ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Sunday, October 7, 2012
సాక్షాత్తు సాయి మా ఇంటికి వచ్చాడు...!
నిజమే.. సాయి రాత్రి మా ఇంటికి వచ్చాడు. అసలు ఆ పేరులోనే ఒక రిలీఫ్ ఉంటుంది. సాయి అంటే అందుకే మా అందరికీ అంత ఆసక్తి. సాయి పలుకులు, వాక్యాలు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడు చూసినా ఒకటే తరహా.. అందుకే సాయి అంటే మా ఇంటిల్లి పాదికి అంత ఇష్టం. ఎన్ని రోజులైంది. సొంత ఊరి మనిషి... అనుకోకుండా ఇంటికి వస్తే భలే గమ్మతుగా ఉంటుంది కదా..! అదే జరిగింది. రాత్రి సాయి మా ఇంటికి వచ్చాడు.
ఫ్లాష్ బ్యాక్ లో చక్రం వెనక్కి తిప్పితే...!
గోదావరి జిల్లా లో ఒక సాధారణ పల్లెటూరు. నడిచి స్కూల్ కి వెళ్లి పరీక్ష పాస్ అయినందుకు.. ఇంట్లో సైకిల్ కొనిస్తే, దాని మీద కాలేజీ కి అక్కడ పరీక్ష పాస్ అయినందుకు... ఇంట్లో బ్యాగ్ సర్ది ఇస్తే యూనివర్శిటీ కి వెళ్లి పరీక్ష పాస్ అయినందుకు... ఇంట్లో అన్ని విషయాలు వివరించి చెప్పినందుకు ఉద్యోగం సంపాదించుకొన్నామన్న మాట. నాలుగు ముక్కల్లో ఫ్లాష్ బ్యాక్ ముగిశాక జర్నలిస్టు గా హైదరాబాద్లో స్థిర పడ్డాక అప్పుడప్పుడు మా ఊరికి వెళ్లి అంతా చూసుకోవటం కుదిరేది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి, సెలవులు తగ్గి, వయస్సు మీదకు రావటం మొదలెట్టాక.. ఊరికి వెళ్లటానికి వీలు లేకుండా పోయేది. సరిగ్గా అప్పుడే ఊరి నుంచి సాయి ఊడి పడ్డాడు.
సినిమా టిక్ గా ఇనిస్పిరేషన్ కథలు చెబితే బాగోదు కాబట్టి తాను కూడా జర్నలిస్టు ఉద్యోగం మీద మోజుతో నగరానికి రావటం, ఉప సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించటం చక చకా జరిగిపోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు తాను .. మా అందరికీ ఆత్మీయుడు. ఊరికి వెళ్లి అక్కడ విశేషాల్నీ కవర్చేసి నగరానికి వస్తాడు. ఆ తర్వాత మాకు అక్కడ విశేషాలు పూసగుచ్చినట్లు చెబుతాడు. అంతేనా.. వాళ్ల అమ్మ గారు పాలకోవా, సున్నుండలు వంటివి తోడుగా పంపిస్తారు కాబట్టి మనకు వాటా దక్కుతుంది. అయితే, ఇందుకోసం మా ఏర్పాట్లు మాకు ఉన్నాయి. నగరం నిద్ర పోయాకే జర్నలిస్టులు ఇంటి ముఖం పట్టాలన్న రూల్ ప్రకారం రాత్రి కూడా పది దాటాకే ఇల్లు చేరా. కొద్ది సేపటికే మా సాయి కూడా వచ్చేశాడు. అప్పటి నుంచి మా దృశ్య మాలిక మా ఊరికి వెళ్లి పోయింది.
ఎంత చెప్పుకొన్నా తరగని కబుర్లు.. పట్టుమని పది వీధులు లేకపోవచ్చు గాక, సరైన బస్ సౌకర్యం ఉండక పోవచ్చు గాక, పక్క ఊరి పోస్టాఫీసు, అక్కడి హైస్కూలే మాకు గతి కావచ్చు గాక.. అంత మాత్రాన మా ఊరిలో విశేషాలు తక్కువ అనుకోవద్దు సుమా.. అందరికీ అందరం బంధువులమే. అందుకే కుల మతాలు పక్కన పెట్టేసి చుట్టరికాలతో పిలుచుకోవటం అలవాటు. రాత్రంతా మా ఊరి విశేషాలతో కాలక్షేపం చేశాక, సాయి వాళ్ల అమ్మగారు ఇచ్చిన స్వీట్స్ ఖాళీ చేశాక నిద్ర పట్టింది. అందమైన రాత్రి అలవోకగా కరిగిపోయాక ఆదివారం వచ్చేసింది. ఇతర రకాల ఉద్యోగులు హాయిగా ఇళ్ల దగ్గర కాలక్షేపం చేస్తున్న వేళ.. జర్నలిస్టు ఉద్యోగాన్ని తలచుకొంటూ ఆఫీసు ముఖం పట్టాను.
Subscribe to:
Posts (Atom)