళ్లలో సందడి ఉంటుంది. కానీ, ఊరంతా కదిలే పండుగ మాత్రం కచ్చితంగా శ్రీరాముని కళ్యాణం మాత్రమే. ఈ వేడుకకు ఊరంతా హడావుడి అనుకోవాల్సిందే . ఏప్రిల్ నెల మధ్య లో వచ్చే ఈ పండుగ కు ఒక స్పెషాలిటీ ఉంది. అదేమంటే మా చిన్నప్పుడు చాలా సార్లు ఈ పండుగ నాటికి మా పరీక్షలు పూర్తి అయిపోయేవి. దీంతో వేసవి సెలవుల్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వచ్చే పండుగ కావటంతో మా కుర్రకారు జోరుకి పట్ట పగ్గాలు ఉండేవి కావు. శ్రీ రామ నవమి కి వారం, పది రోజుల ముందే ఏర్పాట్లు మొదలయ్యేవి. అంటే ఊరి మధ్య లో ఉన్న రాముల వారి గుడి ముందు పెద్ద తాటాకు పందిరి వేసేవారు. దీంతో మేం చెలరేగిపోయి ఆడుకొనేందుకు ఒక వేదిక దొరికి నట్లయ్యేది. శ్రీ రామ నవమి ముందు రోజు సాయంత్రం గుడి ని ముస్తాబు చేయటంలో పోటీ పడేవాళ్లం. జెండా పండుగకు కలర్ పేపర్స్ తెచ్చినట్లు రక రకాల జెండాలు, పేపర్ కటింగ్స్ తెచ్చి అలంకరించేవాళ్లం.
శ్రీ రామ నవమి రోజు ఉదయమే గుడి దగ్గరకు చేరిపోయి ప్లేస్ లు వేసుకొని ఉండేవాళ్లం. దేవుని కళ్యాణం అంటే ఊరంతా కదలి అక్కడకు వస్తుంది కదా. అప్పుడు మనకు వెనకాల చోటు దక్కితే ఇబ్బంది కాబట్టి కుర్ర బ్యాచ్ ముందు వెళ్లి పోయి పెద్దలకు ప్లేస్ లు ఆపి ఉంచటం రివాజు అన్న మాట. అసలు రాముల వారి తత్వం ఏమిటి, ఎందుకు ఆయన ఆదర్శ పురుషుడు అయ్యాడు, సీతమ్మ తల్లి గొప్పతనం ఏమిటి అన్నది పంతులు గారు వివరించి చెబుతుంటే తన్మయత్వంతో వినే వాళ్లం. ఆ తర్వాత పానకం తాగేందుకు, వడపప్పు తినేందుకు పోటీ ఎలాగు తప్పదు కదా.. మధ్యాహ్నం దాకా ఊరంతా ఒక్క చోట చేరి రామయ్య తండ్రి కళ్యాణాన్ని తిలకిస్తుంటే .. రాములోరి పెళ్లికి ఊరంతా పండుగే అన్నట్లు ఉండేది. ఆ దృశ్యం ఎప్పటికీ కన్నుల ముందు కదలాడుతూ ఉండేది.
ఇక రాముల వారి కళ్యాణం సాయంత్రం నుంచి సాంస్క్రతిక కార్యక్రమాలు ఉండేవి. ముఖ్యంగా ఊర్లోని యూత్ అంతా కలిసి నాటకాలు ప్రాక్టీస్ చేసి నాటకం వేసేవాళ్లం. పెద్ద వాళ్లు పౌరాణిక నాటకం ఆడితే, కుర్ర బ్యాచ్ మాత్రం సాంఘిక నాటకానికి పరిమితం. ఈ నాటకం వచ్చే దాకా మాత్రం రోజు హరి కథ, బుర్ర కథ వంటివి ఉండేవి. దీంతో పాటు వీధిలో స్క్రీన్ కట్టి సినిమా వేసే వాళ్లు. ఆ సినిమా చూడటం అంటే అబ్బో . .. అదో వెరైటీ ఫీలింగ్. ఇప్పుడు తలచుకొంటే మాత్రం భలే నవ్వు వస్తుంది. ఎనీ హౌ శ్రీ రామ నవమి అంటే దాచుకొన్న అనుభూతుల్ని తలచుకొనే ఒక భక్తి భావన అన్న మాట.
Subscribe to:
Posts (Atom)