ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Sunday, August 4, 2013
మేమే అత్యంత దురదృష్టవంతులు..!
అదృష్టం, దురదృష్టం అన్నవి మన చేతిలో ఉండవు. పరిణామాలు జరిగినప్పుడు మనం అదృష్టవంతులో, దురదృష్టవంతులో తెలిసి పోతుంది.
మన సమాజంలో తల్లిదండ్రుల మాటే శిరోధార్యం. ముఖ్యంగా తండ్రి ఏం చెబితే అది వినటం, ఆచరించటం ఆనవాయితీ. దీనికి వ్యతిరేకత చెప్పటానికి కూడా సావకాశం ఉండేది కాదు. ఏది చదవమంటే అది చదవటం, ఏం చెబితే అది వినటం..ఆనవాయితీ. దాదాపుగా ప్రతీ ఇంట్లో అదే పరిస్థితి. దుస్తులు కొని పెట్టడం, వాటిని కుట్టించటం, బొమ్మలు కావాలంటే పెద్దల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి ఉండేది. తర తరాలుగా ఇదే తంతు. చిన్నప్పుడు పెద్దల చేతిలో అవస్థలు పడటం, తర్వాత పెద్దయ్యాక పిల్లలకు సుద్దులు చెప్పటం కొనసాగింది. ప్రతీ తరం ఈ విషయంలో ముందు ఇబ్బంది పడినా, పెద్దయ్యాక అధికారం చెలాయించింది.
కానీ మా తరం వచ్చేసరికి మ్యాటర్ రివర్స్ అయింది. చిన్నప్పుడు మా పెద్దల చేతిలో మగ్గిపోయిన మేం.. ఇప్పుడు మా పిల్లల చేతిలో మగ్గిపోతున్న పరిస్థితి. ఏ ఇంట్లో చూసినా పిల్లలదే ఆధిపత్యం సాగుతోంది. పిల్లలు ఏం కొనమంటే అది కొనాల్సిందే. పిల్లలు ఏ చానెల్ చూద్దామనుకొంటే ఆ చానెల్ చూడాల్సిందే. పిల్లలు ఏ కోర్స్ చదువుతామంటే దానికి ఫీజు కట్టాల్సిందే. పిల్లల కోసం మా సర్వస్వం అన్న ట్రెండ్ కొనసాగిస్తున్నాం. ఇది తప్పని చెప్పటం లేదు సుమా..!
సమాజంలో వచ్చిన ఒక మార్పుకి మా తరం వేదిక అయింది. అప్పటి దాకా కొనసాగిన ట్రెండ్ మా తరంలోనే రివర్స్ అయింది. ఇక నుంచి పిల్లల మాట నెగ్గే పరిస్థితులు కొనసాగుతాయి. మొత్తం మీద మేం మాత్రం చిన్నప్పుడు పెద్దల మాట విన్నాం. ఇప్పుడు పిల్లల మాట వింటున్నాం.. అందుచేత మేమే అత్యంత దురదృష్టవంతులం..!
Subscribe to:
Posts (Atom)