ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, August 25, 2012

చిన్న ప‌ల్లెటూరు లో ఆటోగ్రాఫ్‌..స్వీట్ మెమ‌రీస్‌..!

హై స్కూల్ లో ఏడో త‌ర‌గతి పూర్తి చేసుకొని ఎనిమ‌దో త‌ర‌గ‌తి లోకి అడుగు పెట్టాం. ఏడో త‌ర‌గ‌తి అప్పర్ ప్రైమ‌రీ స్కూల్ లో వెల‌గ‌బెట్టాక‌, హైస్కూల్ కి పొరుగు ఊరికి వెళ‌తాం అన్న మాట‌. అప్పటినుంచి హైస్కూల్ విద్యార్థుల స్థాయి వ‌చ్చేస్తుంది. పైగా కొత్త ఊరు, కొత్త ఫ్రెండ్స్ హ‌డావుడి మొద‌లైపోతుంది.
రెండు నెల‌లు గ‌డిచాక ఒక వార్త ఫ్లాష్ అయింది. అదేమిటంటే, మా బ్యాచ్ లోని ఒక అమ్మాయి ర‌జ‌స్వల అయింద‌ని తెలిసింది. ప‌ల్లెటూరు లో దీనికి కూడా హ‌డావుడి ఉంటుంది. బంధు మిత్రుల్ని పిలిచి భోజ‌నాల కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి నిజాయితీ గా ఫ్రెండ్స్ అంద‌రికీ క‌బురు పంపించేసింది. కొద్ది రోజుల‌కే మేం అంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అందునా ఈ అమ్మాయి అంద‌రితోటి చ‌క్కగా క‌లిసిపోయి సంద‌డిగా ఉండేది. పైగా హైస్కూల్ లో చేరిన కొత్త లో వ‌చ్చిన ఫంక్షన్ అన్న మాట‌. అందుచేత త‌లో కొంత చందా వేసుకొని ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామ‌నుకొన్నాం. ఏం కొనాలి అనేదానిపై చ‌ర్చలు తీవ్రంగా సాగాయి. ఈ లోగా టౌన్స్ లో ఇటువంటి ఫంక్షన్స్ జ‌రిగిన‌ప్పుడు కేక్ కొని దాన్ని కట్ చేయిస్తార‌ని ఒక క‌బురు అందింది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో అప్పట్లో ఎవ‌రికీ తెలీదు. కానీ, త‌ల‌కు రెండు రూపాయ‌ల చొప్పున చందాలు వ‌సూలు చేశాం. యాభై రూపాయ‌ల పైనే వ‌సూలు అయింది. దీంతో టౌన్ కు సైకిల్ మీద వెళ్లి ఒక కేక్ తెప్పించేశాం.
ఆ రోజు ఆదివారం కావ‌టంతో క్లాస్ లోని వాళ్లం అంతా స్కూల్ ద‌గ్గర పోగు అయ్యాం. నాలుగు ఊళ్లకు అది ఒక‌టే హైస్కూల్ మ‌రి. అందుకే అంద‌రం వ‌చ్చాక వాళ్ల ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ఈ లోగా కేక్ వ‌చ్చేసింది. ఆరాటం ఆగ‌క కేక్ ఒకసారి చూడాల‌నిపించి ఓపెన్ చేయించాం. తీరా చూస్తే.. దానీ మీద క్రీమ్ తో హ్యాపీ బ‌ర్త్ డే అని రాసి ఉంది. ఈ సంద‌ర్భంలో ఈ వాక్యం మ్యాచ్ కాదు క‌దా.. ఎలా అన్న డౌట్ వ‌చ్చింది. దీన్ని ఇంగ్లీస్ లో ఏమంటారో మాకు తెలియ‌దాయే..! చివ‌ర‌కు బ‌ర్త్ అనే పదం తీసేశాం. అంటే హ్యాపీ డే అన్న మాట‌. వెంట‌నే క‌ట్ట క‌ట్టుకొని అక్కడ‌కు చేరాం. మా హ‌డావుడి చూసి ఆ అమ్మాయి పేరంట్స్, బంధువులు భ‌లే న‌వ్వుకొన్నారు. కానీ, అంతా క‌ల్మషం లేని స్నేహితులం క‌దా, పెద్దగా ప‌ట్టించుకోలేదు. అందుకే ఇంటి మ‌ధ్యలో ఈ కేక్ ను అంద‌రికీ పంచేశాం. ఎవ‌రికి ఇది హ్యాపీ డే అన్న విష‌యం ప‌క్కన పెడితే అంతా హ్యాపీగా ఆ ఈవెంట్ ను ఎంజాయ్ చేశాం. త‌ర్వాత హైస్కూల్ చ‌దువు పూర్తవుతూనే ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకొంది. ఇప్పుడు వాళ్ల పిల్లలు ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్నార‌ట‌.

Saturday, August 11, 2012

మా హైస్కూల్ లో అందాల రాక్షసి క‌థ‌..!

గోదావ‌రి జిల్లా లో ఒక మారు మూల గ్రామం మాది. బ‌స్ సౌక‌ర్యం లేదు, పోస్టాఫీసు అంత క‌న్నా లేదు. ఇవ‌న్నీ ద‌ర్జాగా ఉన్న ఒక పెద్ద ఊరి ప‌క్కనే ఒదిగిపోయాం. అందుక‌ని ఆ పెద్ద ఊరి కి ఉన్న సౌక‌ర్యాల‌న్నీ మాకు ఉన్నట్లే. కుగ్రామం కాబ‌ట్టి మా ఊరి బ‌డిలో ఐదో త‌ర‌గ‌తి దాకానే చదువులు. ఆ త‌ర్వాత ప‌క్క ఊరికి వెళ్లి చ‌దువుకోవాల్సిందే. ఆరో త‌ర‌గ‌తి లో చేరాం అంటే నిజంగా పెద్దవాళ్లం అయిపోయిన‌ట్లు అన్న మాట‌. హాఫ్ నిక్కర్ ఎగ‌వేసుకొంటూ ప‌క్క ఊరికి పరిగెత్తటం ఒక ద‌ర్జా. అయితే ఇందులో రెండు శ్రేణులు ఉంటాయి. న‌డిచి వెళ్లి న‌డిచి వచ్చే మామూలు బ్యాచ్ ఒక‌టైతే, త‌ల్లి దండ్రుల్ని కాకా ప‌ట్టి సైకిల్ సంపాదించుకొన్న బ్యాచ్ ఒక‌టి. ఎట్టకేల‌కు సైకిల్ సంపాదించుకొన్నప్పటికీ అంద‌రం క‌లిసే షేర్ చేసుకొనే వాళ్లం. అబ్బాయిల వ‌ర‌కు ఇది స‌రే, అమ్మాయిల‌కు మాత్రం చిక్కు త‌ప్పుదు. అస‌లు పేరంట్స్ ను ఒప్పించి హైస్కూల్ కు వెళ్లటమే ఒక సాహ‌సం. అందుచేత ఆడ పిల్ల లంతా ఒక గుంపుగా చేరి ప‌క్క ఊరికి న‌డ‌క దారి ప‌ట్టే వారు. వాళ్లు పాపం ఉస్సూరు మంటూ సాయంత్రం న‌డిచి ఇంటికి చేరుకొనే వాళ్లు. మేం మాత్రం ద‌ర్జాగా సైకిల్ మీద రివ్వున దూసుకొని వెళ్లే వాళ్లం.
మా బ్యాచ్‌లో ఒక అమ్మాయి ఉండేది. చ‌దువులో చాలా ఫాస్ట్ గా ఉండేది. బుర్ర దించుకొని త‌న పని తాను చేసుకొనే త‌త్వం ఆమెది. కానీ, అన్ని విష‌యాల్లోనూ అబ్బాయిల‌తో పోటీ ప‌డేది. చ‌దువులోనూ, ఆట పాట‌ల్లోనూ యాక్టివ్ గా ఉండేది. స్కూల్ విద్యార్థుల క‌మిటీలో ఆమె మెంబ‌ర్‌. ఏదైనా తేడా వ‌స్తే నేరుగా హెడ్ మాస్టర్ ద‌గ్గర ఫిర్యాదు చేసేది. ఎన్ని చేసినా ఇంటికి వెళ్లాలంటే మాత్రం ఉస్సూరు మంటూ న‌డుచుకొంటూ వెళ్లాల్సిందే. చివ‌ర‌కు ఎట్టకేల‌కు మా బ్యాచ్ ప‌దో త‌ర‌గ‌తి కి చేరుకొంది. అప్పటి దాకా హాప్ నిక్కర్ గాళ్లం అంద‌రం ప్యాంట్ ల బాట ప‌ట్టాం. అటు అమ్మాయిలంతా పొట్టి ప‌రికిణీలు వ‌దిలేసి కండువా, ఓణీ డ్రెస్ లోకి మారిపోయారు.
రెండు రోజులు గ‌డిచాక బాంబు లాంటి వార్త పేలింది. ఇందాక ప్రస్తావ‌న చేసిన అమ్మాయి సైకిల్ తో స్కూల్ కి వ‌చ్చింద‌న్న వార్త అన్ని క్లాసుల‌కు పాకిపోయింది. ఇంకేముంది, అచ్చమైన ప‌ల్లెటూరు బ‌డికి ఒక అమ్మాయి సైకిల్ తో వ‌చ్చేసిందా..! సాయంత్రం అయ్యేస‌రికి అంతా బ‌డి బ‌య‌ట మూగిపోయారు. అంత ధైర్యం ఉన్న అమ్మాయి కూడా ఒక్కసారిగా కంగారు ప‌డిపోయిన ప‌రిస్థితి. ఇంత మంది మ‌ధ్య నుంచి సైకిల్ తో ఇంటికి వెళ్లటం ఎలా. నెమ్మదిగా న‌డిపించుకొంటూ బ‌య‌లు దేరింది. మిగిలిన వారు కూడా ఫాలో..! ఆ నాటి నుంచి ప్రతీరోజూ ఆమె త‌మ్ముడు సైకిల్ న‌డిపించుకొని ఊరి బ‌య‌ట‌కు తెస్తే అక్కడ నుంచి తొక్కుకొంటూ ప‌క్కఊరి స్కూల్ కి వ‌చ్చేసేది. త‌ర్వాత సాయంత్రం ఊరి బ‌య‌టే సైకిల్ త‌మ్ముడికి అప్పగించేసి బుర్ర దించుకొని న‌డ‌క ప‌ట్టేది. వేసవిలో వాళ్ల మావ‌య్య గారి ఊర్లో సైకిల్ నేర్చుకొన్నప్పటికీ, సొంత ఊర్లో సైకిల్ మీద షికారు చేయ‌లేని ప‌రిస్తితి. ఆ త‌ర్వాత కాలంలో ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామ‌లి లైఫ్ లో సెటిల్ అయిపోయార‌నుకోండి. అంద‌రితో చాలా గౌర‌వంగా ఉండే ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఇవాల మా ఊర్లో సైకిల్ తో స్కూల్ కి, బైక్ పై కాలేజీ కి వెళ్లటం చాలా కామ‌న్ మ‌రి..!

Monday, August 6, 2012

వానాకాలం చ‌దువులు..

చిన్నప్పుడు వాన ప‌డుతుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. అప్పుడు నిజంగా మావి వానాకాలం చ‌దువ‌లే. ఎందుకంటే జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల కావ‌టంతో వరండాల్లో, ఇరుకు గ‌దుల్లో స‌ర్దుకోవ‌టం త‌ప్పనిస‌రి. వాన ప‌డితే త‌ప్పనిసరిగా కంటిన్యూ ప్రక‌టించేవారు. అంటే మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యాన్ని ర‌ద్దు చేసి మ‌రో గంట పాఠాలు చెప్పేసి ఇంటికి పంపించేస్తార‌న్న మాట‌. స‌రిగ్గా అక్కడే అస‌లు క‌థ మొద‌లయ్యేది. ఎందుకంటే మేమంతా పొరుగూరి నుంచి వ‌చ్చి చ‌దువుకొనే బ్యాచ్ క‌దా. అందుకే ఉద‌యాన్నే ఇంటి దగ్గర నుంచి క్యారియ‌ర్ తో స‌హా స్కూల్ కి వ‌చ్చే వాళ్లం. కంటిన్యూ చేసి పిల్లల్ని ఇంటికి వెళ్లిపోమ‌ని చెప్పేవారు. కానీ, మేం మాత్రం అక్కడే క్యారేజీలు తినేసి చ‌క్కగా కొద్దిసేపు పుస్తకాలు చదువుకొంటూ అక్కడే ఉండేవాళ్లం. ఈ సీన్ టీచ‌ర్లు ఇళ్లకు బ‌య‌ల్లేరే దాకా మాత్రమే .
ఆ త‌ర్వాత సాయంత్రం దాకా మా ఇష్టం అన్న మాట‌. వాన ప‌డుతూ ఉండే స్కూల్ లోనే వ‌రండాల్లో నే ర‌క ర‌కాల గేమ్స్ తో విజృంభించే వాళ్లం. కాస్త తెరిపి ఇచ్చాక పొలాల మీద‌కు దండు బ‌య‌లు దేరేది. మా హైస్కూల్ ప్రాంతంలో కూర‌గాయ‌లు ఎక్కువ‌గా సాగ‌య్యేవి. ఆ కూర‌గాయ‌ల తోట‌ల్లో ప‌డి ప‌రుగులు తీస్తుంటే భ‌లే గ‌మ్మతుగా ఉండేది. ఒక సారి ఇలాగే రెచ్చిపోయి అల్లరి చేస్తుంటే మా హెడ్ మాస్టర్ గారికి డౌట్ వ‌చ్చి వెన‌క్కి తిరిగి వ‌చ్చేశారు. జంప్ అయిపోయిన వాళ్లు పారిపోగా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ది మంది దొరికి పోయారు. చింత‌కాయ పచ్చడి ఎలా ఉంటుందో రుచి చూపించి ఆయ‌న ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులు కుదురుగా కుంటూ కుంటూ స్కూల్ కి వెళ్లాం. త‌ర్వాత మళ్లీ క‌థ మామూలే. అస‌లు వాన‌లు ప‌డాలి వాన దేవుడా ఇంటి దగ్గర రైతాంగం కోరుకోవ‌టం ఏమో కానీ, మేం మాత్రం బ‌లంగా కోరుకొనే వాళ్లం.